గర్భిణులు ఒత్తిడికి గురైతే..?
నేను చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ‘గర్భిణులు తరచుగా ఒత్తిడికి గురైతే పుట్టబోయే బిడ్డలు అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్ లాంటివి ఎదుర్కోవలసి వస్తుంది’ అనే విషయం చదివాను. ఇది నిజమేనా?
– యస్.యం, ఆదిలాబాద్
ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) అనేది చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన మానసిక వ్యాధి. ఈ సమస్య ఉన్న పిల్లలు బాగా హైపర్ యాక్టివ్‌గా, అల్లరిగా, ఒక దగ్గర కుదురుగా కూర్చోలేక పోవటం, కాన్సన్‌ట్రేషన్ లేకపోవటం, మెమరీ తక్కువ ఉండటం, సరిగా చదవలేకపోవటం... వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనికి గల కారణాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యంగా జన్యుపరమైన కారణం ఒకటి. జన్యుపరమైన కారణంతో పాటు కొన్ని రకాల పర్యావరణ సమస్యలు జత కలిసి నప్పుడు ఏడీహెచ్‌డీ ఎక్కువగా బయటపడే అవకాశాలు ఉంటాయి. తల్లులు గర్భంతో ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి మరీ తీవ్రంగా ఉంటే, వారికి పుట్టబోయే పిల్లలలో కొంత మందిలో ఏడీహెచ్‌డీ సమస్య ఏర్పడవచ్చు. మానసిక ఒత్తిడితో పాటు, వారిలో కాని, భర్తలో కాని జన్యుపరమైన సమస్య ఉన్నప్పుడు ఏడీహెచ్‌డీ ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి వల్ల గర్భిణీలలో ఏడీహెచ్‌డీ కంటే కూడా ఎక్కువగా గర్భిణీలలో బిడ్డ బరువు ఎక్కువగా పెరగక పోవడం, బీపీ, షుగర్ పెరగడం వంటి ఇతర సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణీలు వీలైనంతవరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది. దీనికి కుటుంబ సభ్యుల సహకారం అవసరం.
హైపోగ్లైసీమియా (hypoglycaemia) అనేది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని, బ్రెయిన్ డ్యామేజీ కూడా దారి తీయవచ్చునని... ఇలా రకరకాలుగా విన్నాను. అసలు ఈ హైపోగ్లైసీమియా అనేది ఎందుకు వస్తుంది? ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా?
– పి.ఈశ్వరి, గుంటూరు
హైపోగ్లైసీమియా అంటే రక్తంలో షుగర్ శాతం బాగా తగ్గిపోవడం అన్నమాట. రక్తంలో షుగర్ శాతం సమపాళ్లలో ఉన్నప్పుడే శరీరంలో అన్ని అవయవాలకు కావలసిన శక్తి చేకూరుతుంది. మెదడు చురుకుగా పనిచెయ్యాలి అంటే, దానికి కావలసిన శక్తి రక్తంలో షుగర్ శాతాన్ని బట్టి అందుతుంది. హైపోగ్లైసీమియా వల్ల మెదడు చురుకుదనం తగ్గడం, కళ్లు తిరగడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు ఉంటాయి. మీ ప్రశ్నలో హైపోగ్లైసీమియా బిడ్డ కడుపులో ఉండగా తల్లికా లేక పుట్టిన తర్వాత బిడ్డకా అనేది వివరంగా రాయలేదు.
బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, తల్లి సరైన పౌష్ఠికాహారం తీసుకోకపోవడం, తల్లిలో షుగర్ ఉండి, ఇన్సులిన్ సరైన మోతాదులో తీసుకోకపోవడం, కాన్పు సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవటం, లివర్‌లో సమస్యలు, ఇన్‌ఫెక్షన్‌లు, షుగర్ మెటబాలిజమ్‌లో సమస్యలు వంటి అనేక కారణాల వల్ల బిడ్డలో హైపోగ్లైసీమియా ఏర్పడవచ్చు. ఎక్కువ కాలంపాటు బిడ్డ మెదడుకి షుగర్ వల్ల వచ్చే శక్తి తగ్గిపోవడం వల్ల, బిడ్డ బ్రెయిన్ మెల్లగా దెబ్బతినటం మొదలవుతుంది. దానివల్ల ఫిట్స్, బ్రెయిన్ పెరుగుదల లేకపోవటం, మానసిక అభివృద్ధి లేకపోవటం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
గర్భిణిగా ఉన్నప్పటినుంచే తొమ్మిది నెలలపాటు తల్లి సరైన పౌష్ఠికాహారం తీసుకుంటూ, డాక్టర్ దగ్గర సరిగా చెకప్‌లు చేయించుకుంటూ అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకుంటూ, సరైన మందులు తీసుకోవటం వల్ల కొంత హైపోగ్లైసీమియా సమస్యను నివారించవచ్చు. పుట్టగానే బిడ్డకు పాలివ్వడం, బిడ్డ చురుకుగా ఉందా లేదా అని చూసుకుని, అవసరమైన షుగర్ టెస్ట్ చేసుకుని, షుగర్ మరీ తక్కువగా ఉంటే గ్లూకోజ్ సెలైన్ పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు.
మా అత్తయ్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది. ఆమె కూతురికి పెళ్లయిన అయిదు సంవత్సరాలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో నాకు వచ్చిన సందేహం ఏమిటంటే, తల్లీ కూతుళ్లకు వచ్చింది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అనువంశీకమా? లేక యాదృచ్ఛికంగా ఇద్దరికీ వచ్చి ఉంటుందా? తెలియజేయగలరు.
– ఎన్.రమ్య, నర్సీపట్నం
బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యమైనవి జన్యుపరమైన కారణాలు. ఆడవారిలో బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే జన్యువులలో మార్పుల వల్ల కొందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఈ జన్యువులు వారి పిల్లలకు సంక్రమించటం వల్ల, వారి అమ్మాయిలకు, మనవరాళ్లకు వంశపార పర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారి కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు, కొంతమంది ఈ బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 జన్యు మార్పులను ముందుగానే తెలుసుకుని, క్యాన్సర్ రాకముందే రొమ్ములను, అండాశయాలను తొలగించుకుంటూ ఉంటారు.
జన్యుపరమైన కారణాలు కాకుండా, కొందరిలో అధిక బరువు, హార్మోన్లలో మార్పులు, ఈస్టోజన్ హార్మోన్ అధిక కాలం తీసుకోవడం వంటి ఇతర కారణాల వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. మీరు చెప్పిన సందర్భంలో తల్లికి, కూతురికి బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి ఖచ్చితంగా జన్యుపరంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించిందని, ఎటువంటి పరీక్షల రిపోర్ట్స్ తెలియకుండా చెప్పటం కష్టం. యాదృచ్ఛికంగా కూడా వచ్చి ఉండవచ్చు. ఇద్దరికీ బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 జెనెటిక్ పరీక్షలు, మిగతా పరీక్షలు చేసిన తర్వాతే కారణం తెలుస్తుంది.