ఆ ప్రభావం నాపై పడుతుందా?
ప్రెగ్నెన్సీ సమయంలో సిగరెట్ తాగడం వల్ల ‘హైపటైటిస్–సి’ వస్తుందని చదివాను. నేను గర్భవతిని. సిగరెట్ తాగే అలవాటు లేదు. అయితే మా ఆయన ఇంట్లోనే విపరీతంగా సిగరెట్లు కాలుస్తారు. ఈ ప్రభావం నాపై ఏమైనా ఉంటుందా?
– జి.కె., నర్సాపూర్
హెపటైటిస్–సి అనేది వైరస్ వల్ల లివర్ (కాలేయం)కి వచ్చే ఇన్‌ఫెక్షన్. ఇది సిగరెట్ తాగడం వల్ల రాదు. వాడిన సిరంజ్‌లు వాడడం, హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ ఉన్న వాళ్ల రక్తం ఎక్కించడం, వాళ్ల రేజర్లు వాడడం, కలయిక ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుంది. హెపటైటిస్–సి ఇన్‌ఫెక్షన్ ఉన్నవాళ్లు సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీవారు తాగి వదిలే సిగరెట్ పొగ నువ్వు రోజూ పీల్చడం వల్ల, గర్భంలోని బిడ్డపై దుష్ఫ్రభావం పడుతుంది. దీనివల్ల అబార్షన్లు, బిడ్డ బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండానే కాన్పులు అవ్వడం, పుట్టిన బిడ్డలో మానసిక లోపాలు తలెత్తే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మెల్లగా మీ ఆయనకు సిగరెట్ పొగ వల్ల ఏర్పడే దుష్ఫలితాల గురించి వివరించి చెప్పి చూడటం మంచిది. వినకపోతే ఆయన సిగరెట్ తాగే సమయంలో, పొగకు దూరంగా నువ్వు వేరే గదిలో ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
ఈ మధ్య బాలింతల మరణాల గురించి ఎక్కువగా వింటున్నాం. ఆస్పత్రులు, పరికరాల అపరిశుభ్రత వల్ల రకరకాల ఇన్‌ఫెక్షన్‌లు సోకుతున్నాయంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? ఏ కారణాల వల్ల బాలింతల మరణాలు సంభవిస్తాయి?
– డి.జానకి, హైదరాబాద్
బాలింత మరణాలు కాన్పు సమయం నుంచి 42 రోజుల లోపల ఎప్పుడైనా జరగవచ్చు. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం (పోస్ట్‌పార్టమ్ హేమరేజ్), బీపీ పెరగటం, గుర్రపు వాతం (ఫిట్స్ రావటం), ఇన్‌ఫెక్షన్స్, రక్తనాళాలలో రక్తం గూడుకట్టి, ఊపిరితిత్తులలోకి పాకి శ్వాస ఆగడం (పల్మనరీ ఎంబోలిజమ్), గుండె పెరిగి, దానిమీద భారం (పోస్ట్‌పార్టమ్ కార్డియో మయోపతి) వంటి ఎన్నో కారణాల వల్ల బాలింత మరణాలు జరగవచ్చు. బాలింతలో రక్తహీనత వల్ల, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, ఇన్‌ఫెక్షన్ కారక క్రిములు తొందరగా వ్యాప్తి చెంది ఇన్‌ఫెక్షన్‌లు రావటానికి కారణమవుతాయి. కాన్పు తర్వాత, గర్భాశయం లోపల పచ్చిగా ఉండటం, కుట్లు పడటం వల్ల మలద్వారం దగ్గర నుంచి క్రిములు, గర్భాశయంలోకి, పొట్టలోకి, రక్తంలోకి పాకే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆస్పత్రిలో వాడే పరికరాలు, ఇతర ఇన్‌స్ట్రుమెంట్స్ సరిగా శుభ్రపరచకుండా, స్టెరిలైజ్ చెయ్యకుండా తిరిగి వాడటం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు రావచ్చు. సాధారణంగా అన్నీ ఆస్పత్రులలో పరిశుభ్రతను పాటిస్తారు. కాన్పు తర్వాత, డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్స్ కోర్సును తప్పక వాడాల్సి ఉంటుంది. అలాగే వారు చెప్పిన జాగ్రత్తలు పాటించడం వల్ల చాలావరకు ఇన్‌ఫెక్షన్‌లను, సమస్యలను అరికట్టవచ్చు.
కొన్ని సందర్భాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సమస్య డాక్టర్ల చెయ్యిదాటి బాలింత మరణాలు జరుగుతుంటాయి.
నా ఫ్రెండ్ ఒకరికి ఎండోమెట్రియోసి ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. ‘ఎండోమెట్రియోసి’ వల్ల రకరకాల క్యాన్సర్‌లు రావచ్చు అనే మాట కూడా విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ‘ఎండోమెట్రియోసి’ అంటే ఏమిటి?
– కె.అరుణ, ఖమ్మం
ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొర బ్లీడింగ్ రూపంలో చిన్న చిన్న ముక్కలుగా బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఈ పొర గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్‌ల ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కొందరిలో కరిగిపోతుంది. కొందరిలో ఈ పొర చిన్న చిన్న ముక్కలుగా గర్భాశయం పైన, వెనుక భాగంపైన, అండాశ యాల పైన, పేగుల పైన, మూత్రాశయం పైన... ఇలా అనేక ప్రదేశాలలో అతుక్కుని, ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఇక్కడ కూడా బ్లీడింగ్ అవుతుంది. దీనినే ఎండోమెట్రియోసిస్ అంటారు.
ఇలా ప్రతి నెలా అయిన బ్లీడింగ్, గడ్డకట్టి పైన చెప్పిన ప్రదేశాలలో పేరుకుంటూ ఉంటుంది. దీని వల్ల గర్భాశయం, అండాశయాలు, పేగులు మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి అంటుకుపోతాయి. ఎండోమెట్రియోసిస్ వల్ల పీరియడ్ సమయంలో పొత్తికడుపులో నొప్పి, నడుంనొప్పి, కలయికలో నొప్పి, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఎండోమెట్రియోసిస్ అండాశయాలలో ఏర్పడి, రక్తం గడ్డకట్టడం వల్ల తయారయ్యే గడ్డలను చాక్లెట్ సిస్ట్ అంటారు. ఎండోమెట్రియోసిస్ వల్ల క్యాన్సర్ రావడం చాలా అరుదు. l