
మన పేగుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా కరెంటు పుట్టిస్తాయట! స్వీడన్‌లోని లుండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా ఈ విషయాన్ని నిరూపించారు. ఎలక్ట్రాన్ల క్రమ ప్రవాహమే కరెంట్ అన్నది మనకు తెలుసు. బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో కొన్ని ఎలక్ట్రాన్లను విడుదల చేస్తూంటాయి.. దీన్నే ఎక్స్‌ట్రా సెల్యులార్ ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ అని పిలుస్తూంటారు. ఖనిజ లవణాలను జీర్ణం చేసుకునే బ్యాక్టీరియాల్లో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో స్వీడన్ శాస్త్రవేత్తలు ఇతర బ్యాక్టీరియాపై దృష్టి పెట్టారు. మన పేగుల్లో ఉండే ల్యాక్టిక్ యాడిడ్ బ్యాక్టీరియం, ఎంటెరోకాకస్ ఫీకాలిస్ బ్యాక్టీరియాను పరిశీలించినప్పుడు అవి తమ పరిసరాల్లోని చక్కెరలను జీర్ణం చేసుకునే క్రమంలో ఎలక్ట్రాన్లను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.
బ్యాక్టీరియాతోపాటు ఫంగస్, ఇతర బ్యాక్టీరియా సమక్షంలో ఇలా జరుగుతోందని.. మిగిలిన బ్యాక్టీరియా, ఫంగస్‌లు ఈ ప్రక్రియలో సాయపడుతున్నట్లు తెలిసింది. ఈ రకమైన సహకారం కారణంగానే ఎలక్ట్రాన్ రవాణా సాధ్యమవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త చెప్పారు. కొన్ని రకాల రసాయనాలను జీర్ణం చేసుకునేందుకు బ్యాక్టీరియాతోపాటు ఇతర సూక్ష్మజీవుల అవసరం కూడా ఉంటుందని దీన్ని బట్టి తెలుస్తోందని. ఇది కాస్తా మరింత సమర్థమైన మందులను తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.