నేను పెళ్లి చేసుకోవచ్చా?
నా వయసు 20 సంవత్సరాలు. నాకు ‘యుటిఐ’ సమస్య ఉంది. తరచుగా యూరిన్ అవుతుంది. ఫ్యూచర్‌లో నేను పెళ్లి చేసుకోవచ్చా? పిల్లలు పుడతారా? ఇంకా ఇతర సమస్యలేమైనా ఎదురవుతాయా? నా సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఏ డాక్టర్‌కి చూపించుకోవాలి?
ఒక సోదరి
యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్. కిడ్నీల దగ్గర నుండి యూరేటర్ అనే గొట్టాల ద్వారా మూత్రం (యూరిన్) మూత్రాశయంలో (యూరినరీ బ్లాడర్) చేరి, అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వస్తాయి. ఆడవారిలో యురెత్రాకి దగ్గరగా యోని, మలద్వారం ఉంటాయి. అక్కడి నుంచి ఇన్‌ఫెక్షన్ క్రిములు, యురెత్రా ద్వారా పైకి పాకి ఇన్‌ఫెక్షన్‌కి కారణం కావచ్చు. నీరు సరిగా తాగకపోయినా ఇన్‌ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్‌కి, పెళ్లికి, పిల్లలకి సంబంధం లేదు. కాకపోతే నీకు తరచుగా యూటీఐ వస్తుంది కాబట్టి, ఎందుకు ఇన్‌ఫెక్షన్ మాటిమాటికీ వస్తుంది అని తెలుసుకోవటానికి డాక్టర్‌ని సంప్రదించి సీయూబీ, యూరినల్స్, యూఎస్‌జీ అబ్డామెన్, సీబీపీ, ఎస్‌ఆర్ క్రెటైనిన్ వంటి పరీక్షలు చేయించుకుని దానికి తగ్గ చికిత్స పూర్తిగా తీసుకోవలసి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేస్తే, అది మెల్లగా కిడ్నీలకి, రక్తంలోకి పాకి కిడ్నీలు పాడవడం, ప్రాణ హాని కలిగే ప్రమాదం ఉంటుంది. రక్తహీనత ఉన్నా, షుగర్ ఉన్నా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, కిడ్నీలో రాళ్లు ఉన్నా కిడ్నీలు, యురేటర్, యూరినరీ బ్లాడర్ నిర్మాణంలో సమస్యలు ఉన్నా, పరిశుభ్రత పాటించకపోయినా, నీరు సరిగా తాగకపోయినా తరచుగా ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచుగా యూటీఐ వస్తుంటే యూరాలజిస్ట్‌ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని కారణానికి తగ్గ చికిత్స చేయించుకోవటం మంచిది. రోజూ నీరు 2 నుంచి 4 లీటర్లు తాగాలి. ఇన్‌ఫెక్షన్‌కి యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తిగా వాడాలి, సగం వాడి ఆపేయకూడదు.
యోగాసనాలు వేయడం వల్ల బహిష్టు సమయంలో తలెత్తే కడుపు నొప్పి, అధిక రక్తస్రావంలాంటి సమస్యలకు ఉపశమనం దొరుకుతుందని నెలసరి క్రమం తప్పడం ఉండదని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? దీని కోసం మామూలు యోగాసనాలు సరిపోతాయా? ప్రత్యేక యోగాసనాలు ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరు.
జి.ఆర్, రాజమండ్రి
క్రమంగా యోగాసనాలు చెయ్యడం వల్ల కండరాలు గట్టిపడటం, రక్త ప్రసరణ మెరుగుపడటం, అదనపు కొవ్వు కరగటం, దాని ద్వారా నొప్పి తట్టుకునే శక్తి పెరగడం వంటి ప్రయోజనాలుంటాయి. బరువు నియంత్రణలో ఉండటం వల్ల హార్మోన్ల పని తీరు మెరుగు పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడే బ్లీడింగ్ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కడుపులో నొప్పి వంటి ఇతర లక్షణాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. యోగాసనాలు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, వారి బరువు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని యోగా నిపుణుల ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకుని, తర్వాత సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు. రోజు ప్రాణాయామం చెయ్యడం చాలా మంచిది. యోగసాధన చెయ్యడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి తగ్గి, హార్లోన్మ అసమతుల్యత తగ్గి, పీరియడ్ సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ, ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పీరియడ్స్‌లో వచ్చే ఇబ్బందులకు గర్భాశయంలో గడ్డలు, ఒవేరియన్ సిస్ట్ వంటి కారణాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవడానికి, హార్మోన్ పరీక్షలు, అల్ట్రా సౌండ్ పెల్విస్ చేయించుకోవటం మంచిది.
నాకు అప్పుడప్పుడూ రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ తర్వాత రక్తస్రావం కావడాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు. నెలసరి ఆగిపోయిన తరువాత రక్తస్రావం కావడం ప్రమాదమా? డాక్టర్‌కు చూపించుకోవాలా?
కె.సి, హైదరాబాద్
మీ వయసు, పీరియడ్స్ ఆగిపోయి ఎన్ని సంవత్సరాలు అయినాయి అనే వివరాలు రాయలేదు. మెనోపాజ్‌కు చేరిన తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అంటారు. హార్మోన్ల అసమతుల్యత ఇన్‌ఫెక్షన్, గర్భాశయంలో పుండ్లు, పాలిప్, అండాశయంలో సిస్ట్‌లు, క్యాన్సర్ వంటి అనేక కారణాల వల్ల పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ అవ్వవచ్చు. కాబట్టి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అయ్యే బ్లీడింగ్‌ను నిర్లక్ష్యం చెయ్యకుండా, గైనకాలజిస్ట్‌కు చూపించుకుని సీబీపీ, ఆర్‌బీఎస్, టీఎస్‌హెచ్, స్పెక్యులమ్ పరీక్ష, అల్ట్రా సౌండ్ పెల్విస్, ట్రాన్స్ వెజైనల్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. కొంతమందికి యాంటీ బయాటిక్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ వంటి మందులతో చికిత్స ఇవ్వవలసి ఉంటుంది. కొందరికి డి అండ్ సి చేసి, ఎండోమెట్రియల్ పొరను బయాప్సీకి పంపించి, ఆ రిపోర్ట్‌ను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. గడ్డలు, ఒవేరియన్ ట్యూమర్‌లు వంటివి ఉండే గర్భాశయం, అండాశయాలు ఆపరేషన్ ద్వారా తీసివేసి, వాటిని బయాప్సీకి పంపించి, దాని రిపోర్ట్‌ను బట్టి తర్వాత ఇంకా ఏమన్నా చికిత్స అవసరమా అని కూడా చూడవలసి ఉంటుంది.