ఏదైనా సమస్య ఉందంటారా?
నా వయసు 26. పెళ్లై ఏడాదైంది. ప్రతినెలా పీరియడ్ మిస్ అయితే బాగుండని ఎదురు చూస్తున్నాను. కానీ పీరియడ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ భయంగా ఉంటోంది. మార్నింగ్ సిక్‌నెస్ తరచూ ఉంటోంది. అది ప్రెగ్నెన్సీకి ఒక లక్షణం అని నెట్‌లో చదివాను. పీరియడ్ మిస్ కాకముందే నేను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నానని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? గత నెలలో పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ పీరియడ్ రావడంతో కుంగిపోయాను. త్వరగా పిల్లలు కావడానికి, ఎందుకు కావట్లేదో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
– స్వాతి, కర్నూలు
నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తూ ఉండి, భార్యాభర్తలు క్రమంగా కలుస్తూ ఉండి, ఇద్దరిలో వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు... నూటికి ఎనభై శాతం మంది ఏడాది లోపల గర్భం దాల్చుతారు. మిగతా 20 శాతంలో 10–15 శాతం మందికి రెండేళ్ల సమయం పట్టొచ్చు. మిగతా 5–10 శాతం మందికే కొన్ని సమస్యల వల్ల, ఎక్కువ సమయం లేదా చికిత్స అవసరం కావొచ్చు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవ్వడానికి వారం ముందు నుంచి కొందరిలో వికారం, నీరసం, రొమ్ముల్లో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు. అలా అని అందరికీ ఉండాలనేమీ లేదు. ఈ లక్షణాలు హార్మోన్ల ప్రభావం వల్ల గర్భంలేని వారిలో పీరియడ్ వచ్చే ముందు కూడా రావచ్చు. నెలనెలా సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్ మిస్ అయిన వారం రోజుల్లో యూరిన్‌లో ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్ష చేసి గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీకు గత నెల పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చిందన్నారు. ఏమైనా హార్మోన్ల సమస్య ఏర్పడుతుందేమో తెలుసుకోవడం మంచిది. పెళ్లై ఏడాదైంది. త్వరగా పిల్లలు కావాలని ఆశ పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా... మీరు, మీవారు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
జననేంద్రియాల దగ్గర నాకు చిన్న చిన్న నీటి పొక్కులు వచ్చాయి. దీని గురించి ఒక స్నేహితురాలికి చెబితే ‘హెర్పిస్ సింప్లెక్స్ కావచ్చు’ అని ఆందోళన పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఆందోళనంగా ఉంది. హెర్పిస్ సింప్లెక్స్ గురించి, చికిత్సా విధానం గురించి తెలియజేయగలరు.
– డి.అరుణ కుమారి, విశాఖపట్నం
హెర్పిస్ సింప్లెక్స్ అనేది ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది శరీరం పైన ఎక్కడైనా రావచ్చు. ఇందులో హెస్‌ఎస్‌వీ 1, హెస్‌ఎస్‌వీ 2 అనే రెండు రకాల ఇన్‌ఫెక్షన్‌లు ఉంటాయి. హెస్‌ఎస్‌వీ 1 అనేది ఇన్‌ఫెక్షన్ ఎక్కువ మటుకు మూతి చుట్టూ, ముఖం మీద వస్తుంది. హెస్‌ఎస్‌వీ 2 జనేంద్రియాల మీద వస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల చర్మం మీద చిన్న చిన్న నీటి గుల్లలు లేదా వీటి పొక్కులులాగా వస్తుంది. అది క్రమేణా మందులు వాడకపోయినా, వారం పది రోజులకు తగ్గిపోతుంది. అది తగ్గేవరకు, చర్మం మీద మంట, నొప్పి ఎక్కువగా ఉంటుంది. హెస్‌ఎస్‌వీ 2 ఇన్‌ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి, సెక్స్ ద్వారా పాకే అవకాశాలు ఉంటుంది. ఈ గుల్లలు ఎక్కువ పాకకుండా ఉండటానికి ఎసైక్లోవీర్ అనే మాత్రలు, క్రీమ్ వాడవచ్చు. హెర్పిస్ ఇన్‌ఫెక్షన్ ఒకసారి వచ్చిన తర్వాత, హెర్పిస్ వైరస్ ఒంట్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, రోగ నిరోధక శక్తి బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, వైరస్ యాక్టివేట్ అయ్యి మళ్లీ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మళ్లీ వచ్చే ఇన్‌ఫెక్షన్ చాలా తక్కువ తీవ్రతలో ఉంటుంది.
నాకు ఈ మధ్యనే బిడ్డ పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. అయితే నాకు పాలివ్వడంలోనే సమస్యగా ఉంటోంది. కుడివైపు ఓకే కానీ ఎడమవైపు స్తనం నుంచి అస్సలు పాలు రావడం లేదు. అలా ఎందుకవుతోంది? ఏదైనా సమస్య ఉందంటారా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
– శశికళ, మెయిల్
సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ములో పాల ఉత్పత్తి మొదలవుతుంది. బిడ్డ రొమ్ము మొనను (నిపుల్) చీకడం మొదలు పెట్టిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ మరింతగా విడుదలై పాల ఉత్పత్తిని మరింతగా ప్రేరేపించి, వాటిని నిపుల్ ద్వారా బయటకు పంపిస్తుంది. పైన చెప్పిన హార్మోన్స్, బిడ్డ చీకడం, మానసిక, శారీరక ప్రశాంతత అన్నీ సరిపడా ఉన్నప్పుడు, బిడ్డకు సరిపడా పాలు చక్కగా వస్తాయి. మీకు ఒకవైపు వస్తున్నాయి, మరోవైపు రావట్లేదు అంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు పరిశీ లించాలి. కొంతమందిలో నిపుల్‌పైన ఉన్న రంధ్రాలపై పొక్కు కట్టి, మూసుకుపోతాయి. అలాంటప్పుడు పొక్కులను తడిబట్టతో మెల్లిగా తీసేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకవైపే పాలు వస్తున్నాయని, అటే బిడ్డకు పాలు ఇస్తూ పోతే, ఇటువైపు ప్రేరేపణ లేకపోవడం వల్ల కూడా రాకపోవచ్చు. కాబట్టి ఈసారి బిడ్డ బాగా ఆకలిగా ఉన్నప్పుడు మొదట పాలు రాని రొమ్మును శుభ్రం చేసి పట్టిస్తే, బిడ్డ చీకే కొద్దీ, అది ప్రేరేపణకు గురై పాలు మెల్ల మెల్లగా రావడం మొదలవుతుంది. అయినా రాకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.a