నాకిప్పుడు మూడవ నెల. మౌత్ అల్సర్స్, మెడ దగ్గర గడ్డలు వచ్చిపోతున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాగే వస్తే నాకు, మావారికి ఇద్దరికీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. వాడాము. తగ్గాయి. ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. వీటి వల్ల పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా? – ఊరు, పేరు రాయలేదు.
మీరు చెప్పినదాన్ని బట్టి ఇది రిపీటెడ్ ఇన్‌ఫెక్షన్‌లా ఉంది. నొటిలో లేదా వెజైనా దగ్గర అల్సర్స్ రావడం, మీవారికి కూడా రావడం లాంటివి చాలావరకు సిఫిలిస్ అనే సుఖవ్యాధిలో కనిపిస్తాయి. ఇది గనక ప్రెగ్నెన్సీలో వస్తే తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుంది. వెంటనే సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.
ఒకవేళ ట్రీట్‌మెంట్ అందకపోతే బిడ్డ మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కొంతమందిలో ఏ సింప్టమ్స్ లేకుండా ఇన్‌ఫెక్షన్ ఉందని మూడవ నెల తర్వాతే తెలుస్తుంది. అందుకే అల్సర్స్ వచ్చాయనగానే వీడీఆర్‌ఎల్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు గర్భిణీలకు చేసే రొటీన్ టెస్ట్‌లలో భాగంగా వీడీఆర్‌ఎల్ టెస్ట్‌నూ చేస్తున్నారు. లైంగిక సంపర్కమప్పుడు కండోమ్‌ని వాడితే ఈ ఇన్‌ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. మీరు వెంటనే మీ దగ్గర్లోని గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.
కొన్ని రకాల రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనల్ స్వాబ్ టెస్ట్‌లు చేస్తారు. ఈ రక్తపరీక్షలన్నిటిని కూడా గర్భిణీలకు మూడవ, ఏడవ, తొమ్మిదవ నెలల్లో రిపీట్ చేసి, ట్రీట్‌మెంట్ ఇచ్చాక.. క్యూర్ అయిందా లేదా అని కూడా చెక్ చేయాలి. ఇది పెన్సిలిన్ ఇంజెక్షన్‌తో బాగా క్యూర్ అవుతుంది. వీడీఆర్‌ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో తర్వాత టెస్ట్ టీపీపీఏ (ఖ్కీ్కఅ), టీపీహెచ్‌ఏ (ఖ్కీఏఅ) చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో ఏమీ తెలియకపోతే ట్రీట్‌మెంట్ ఇచ్చి, రెండుమూడు వారాల తర్వాత మళ్లీ శాంపుల్ పంపించాలి.
ఎర్లీ సిఫిలిస్ ఇంజెక్షన్ ఇస్తే.. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్‌తో బాడీ స్కాన్ చేయించుకోవాలి. అయిదవ, ఏడవ నెలల్లో చేసే స్కాన్‌లో ఈ ఇంజెక్షన్ వల్ల పొట్టలోని బిడ్డలో ఏమైనా మార్పులు వచ్చాయా అని చెక్ చేస్తారు. వెజైనల్ ఏరియాలోనూ అల్సర్స్ ఉంటే తొమ్మిదవ నెలలో మళ్లీ టెస్ట్ చేసి.. సిజేరియన్ డెలివరీని రికమెండ్ చేస్తారు. డెలివరీ తర్వాత బిడ్డకు తల్లి పాలివ్వవచ్చు. బ్రెస్ట్ మీద యాక్టివ్ లీజన్స్ లేకపోతే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్‌ని సజెస్ట్ చేస్తారు. అయితే పిల్లల డాక్టర్‌కి ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలియజేయాలి. బిడ్డను కూడా మూడవ నెలలో ఒకసారి, ఏడాదిన్నర వయసప్పుడు ఒకసారి టెస్ట్స్ చేస్తారు.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
ఇవి చదవండి: అందరూ మెచ్చుకుంటున్నా.. లోలోపల అనుమానం!?
Comments
Please login to add a commentAdd a comment