జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
పులిపిరులకు కారణమేంటి?
నా వయసు 49 ఏళ్లు. గత కొంతకాలంగా నా మెడ వెనక భాగంలోనూ, బాహుమూలాల దగ్గర పెద్ద సంఖ్యలో పులిపిరులు వస్తున్నాయి. చొక్కా తీస్తే అసహ్యంగా కనిపిస్తున్నాయి. వీటిని తొలగించుకోవడం ఎలా? నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- మహమూద్‌బాషా, గుంటూరు
మీరు చెబుతున్న పులిపిరుల వంటి కాయలు మీ మెడ దగ్గర, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయంటే... బహుశా మీలో కొలెస్ట్రాల్ పాళ్లు అధికంగా ఉండవచ్చు. దాంతోపాటు ఇలాంటి వారికి మెడ ప్రాంతమంతా నల్లబారుతుంది. మీరు మీ బరువెంతో మీ లేఖలో రాయలేదు. కానీ వివరించిన లక్షణాలను బట్టి మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకవేళ ఇదే వాస్తవమైతే మీరు ఇప్పట్నుంచే బరువు తగ్గించుకొని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించడం మంచిది. లేకపోతే మీరు చెప్పే లక్షణాలతో మీరు భవిష్యత్తు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజీషియన్‌ను కలిసి, లిపిడ్ ప్రొఫైల్‌తో పాటు వారు సూచించిన అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొండి. వాటి ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది.
కొన్నాళ్ల క్రితం పొలం గట్టు మీద నడుస్తున్నప్పుడు నాకు అరికాలిలో ఏదో రాయి లాంటిది గట్టిగా గుచ్చుకుంది. అప్పట్నుంచి అది గట్టిగా మారి ఆనెకాయలాగా చేతికి తగులుతోంది. దాని వల్ల నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ ఆనెకాయ పూర్తిగా తగ్గడానికి ఏం చేయాలో సూచించగలరు. - కాశయ్య, నల్లగొండ
మీకు గుచ్చుకున్న ఆ రాయివంటి బయటి వస్తువును (ఫారిన్‌బాడీని) మీ శరీరం నుంచి తొలగించారో లేదో వంటి వివరాలను మీ లేఖలో తెలపలేదు. మీరు ఈ సమస్యతో ఎవరైనా డాక్టర్‌ను కలిశారో లేదో కూడా రాయలేదు. ఇది క్రమంగా గట్టిపడి (హైపర్‌ట్రోఫిక్ స్కార్) కాయలా మారిందని తెలుస్తోంది. ఇప్పుడు మీరు చెబుతున్న భాగంలో వాపు వచ్చి ఉంటే, బహుశా అది గతంలో మీకు అయిన గాయం వల్లనే అయి ఉంటుంది. మీరు ఒకసారి జనరల్ సర్జన్‌ను కలిసి, మీరు ఆనెకాయలా వర్ణిస్తున్న భాగాన్ని చూపించుకుంటే మంచిది. వారు దాన్ని పరిశీలించి, తగిన చికిత్స సూచిస్తారు.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
చిన్న పేగులో టీబీ... ఏం చేయాలి?
నా వయసు 27 ఏళ్లు. నాకు కడుపునొప్పి, బరువు తగ్గుదల వంటి లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. చిన్నపేగుల్లో టీబీ ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఆరునెలల మందులు వాడాను. ఇది పూర్తిగా నయమవుతుందా లేదా తెలియజేయగలరు.
- నర్సింహారావు, జగ్గయ్యపేట
మామూలుగా చిన్నపేగుల్లో టీబీ వల్ల పేగులో పుండ్లు తయారవుతాయి. టీబీ మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అలాకాకుంటే ‘చిన్నపేగుల స్ట్రిక్చర్’ మాదిరిగా వస్తే టీబీ నియంత్రణలోకి వచ్చినప్పటికీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల వల్ల టీబీ వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఆందోళన అవసరం లేదు.
నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏళ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం పాంటాసిడ్-హెచ్‌పి ఒక వారం పాటు వాడాను. ప్రస్తుతం ఒమేజ్ మాత్రలు వాడుతున్నాను. అయినా కడుపులో నొప్పి, మలబద్దకం, తలనొప్పితో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. (నాకు బీపీ, షుగర్ లాంటివి ఏమీ లేవు). - కె. నిరంజన్‌రావు, వరంగల్
మీరు మూడు నెలల క్రితం పాంటాసిడ్-హెచ్‌పి వాడినట్లూ, ప్రస్తుతం మందులు వాడుతున్నా ఫలితం కనిపించనట్లు రాశారు. మీరు ఒకవేళ ఎండోస్కోపీ చేయించుకోనట్లయితే ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలిసి ఎండోస్కోపీ చేయించుకోగలరు. ఇక రెండో అంశం... మీకు మలబద్దకం, కడుపులో నొప్పి ఉన్నట్లు రాశారు. దీన్ని బట్టి చూస్తే మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే వ్యాధి కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో కడుపునొప్పి, మలబద్దకం లేదా విరేచనాలు ఉండే అవకాశం ఉంది. ఇది సామాన్యంగా యాంగ్జైటీ లేదా తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలితో ఉండేవాళ్లలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, ఐబీఎస్ ఉందో లేదో చూపించుకోగలరు.
నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది క్రితం కడుపునొప్పి, కామెర్లు, దురద వస్తే గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి అని చెప్పారు. ఈఆర్‌సీపీ టెస్ట్ చేసి స్టెంట్ వేశారు. మళ్లీ నెలరోజుల నుంచి జ్వరం, కళ్లు పచ్చగా మారడం జరుతున్నాయి. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - శరణ్‌రాజు, వినుకొండ
మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు మీరు రాసిన వివరాలను బట్టి తెలుస్తోంది. కడుపులో వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. అత్యవసరంగా మీరు వెంటనే మళ్లీ ఈఆర్‌సీపీ చేయించుకోగలరు. ఈఆర్‌సీపీ వల్ల మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. మూసుకుపోయిన స్టెంట్ ఉన్నచోట కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఈఆర్‌సీపీ తర్వాత మీరు లాప్రోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇలా అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందే మీరు ఆపరేషన్ చేయించుకుని ఉంటే బాగుండేది. వీలైనంత త్వరలో ఈఆర్‌సీపీ, లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ సర్జరీలు చేయించుకోగలరు.
డర్మటాలజీ కౌన్సెలింగ్
స్ట్రయిటెనింగ్‌తో జుట్టు రాలుతోంది?
నా వయసు 18 ఏళ్లు. గత ఏడాదిగా నేను నా హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటున్నాను. రెండు నెలల క్రితం పర్మనెంట్ స్ట్రెయిటెనింగ్ అనే ప్రక్రియను కూడా చేయించాను. కానీ అప్పట్నుంచి నా వెంట్రుకలు రాలిపోతున్నాయి. పైగా అవి పొడిగా, పెళుసుబారినట్లుగా అవుతున్నాయి. ఈ విషయంలో నేనేం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
- సుస్మిత, హైదరాబాద్
మన వెంట్రుకల్లో స్వాభావికంగా డైసల్ఫైడ్ అనే బంధం ఉంటుంది. వీటి వల్లనే వెంట్రుక బలంగా ఉంటుంది. దీనివల్లనే వెంట్రుకకు సహజమైన మెరుపు కూడా వస్తుంది. మీరు ఇలా తరచూ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటూ ఉంటే ఆ డైసల్ఫైడ్ బంధం బలహీనపడుతుంది. మీ వెంట్రుకలు పొడిబారినపోయి, పెళుసుబారినట్లుగా అయి మధ్యకు విరిగినట్లుగా రాలిపోతుంటాయి. హెయిర్‌ను స్ట్రెయిటెన్ చేసే పార్లర్లలోని వారికి.. వెంట్రుకలపై అవగాహన లేకపోవడం వల్ల మీ వెంట్రుకను స్ట్రెయిటెన్ చేసేందుకు (అంటే చిక్కుబడినట్లుగా కాకుండా నిటారుగా, పొడవుగా ఉండేలా చూసేందుకు) చాలా రకాల సీరమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అవి వెంట్రుకలను చాలా విధాలుగా నష్టపరుస్తుంటాయి. మీ వెంట్రుకలు రాలడం ఆగడానికి సూచనలివి...
మొదట మీరు మీ హెయిర్ స్ట్రెయిటెనింగ్ ప్రక్రియను ఆపేయండి. మీ వెంట్రుక ఆరోగ్యం మెరుగుపడేందుకు దానికి తగిన పోషకాలు అందేలా విటమిన్ బి12, బయోటిన్ ఎక్కువగా ఉండే సప్లిమెంట్స్ తీసుకోండి. మీరు కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే మీరు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలు మీ వెంట్రుకలకు ఎక్కువగా అందుతుంటాయి.
కొన్నాళ్లలో మీ వెంట్రుకల ఆరోగ్యం బాగుపడకపోతే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు మీకు తగిన చికిత్స చేసి జీవం కోల్పోయినట్లుగా మారిన వెంట్రుకలను మళ్లీ మామూలుగా మారేలా చూస్తారు.
నా వయసు 24 ఏళ్లు. స్వాభావికంగానే నా వెంట్రుకలు రింగులు రింగులుగా, చిక్కుబడినట్లుగా అవుతాయి. ఎంత షాంపూ చేసుకున్నా అవి అలా చిక్కుబడినట్లుగానే అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
- విజయకుమారి, బెంగళూరు
కొందరి వెంట్రుకలు పుట్టుకతోనే ఇలా స్వాభావికంగా రింగులు తిరినట్లుగా ఉంటాయి. మీ వెంట్రుకలు చిక్కుబారినట్లుగా కాకుండా మామూలుగా ఉండటానికి ఈ సూచనలు పాటించండి. మీరు ఉపయోగించే షాంపూ తీవ్రమైనది కాకుండా చాలా మృదువైనది (మైల్డ్ షాంపూ) అయ్యేలా జాగ్రత్త తీసుకోండి. షాంపూ ఉపయోగించాక, మీరు కండిషనర్ రాసుకుంటుంటే, కేవలం వెంట్రుకలకు మాత్రమే అది అంటాలి తప్ప వెంట్రుక మూలాలకు కాదు. షాంపూ, కండిషనర్స్ వాడాక వెంట్రకలు కాస్త పొడిబారుతున్న సమయంలో లీవాన్ సీరమ్ వాడండి. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే మీ సమీపంలోని ట్రైకాలజిస్ట్‌ను కలవండి.
పులిపిరులకు కారణమేంటి?
Published Wed, Aug 26 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement