వీటి కోసం మాత్రలు ఉంటాయా?
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు స్త్రీలకు చాలా ముఖ్యం అనే విషయం చదివాను. వీటి కోసం ప్రత్యేక మాత్రలు ఏమైనా ఉంటాయా? మాత్రలు లేకపోతే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ఈ హర్మోన్లు బలపడతాయి అనేది తెలియజేయగలరు.
– ఎన్.జయ, ఖమ్మం
ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు స్త్రీల ఆరోగ్యానికి, పీరియడ్స్ సరిగా రావటానికి, గర్భం నిలవటానికి ఎంతో ముఖ్యం. అవి ఆడవారిలో అండాశయాల నుంచి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి రకరకాల మోతాదులో విడుదల అవుతూ ఉంటాయి. విటమిన్ టాబ్లెట్స్‌లాగా, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ మాత్రలని ఆరోగ్యం కోసం వాడకూడదు. ఈ హార్మోన్స్ మరీ అధికంగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా మంచిది కాదు. ఈ హార్మోన్లు శరీర బరువుని బట్టి, మానసిక, శారీరక ఒత్తిడిని బట్టి విడుదల అవుతూ ఉంటాయి. ఈ మాత్రలు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నప్పుడు, అండాశయాలలో సిస్ట్‌లు... ఇంకా కొన్ని సమస్యలకు డాక్టర్ సలహా సంరక్షణలో వాడవలసి ఉంటుంది. పరిమితమైన పౌష్ఠికాహారం, సక్రమంగా వాకింగ్, వ్యాయామాలు చేసుకుంటూ సాధారణ బరువుతో ఉంటే, ఈ హార్మోన్స్, శరీరంలో కావాల్సిన మోతాదులో విడుదల అవుతాయి. సాధారణంగా పీరియడ్స్ ఆగిపోయినవారిలో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కాబట్టి, వారికి ఆహారంలో సోయా బీన్స్, సోయా పాలు, సోయా ఉత్పత్తులలో ఈస్ట్రోజన్‌లాగా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్, ఐసోఫ్రావోన్స్ ఉంటాయి కాబట్టి, వాటిని తీసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది.
సోనోగ్రఫీ టెస్ట్ (sonography test) గురించి మొదటి సారిగా విన్నాను. గర్భిణులకు ఇది ముఖ్యమైన టెస్ట్ అనే విషయం తెలిసింది. ఈ టెస్ట్ ఏ రకంగా గర్భిణులకు ఉపయోగం అనేది కాస్త వివరంగా తెలియజేయగలరు.
– యస్.ఎన్, నెల్లిమర్ల
సోనోగ్రఫీ టెస్ట్ అంటే అల్ట్రా సౌండ్ స్కానింగ్. దీనిని అల్ట్రా సౌండ్ మెషిన్ ద్వారా చేస్తారు. పిండం గర్భంలో పెరుగుతుందా లేదా గర్భాశయంలో పెరుగుతుందా లేదా ట్యూబ్‌లో పెరుగుతుందా, పిండంలో గుండె కొట్టుకోవడం మొదలైందా అనేవి మొదటి మూడు నెలల సమయంలో ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. మూడవ నెల చివరిలో, బిడ్డలో చిన్నగా చేతులు, కాళ్లు, ఏర్పడి బిడ్డ రూపం ఏర్పడుతుంది. ఎన్‌టీ స్కాన్ ద్వారా బిడ్డలో కొన్ని జన్యులోపాలు ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల వరకు పొట్ట పైనుంచి గర్భంలో పిండం పెరుగుతుందా లేదా అనేది తెలియదు. నాలుగో నెల చివరి నుంచి పొత్తికడుపు పైన, కొద్దిగా గర్భాశయం పెరిగి పైకి గట్టిగా తెలుస్తుంది. డాప్లర్ అనే పరికరం ద్వారా బిడ్డ గుండె కొట్టుకోవడం వినిపిస్తుంది. అదే పొట్టమీద కొవ్వు ఎక్కువగా ఉంటే బిడ్డ గుండె శబ్దం వినిపించకపోవచ్చు. అలాంటప్పుడు స్కానింగ్ ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. కొందరిలో మొదటి మూడు నెలలలో కొద్దిగా బ్లీడింగ్, స్పాటింగ్ కనిపిస్తుంది. అప్పుడు కూడా పిండం ఎలా ఉంది అనేది స్కానింగ్ ద్వారానే తెలుస్తుంది.
ఐదవ నెల చివరిలో బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి టిప్ఫా స్కానింగ్ చేయించుకోవలసి ఉంటుంది. అవసరమయితే బిడ్డ గుండెలో చిన్న రంధ్రాలు, గుండెకు సంబంధించిన వేరే లోపాలు సరిగ్గా తెలుసుకోవటానికి ఫీటల్ 2డి ఎకో స్కాన్ ఉంటుంది. 8, 9 నెలలలో బిడ్డ బరువు, ఉమ్మ నీరు, పొజిషన్ తెలుసుకోవటానికి గ్రోత్ స్కాన్ చేయించుకోవచ్చు. బిడ్డ బరువు తక్కువగా ఉండి, ఉమ్మ నీరు తగ్గుతుంటే, డాప్లర్ స్కాన్ ద్వారా బిడ్డకి తల్లి నుండి రక్త ప్రసరణ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.