అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా? | sakshi health counseling | Sakshi
Sakshi News home page

అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా?

Published Sun, Jun 11 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా?

అలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా?

ప్రెగ్నెంట్‌ స్త్రీలు ‘బేబీ పంపింగ్‌ ఎక్సర్‌సైజ్‌’ చేయడం మంచిదని చదివాను. ఇదొక న్యూ ట్రెండ్‌ అని విన్నాను. ఈ ఎక్సర్‌సైజ్‌ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఎంత వరకు క్షేమం? తెలియజేయగలరు.
– శ్రీవాణి, నెల్లూరు

బేబీ పంపింగ్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే ఒక రకంగా బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ లాంటిది. ఊపిరి లోపలికి పీల్చుకుంటూ పొట్టలో బిడ్డతో పాటు పొట్టని లోపలికి తీసుకోవడం, తర్వాత ఊపిరితో పాటు పొట్టని వదిలివెయ్యడం. ఇలా రోజూ క్రమంగా టీవీ చూస్తూ, పని చేసుకుంటూ, చదువుకుంటూ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల పెల్విక్, పొట్ట కండరాలు గట్టిపడటం, మానసిక ఒత్తిడిని, శారీరక ఒత్తిడిని తగ్గి, సాధారణ కాన్పు సులువుగా త్వరగా అయ్యే అవకాశాలు పెరిగి నడుంనొప్పి తగ్గడం, కాన్పు తర్వాత కూడా అలసట లేకుండా కడుపు కండరాలు గట్టిగా ఉండటం వల్ల, పొట్ట వదులు అవ్వకుండా ఉండటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే ఈ ఎక్సర్‌సైజ్‌లు తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్‌ సలహా మేరకు చెయ్యవలసి ఉంటుంది. గర్భాశయం ముఖద్వారం చిన్నగా ఉండటం, మాయ కిందకి ఉండటం వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇవి చెయ్యకపోవడం మంచిది.

∙నా వయసు 26 సంవత్సరాలు. పీరియడ్స్‌ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ అవుతుంది. పరీక్షలు చేయించుకుంటే ‘గర్భసంచి ఉబ్బింది’ అని చెప్పారు. ఇది ప్రమాదకరమా? ఏ పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– పి.ఆర్, కర్నూలుæ

గర్భసంచి ఉబ్బింది అనేది సైంటిఫిక్‌ పదం కాదు. సామాన్యులకు అర్థం కావడానికి గర్భసంచిలో ఏర్పడే ఇబ్బందికి సంబంధించి అనేక నేపథ్యాలలో ఈ పదం వాడటం జరుగుతుంది. కొందరు డాక్టర్‌లు గర్భసంచిలో మరియు దాని చుట్టూ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే దానిని పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ (పీఐడీ) అని, వాడుక భాషలో గర్భసంచి వాచింది లేదా గర్భసంచికి వాపు వచ్చింది అని చెప్పటం జరుగుతుంది.
కొంతమందిలో రెండు, మూడు కాన్పుల తర్వాత గర్భసంచి సాగి కొద్దిగా పెద్దగా అవుతుంది. దీనిని బల్కీ యుటరస్‌ అని వాడుక భాషలో గర్భసంచి పెరిగింది అంటారు. కొందరిలో ప్రతి నెలా బ్లీడింగ్, గర్భసంచి నుంచి బయటకు వచ్చినట్లే, గర్భసంచి కండరాలలో కూడా బ్లీడింగ్‌ అవుతూ ఉండి, రక్తం గూడుకట్టి అది మెల్లమెల్లగా గర్భసంచిని గట్టిగా చేసి, దాని పరిమాణం పెరుగుతుంది. దీనిని అడినోమయోసిస్‌ అని, వాడుక భాషలో గర్భసంచి ఉబ్బింది అని అనటం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య ఏ నేపథ్యంలో చెప్పటం జరిగింది అనేది తెలియట్లేదు. ఒకవేళ పీఐడీ (ఇన్‌ఫెక్షన్‌) ఉంటే దానికి తగ్గ యాంటీ బయాటిక్స్‌తో కూడిన చికిత్స తీసుకుని చూడవచ్చు. మీకు పెళ్లి అయ్యిందా, పిల్లలు ఉన్నారా అనేది తెలియజేయలేదు.

కాన్పుల వల్ల గర్భసంచి సాగి ఉండే ప్రమాదం ఏమీలేదు. బ్లీడింగ్‌ ఎక్కువయ్యే రోజులలో, అది కొద్దిగా తగ్గడానికి మాత్రలు వాడితే సరిపోతుంది. ఇక అడినోమయోసిస్‌ వల్ల గర్భసంచి ఉబ్బి ఉంటే, దీనికి చికిత్స కొద్దిగా క్లిష్టమైనది. ఒక్కొక్కరి లక్షణాల తీవ్రతను బట్టి, గర్భసంచి ఉబ్బిన పరిమాణం బట్టి, రకరకాల హార్మోన్లతో, మందులతో చికిత్స చేయవలసి ఉంటుంది. బ్లీడింగ్‌ తగ్గడానికి రెండు మూడు రోజులపాటు ప్రతి నెలా ట్రానెక్సిమిక్, మెఫినోమిక్‌ యాసిడ్‌ మాత్రలు రోజుకు మూడు చొప్పున వాడి చూడవచ్చు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారి శరీరంలో ఉండే హార్మోన్ల మోతాదును బట్టి వచ్చే సమస్యలకు, జాగ్రత్తలు చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండవు. కాకపోతే శారీరక పరిశుభ్రత, మానసిక ఒత్తిడి లేకుండా, ఆరోగ్యకరమైన ఆహారం, అధిక బరువు లేకుండా ఉండటం, సక్రమంగా వ్యాయామాలు చెయ్యడం వంటి లైఫ్‌ సై్టల్‌లో మార్పులు చేసుకోవడం. చాలా సమస్యలను ఎదుర్కొనే శక్తి, అవి తీవ్రం అవకుండా ఉండే అవకాశాలు పెరుగుతాయి.

∙ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఇల్లు ఊడవడం దగ్గరి నుంచి రకరకాల పనులు చేస్తుంటాను. ఈ సమయంలో ఇలాంటి పనులు చేయవద్దని పెద్దలు చెబుతున్నారు. ఇది నిజమేనా? ఏ నెల నుంచి జాగ్రత్తగా ఉండాలి?
– కె.ఎన్, విజయవాడ

సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత పనులు ఎంతవరకు చెయ్యడం అనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి గర్భాశయం ముఖద్వారం పరిమాణం బట్టి, మాయ పొజిషన్‌ అంటే అది కిందకి ఉందా పైకి ఉందా అనే కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. గర్భంతో ఉన్న మొదటి మూడు నెలలు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కాంప్లికేషన్స్‌ ఏమీ లేనప్పుడు, డాక్టర్‌ సలహా మేరకు రోజువారి చేసుకునే పనులు, వంట పనులు, కూర్చునే చేసుకునే పనులు, అలసట ఇబ్బంది లేనంత వరకు మెల్లగా ఆగి ఆగి చేసుకోవచ్చు. మరీ వంగి చేసే పనులు, ఎక్కువ బరువులు లేపడం వంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఇల్లు ఊడవటం వంటివి, మరీ వంగి కాకుండా పెద్ద చీపురుతో మెల్లమెల్లగా చేయవచ్చు. గర్భం అనేది ప్రకృతి పరంగా జరిగే ఒక ప్రక్రియ. ఇది జబ్బు కాదు, ఇందులో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, ఇబ్బందులు కొందరిలో చిన్నవి, కొందరిలో పెద్దవి తలెత్తుతుంటాయి. కాబట్టి నువ్వు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి నీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని దానిబట్టి పనులు చేసుకోవచ్చు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని కొంతమందికి మాత్రమే వారి పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. గర్భిణులు మధ్యాహ్నం ఒక గంట, రాత్రి 8 గంటలు విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవటం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement