ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను ఎక్కువగా ఇంట్లోనే ఉంటాను. ఎండలో నిలబడాలని అనిపించదు. ఒకవేళ నిలబడడం తప్పనిసరి అయితే ఎంతసేపు ఉండాలి? గర్భిణీ స్త్రీలకు విటమిన్–డి ఏ రకంగా ఉపయోగపడుతుంది?
– పీఎన్, రామగుండం
ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో ఉండటం, బయటికి కారుల్లో వెళ్లడం, ఆఫీసులోనే ఉండడం వల్ల ఎండలోకి చాలావరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం గడిచిపోతోంది. రోజూ ఉదయాన్నే వచ్చే ఎండలో ఓ పదిహేను నిమిషాలు ఉండడం వల్ల సూర్యరశ్మిలో ఉండే విటమిన్–డి.. మన చర్మం ద్వారా శరీరంలోకి, రక్తంలోకి చేరుతుంది. ఈ విటమిన్–డి మన రక్తంలోకి క్యాల్షియం, ఫాస్ఫరస్ ఖనిజాలను ఎక్కువగా చేరేటట్లు దోహదపడుతుంది. దానివల్ల ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. వాటి పనితీరు మెరుగ్గా ఉంటుంది. విటమిన్–డి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గర్భంలో పెరిగే శిశువుకు అవయవాలు పెరగడానికి, ఎముకలు, కాళ్లు, చేతులు, వెన్నుపూస ఎదుగుదలకు క్యాల్షియం ఎంతో అవసరం. శిశువు ఎదుగుదలకు కావలసిన క్యాల్షియం తల్లి రక్తం నుంచే వెళ్లాలి. దానివల్ల తల్లిలో కూడా క్యాల్షియం తగ్గి నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి ఏర్పడతాయి. తల్లిలో క్యాల్షియం తక్కువగా ఉంటే శిశువు కండరాలు, ఎముకల ఎదుగుదలలో ఇబ్బందులు రావొచ్చు. అంతేకాకుండా అవి దృఢంగా ఉండలేకపోవచ్చు. కాబట్టి విటమిన్–డి గర్భిణీలలో ఎంతో అవసరం. ఎండలో నిలుచోలేకపోతే ఆహారంలో గుడ్డు, పాలు, పెరుగు, ఆకుకూరలు, కాలేయం, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్యాల్షియం, విటమిన్–డి కలిగిన మాత్రలు రోజుకొకటి తొమ్మిది నెలలు తీసుకోవాలి. గర్భిణీలు కేవలం ఎండలోనే ఉండటం వల్ల తల్లికి, బిడ్డకీ సరిపడా విటమిన్–డి దొరకదు. కాబట్టి ఆహారం, మాత్రలు తప్పనిసరి.
ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు లేదా ఫంక్షన్‌లకు వెళ్లాల్సివచ్చినప్పుడు నాలో టెన్షన్ మొదలవుతుంది. ఇలా తరచుగా టెన్షన్‌కు గురి కావడం వల్ల నెలసరి క్రమం తప్పుతుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? టెన్షన్ ప్రభావం నెలసరి మీద ఏ రకంగా ఉంటుంది? నివారణ ఏమిటి?
– జీయస్, నూజివీడు
నెలనెలా పీరియడ్స్ సక్రమంగా రావాలంటే గర్భాశయ, అండాశయాలు, మెదడు నుంచి వచ్చే హార్మోన్స్ అన్నీ సక్రమంగా పని చెయ్యాలి. తరచూ టెన్షన్ పడడం, డిప్రెషన్‌లోకి వెళ్లడం, ఉన్నట్టుండి బరువు పెరగడం, తగ్గడం వంటి ఎన్నో సమస్యల వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్‌ఎస్‌హెచ్, సీహెచ్, ప్రొలాక్టిన్, టీఎస్‌హెచ్ వంటి ఎన్నో హార్మోన్లు సక్రమంగా విడుదల కాకపోవచ్చు. ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం జరుగుతుంది. కొందరిలో పీరియడ్స్ ఆలస్యంగా రావడం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం లేదా తొందరగా రావడం, బ్లీడింగ్ తక్కువ అవ్వడం వంటివి జరగవచ్చు. దీర్ఘకాల టెన్షన్ వల్ల కొందరిలో కొన్ని నెలల పాటు పీరియడ్స్ ఆగిపోవచ్చు కూడా. మానసిక ఒత్తిడి, టెన్షన్ తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, వాకింగ్, వ్యాయామాలు చెయ్యడం ఉత్తమం. వీటితో మార్పు లేకపోతే ఇవి పాటిస్తూనే, డాక్టర్ సలహాలు పాటించడం మంచిది.
ఫైబ్రోమయాల్జియా అంటే ఏమిటి? ఏ సందర్భంలో ఇది వస్తుంది? దీని వల్ల హాని ఏమైనా జరుగుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయగలరు.
–సీకె, ఖమ్మం
ఫైబ్రోమయాల్జియా అనే పరిస్థితిలో ఒళ్లు నొప్పులు, అలసి పోవడం, ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పి, నిద్ర పట్టకపోవడం, కడుపులో నొప్పి, డిప్రెషన్, ఆందోళన వంటి లక్షణాలు ఉంటాయి. ఇది చాలా వరకు జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. దీని నిర్ధారణకు ఎటువంటి పరీక్షలు లేవు. ఇటువంటి లక్షణాలు ఉన్న వేరే వ్యాధుల నిర్ధారణకు చేసే పరీక్షలు మామూలుగా ఉన్నప్పుడు, ఇది ఫైబ్రోమయాల్జియా లక్షణాలు అని నిర్ధారించడం జరుగుతుంది. ఇందులో మెదడు, వెన్నుపూస, నరాలు.. చిన్ననొప్పికి, స్పర్శకి కూడా పెద్ద నొప్పిగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి, ఇన్‌ఫెక్షన్స్, శారీరక ఒత్తిడి వంటి పరిస్థితులలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చికిత్సలో భాగంగా మందులతో పాటు వ్యాధి గురించి అవగాహన, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి కొద్దిగా ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment