అది ఎంతవరకు నిజం?
పదిహేను సంవత్సరాల వరకు నెలసరి మొదలు కాకపోతే ‘సీరియస్ ప్రాబ్లం’ అన్నట్లుగా విన్నాను. ఒకవేళ ఇది నిజమే అయితే, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలియ జేయగలరు.
– శ్రీ, ఆదిలాబాద్
సాధారణంగా ఆడపిల్లలు 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల రజస్వల అవుతారు (అంటే పీరియడ్స్ మొదలవ్వడం). ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, అధిక బరువు, పర్యావరణ మార్పులు, ఆధునిక పోకడలతో, హార్మోన్లలో మార్పులవల్ల ఆడపిల్లలు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. దీనివల్ల తోటిపిల్లలు తొందరగా రజస్వల అయినప్పుడు, 15 సంవత్సరాలైన మిగతా పిల్లలు రజస్వల అవనప్పుడు కంగారుగా అనిపిస్తుంది. పిల్లలు ఎత్తుకి తగ్గ బరువు ఉండి, రొమ్ములు ఏర్పడి, బాహుమూలల్లో, జననేంద్రియాల వద్ద వెంట్రుకలు వచ్చి ఉండి, చూడటానికి మామూలుగా ఉంటే గరిష్టంగా 16 సంవత్సరాల వరకు రజస్వల అయ్యే అవకాశాలు ఉంటాయి.
కాని 15 సంవత్సరాలు వచ్చినా రజస్వల కాకపోతే అమ్మాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేక ఇంకా ఒక సంవత్సరం ఆగవచ్చా అని తెలుసుకోవటానికి డాక్టర్‌ని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. కొందరిలో హార్మోన్ల లోపం (థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్) జన్యుపరమైన సమస్యలు, గర్భాశయం లేదా అండాశయాలు లేకపోవటం, చిన్నగా ఉండటం, అధిక బరువు ఉండటం, పీసీఓడీ, బరువు మరీ తక్కువగా ఉండటం, యోని భాగాన్ని కన్నెపొర పూర్తిగా మూసి వేయటం వంటి ఎన్నో కారణాల వల్ల రజస్వల కాకపోవచ్చు.
కొన్ని సమస్యలకు మనం జాగ్రత్తలు తీసుకోవటానికి ఏమీ ఉండదు. పుట్టుకతో లోపాలు, జన్యుపరమైన లోపాలకు చాలావరకు చికిత్స ఏమీ ఉండదు. కాకపోతే మారుతున్న కాలంలో ఆడపిల్లలను చిన్నప్పటి నుంచే వ్యాయామాలు, ఆహారంలో జంక్‌ఫుడ్ తగ్గించి, సరైన పౌష్ఠికాహారం ఇవ్వడం ద్వారా, అధిక బరువు, కొన్ని హార్మోన్ల మార్పులను అరికట్టవచ్చు.
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఒక్కోసారి అకారణంగా మూడీగా మారిపోతాను. ఎవరితో మాట్లాడాలనిపించదు. డిప్రెషన్‌లో ఉన్నానా? అనిపిస్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు డిప్రెషన్‌కు చికిత్స తీసుకోవచ్చా? యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్, యాంటీ డిప్రెసెంట్స్ అంటే ఏమిటి?
– బి.ఆర్, శ్రీకాళహస్తి
గర్భిణీతో ఉన్నప్పుడు 100లో పదిమంది అనేక రకాల తీవ్రతతో డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఈ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల, శారీరక మార్పుల వల్ల, గర్భం పెరిగేకొలదీ కలిగే అసౌకర్యం, నొప్పులు, గర్భధారణ మీద భయం, అపోహలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ముందు గర్భంలో వచ్చిన సమస్యల వల్ల, ఇలా అనేక కారణాల వల్ల, కొందరు గర్భిణీలలో డిప్రెషన్ కొద్దిగా నుంచి తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల దేనిమీద ఆసక్తి లేకపోవటం, కోపం, భయం, ఏడుపు, ఎవరితో మాట్లాడకపోవటం, నిద్రలేకపోవటం, లేక అతిగా నిద్రపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, లేక అతిగా తినడం వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. దీనివల్ల కడుపులో బిడ్డ సరిగా పెరగకపోవటం, కొన్నిసార్లు పుట్టిన బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు తలెత్తే సమస్యలు ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా మొదట కుటుంబసభ్యులు ఈ లక్షణాలని గుర్తించగలగాలి.
ఈ సమయంలో వీరికి కుటుంబసభ్యుల మద్దతు ఎంతగానో అవసరం. వారిలో ప్రేమగా మాట్లాడాలి, ఎక్కువ సమయం గడపాలి, బయట చల్లగాలికి వాకింగ్‌కు తీసుకువెళ్లటం, వాళ్లకి నచ్చిన ప్రదేశాలకు తీసుకువెళ్లటం, ప్రాణాయామం, మెడిటేషన్ చెయ్యించటం వంటి వాటివల్ల చాలావరకు ఈ లక్షణాలకు ఉపశమనం కలుగుతుంది. ఇంకా కూడా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు, డాక్టర్‌ని సంప్రదించి వారి పర్యవేక్షణలో యాంటి డిప్రెసెంట్ మందులు వాడవలసి ఉంటుంది. వీటిని డిప్రెషన్ తగ్గించడానికి వాడుతారు. వీటిలో కొన్ని ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఎక్కువ ముప్పు వాటిల్లకుండా ఉండేవి ఎంచుకుని తక్కువ మోతాదులో ఇవ్వటం జరుగుతుంది. డిప్రెషన్ లక్షణాలు అధికంగా ఉండి, వాటివల్ల వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు, యాంటీ డిప్రెసెంట్స్ వల్ల రిస్క్ కొద్దిగా ఉన్నా కూడా వాడవలసి ఉంటుంది.
నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, డిప్రెషన్ లక్షణాలు ఇప్పుడు ఇప్పుడే మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి కౌన్సిలింగ్ ఇప్పించుకోవటం మంచిది. మీవారిలో మీ సమస్య గురించి చెప్పవలసి ఉంటుంది. రోజూ కొంచెంసేపు యోగ, మెడిటేషన్, బయటకు వెళ్లి కొద్దిగా వాకింగ్ చెయ్యటం వల్ల ఈ లక్షణాల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఉంటాయి.