పిల్లల్ని కనవచ్చా?
నాకు పెళ్లై సంవత్సరం దాటింది. కొంతకాలంగా నాకు షుగర్ ఉంది. చికిత్స తీసుకుంటు న్నాను. ఈ సమయంలో పిల్లల్ని కనవచ్చా? పుట్టబోయే బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తాయా? గర్భం దాల్చాక ఎలాంటి చెకప్‌లు చేయించు కోవాలి? షుగర్ ఉన్నవారికి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం?
– పి.శైలజ, ఖమ్మం
షుగర్ వ్యాధి ఉన్నప్పుడు, గర్భం రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండాలి. హెచ్‌బీ ఎ,సి–6 కంటే తక్కువ ఉండాలి. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అలాగే షుగర్ లెవల్స్, హెచ్‌బీ ఎ,సి నియంత్రణలోకి వచ్చాకే గర్భం కోసం ప్రయత్నించాలి. లేకపోతే గర్భం దాల్చిన తర్వాత, అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం, బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం, దానివల్ల సాధారణ కాన్పులో ఇబ్బంది, ఆపరేషన్ ద్వారా కాన్పు, ఎక్కువ బరువు పెరగడం, బీపీ పెరగడం, ఎక్కువ షుగర్ లెవల్స్ వల్ల బిడ్డ కడుపులో చనిపోవటం వంటి అనేక రకాల సమస్యలు, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, షుగర్ లెవల్స్‌ని బట్టి, ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గర్భం దాల్చేముందు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి ఎఫ్‌బీస్, పీఎల్‌బీఎస్, హెచ్‌బీ ఎ,సి, ఓజీటీటీ, ఎస్‌ఆర్.టీఎస్‌హెచ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని అన్నీ నియంత్రణలో ఉంటే, ఫోలిక్ యాసిడ్ మాత్రలను ముందు నుంచే వాడుకుంటూ గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. దీనివల్ల గర్భంతో ఉన్నప్పుడు, పైన చెప్పిన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
గర్భం దాల్చిన తర్వాత జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో పరీక్ష చేయించుకుని, అదుపులో ఉంటే ఇన్సులిన్ ఇన్‌జెక్షన్స్, ఫిజీషియన్ పర్యవేక్షణలో క్రమంగా తీసుకుంటూ, నెలకొకసారి ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్ పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ లెవల్స్ పెరుగుతూ ఉంటే, ఇన్సులిన్ మోతాదును పెంచి వాడుకుంటూ, అవసరాన్ని బట్టి వారానికి లేదా రెండు వారాలకొకసారి షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి.
ఆహారంలో అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తీసుకోవాలి. తినేది ఒకేసారిగా కాకుండా ఆరుసార్లుగా విభజించుకుని డాక్టర్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటించవలసి ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు 2వ నెలలో బిడ్డలో గుండె కొట్టుకుంటుందా లేదా అని, స్కానింగ్, 3వ నెల చివరిలో ఎన్‌టీ స్కాన్, 5వ నెల చివరిలో టిప్ఫా స్కాన్ (అవయవ లోపాల కోసం) 6వ నెలలో ఫీటల్ 2డి ఎకో స్కాన్ (గుండెలో లోపాల కోసం), 8వ నెలలో బిడ్డ పెరుగుదల, బరువు తెలుసుకోవడానికి గ్రోత్ స్కాన్, 9వ నెలలో బిడ్డకి రక్త సరఫరా ఎలా ఉందో తెలుసుకోవడానికి డాప్లర్ స్కాన్ వంటివి చేయించుకుంటూ బిడ్డ పరిస్థితిని తెలుసుకుంటూ డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు.
గర్భం దాల్చిన వారు ఎక్కువ బరువు ఉన్నా, తక్కువ బరువు ఉన్నా సమస్యలు ఎదురవుతుంటాయని చెబుతుంటారు. ఎన్ని కిలోల బరువు ఉంటే ‘ఇది సరిౖయెన బరువు’ అనుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, బరువు తగ్గే ప్రయత్నం చేయవచ్చా?
– కె.సి, చిత్తూరు
ఒక్కొక్కరి ఎత్తుని బట్టి, వారు ఎంత బరువు ఉంటే సరిపోతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అంతేకాని, ఎత్తు తెలియకుండా ఇంత బరువు ఉంటే సరిపోతుంది అని చెప్పడం కష్టం. ఒకవేళ తక్కువ బరువు ఉండి గర్భం దాలిస్తే, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ నెలకు రెండు కేజీలపైన బరువు పెరగవచ్చు. బరువు మరీ ఎక్కువగా ఉండి గర్భం దాలిస్తే, బరువు తగ్గడానికి ప్రయత్నం చేయకూడదు. కాకపోతే మామూలు బరువు ఉన్నవాళ్లలాగ బరువు పెరగకుండా, ఆహారంలో అన్నం తక్కువ తీసుకుంటూ, కూరలు ఎక్కువ తీసుకోవాలి. బరువు ఎక్కువ పెరిగే అవకాశం ఉన్న అరటిపండ్లు, సపోటాలు, డ్రైఫ్రూట్స్ వంటివి తక్కువ తీసుకోవాలి. స్వీట్సు, షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. బరువు ఎక్కువ ఉండి, గర్భం దాల్చి, గర్భంతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బరువు పెరగడం వల్ల మధుమేహ వ్యాధి, బీపీ పెరగడం, ఆయాసం, కాళ్లనొప్పులు, కాన్పులో సమస్యలు, కాన్పు తర్వాత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నెలసరి సమయంలో వ్యాయామాలు చేయాలా? వద్దా? అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు విన్నాను. కొందరు చేయవచ్చని, కొందరు ఎంత మాత్రం చేయవద్దని అంటున్నారు. వ్యాయామాల వల్ల నెలసరి సమయంలో ఉండే చికాకు మరింత ఎక్కువగా పెరుగుతుందని, అలసిపోతారని అంటున్నారు. ఇది వాస్తమేనా?
– ఆర్.వి, రాజమండ్రి
నెలసరి సమయంలో వ్యాయామాలు చేయకూడదు అని ఏమీలేదు. కాకపోతే కొందరు ఈ సమయంలో అసౌకర్యంగా, చిరాకుగా ఉంటారు. వాళ్లకి వ్యాయామాలు చెయ్యడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే, చెయ్యకపోవడమే మంచిది. ఈ సమయంలో సాధారణ, చిన్న చిన్న వ్యాయామాలు, ప్రాణాయామం, ఎక్కువ బరువు పడకుండా, ఒత్తిడి లేకుండా చేసే వ్యాయామాలు చేసుకోవచ్చు. జాగింగ్, రన్నింగ్ అలవాటు ఉండేవారు, íపీరియడ్స్ సమయంలో చిన్నగా వాకింగ్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న వ్యాయామాల వల్ల కూడా, పీరియడ్స్ సమయంలో నొప్పి తక్కువగా అనిపిస్తుంది.