ఆ వైరస్‌కు చికిత్స లేదు
cytomegalo virus(cmv) గురించి ఈ మధ్య విన్నాను. దీని గురించి గర్భిణి స్త్రీలు తగిన జాగ్రత్తతో ఉండాలంటున్నారు. ఈ వైరస్ సమస్య పాశ్చాత్య దేశాల్లోనే ఉందా? మన దేశంలో కూడా ఉందా? ఈ వైరస్ గురించి సవివరంగా తెలియజేయగలరు.
– వి.జానకి, మందమర్రి
సైటోమెగలో వైరస్ (సీఎంవీ) అనేది హెర్పిస్ జాతికి చెందిన వైరస్. ఇది పాశ్చాత్య దేశాలలోనే కాకుండా, మన భారతదేశంలో కూడా ఉంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి లాలాజలం, రక్తం, మూత్రం, వీర్యం, యోని ద్రవాల ద్వారా సంక్రమిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, కీళ్లనొప్పులు, లింఫ్‌నోడ్ వాపులు వంటి లక్షణాలు ఏర్పడి, తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల మామూలు వాళ్లకు ఇబ్బంది ఉండదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో, ఎయిడ్స్ ఉన్నవారిలో ఈ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉండవచ్చు. అలానే దీనివల్ల గర్భిణులకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ, సీఎంవీ వైరస్ తీవ్రంగా వస్తే గర్భంలోని శిశువుకి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10% శిశువులలో సీఎంవీ ఇన్‌ఫెక్షన్ వల్ల అవయవ లోపాలు, చూపులో ఇబ్బంది, వినికిడి లోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండవచ్చు. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ తల్లి నుంచి బిడ్డకు మాయ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్‌కు చికిత్స లేదు. గర్భిణీ స్త్రీలు, ఈ వైరస్ నుంచి వీలైనంత దూరంగా ఉండటానికి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, శారీరక శుభ్రతను పాటించడం ఉత్తమం.
ఛాతీ తక్కువ ఉన్నవాళ్లు పుష్ అప్ బ్రాలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? పుష్ అప్ బ్రాలు వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? కుడి, ఎడమ రొమ్ముల్లో తేడా ఉండటం అనేది అనారోగ్యానికి సూచనగా భావించాలా?
– సి.కె., నెల్లూరు
పుష్ అప్ బ్రాలు ఛాతీని సపోర్ట్ చేస్తూ ఎత్తి పెట్టినట్లు చేసి కొద్దిగా పైకి, ముందుకి వచ్చినట్లు చేస్తూ, రొమ్ము పరిమాణం గుండ్రంగా, పెద్దగా కనిపించేటట్లు చేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కేవలం ఈ బ్రాలు వేసుకోవడం వల్లే రాదు. సాధారణంగా బ్రాను రెగ్యులర్‌గా, సంవత్సరాల తరబడి రోజంతా వేసుకుంటూ ఉండటం వల్ల, కొద్దిగా రొమ్ముకి రక్త ప్రసరణ తగ్గడం, రక్తంలోని, లింఫ్‌లోని మలినాలు సరిగా సర్క్యులేట్ అవ్వకపోడం, దాని ద్వారా రొమ్ములో మలినాలు పేరుకొని, శరీర తత్వాన్ని బట్టి కొందరిలో అనేక సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనేది కొంతమంది పరిశోధకుల అంచనా. రెగ్యులర్‌గా బ్రా వేసుకోవడం వల్ల మెలటోనిన్ అనే పదార్థం తక్కువగా తయారవుతుంది. మెలటోనిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్, ఇది మంచి నిద్రని ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముసలితనాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఇది కొద్దిగా క్యాన్సర్ బారి నుంచి తగ్గిస్తుంది. పుష్ అప్ బ్రాలు అనే కాకుండా వేరే ఏ బ్రా అయినా కూడా, మరీ బిగుతుగా కాకుండా, కరెక్ట్ సైజు వేసుకోవటం మంచిది. అవసరం లేదనుకున్నప్పుడు వేసుకోకపోవటం మంచిది. రాత్రిపూట బ్రాలు ధరించకపోవడం మంచిది. కొందరిలో పుట్టుకతోనే రొమ్ములు పరిమాణంలో తేడా ఉండవచ్చు. ఒక రొమ్ము పెద్దగా, ఒకటి చిన్నగా ఉండవచ్చు. దానివల్ల ఎటువంటి అనారోగ్యం, ప్రమాదం ఉండదు.
నాకు ఆస్థమా ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో ఇన్‌హేలర్ ఉపయోగించవచ్చా? ఉపయోగించవచ్చని కొందరు, వద్దని కొందరు అంటున్నారు. ఏది నిజం? ఒకవేళ ఉపయోగిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– జి.సుమన, ఆదిలాబాద్
ఆస్థమా ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు, హార్మోన్లలో మార్పుల వల్ల, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి కొందరిలో ఆస్థమా తక్కువగా ఉంటుంది. కొందరిలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆస్థమా ఉన్నవాళ్లలో ఏదైనా అలర్జీ వల్ల, ఊపిరితిత్తులోకి గాలిని పంపించే గొట్టాలలో వాపు ఏర్పడి, అవి సన్నగా అయ్యి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఊపిరితిత్తులలో నీరు చేరడం, తద్వారా తల్లికి, బిడ్డకి ఆక్సిజన్ సరఫరా తక్కువగా అందుతుంది. (ఈ సమయంలో ఆస్థమా అటాక్ ఎక్కువగా రావటం వల్ల, తల్లి నుంచి బిడ్డకి ఆక్సిజన్ సరఫరా తక్కువ అందుతుంది. దీనివల్ల గర్భంలో బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవటం, నెలలు నిండకుండానే పుట్టడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.) తల్లిలో కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ సమయంలో ఇన్‌హేలర్స్ వాడటం తప్పనిసరి. వీటిని వాడటం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఒకవేళ చిన్నచిన్నవి ఉన్నా అవి వాడకపోతే తల్లికి, బిడ్డకు వచ్చే ప్రమాదాలతో (సమస్యలతో) పోలిస్తే చాలా తక్కువే. కాకపోతే ఒకసారి గర్భిణీ సమయంలో డాక్టర్‌ని సంప్రదించి, తగిన మోతాదు, మందులతో కూడిన ఇన్‌హేలర్‌ను వాడటం మంచిది. ఇన్‌హేలర్‌తో పాటు, వీలైనంత వరకు చల్లని పదార్థాలు, ఆస్థమాకు పడని వస్తువులు, దుమ్ము, ధూళి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.