ఆ సమయంలో చిరాకు, కోపం...
నెలసరి రావడానికి ముందు చిరాగ్గా, కోపంగా ఉంటుంది. ఏదీ తినాలనిపించదు. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడాలనిపించదు. చిన్న విషయాలకే కోపం వస్తుంది. అందరి విషయంలో ఇలాగే ఉంటుందా? లేకపోతే నా శారీరక స్థితిని బట్టి ఇలా జరుగుతుందా? పరీక్షలు చేయించుకుంటే మంచిదా? తెలియజేయగలరు.
– డి.ఎన్, వనపర్తి
కొందరి మహిళలలో నెలసరి ముందు జరిగే అనేక రకాల హార్మోన్లలో మార్పుల వల్ల, రక్తంలో కొన్ని విటమిన్స్, మినరల్స్ లోపాల వల్ల, నెలసరి మొదలయ్యే 10–15 రోజుల ముందు నుంచే, వక్షోజాలలో నొప్పి, పొట్ట ఉబ్బరం, వికారం, కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి లక్షణాలు అనేక రకాల తీవ్రతలలో ఏర్పడతాయి. దీనినే ప్రీ మెన్స్‌ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. దీనిని లక్షణాలను బట్టి పీఎంఎస్ అని నిర్ధారించడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ పరీక్షలు లేవు. పీఎంఎస్ అనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారిలో జరిగే హార్మోన్ల మార్పుల తీవ్రతను బట్టి, కొందరిలో పీఎంఎస్ లక్షణాలు ఉంటాయి, కొందరిలో ఏమీ ఉండవు. దీనికి చికిత్సలో భాగంగా ప్రైమ్ రోజ్ ఆయిల్ క్యాప్సూల్స్‌తో పాటు విటమిన్, మినరల్స్ వంటివి మూడు నెలలపాటు వాడుతూ యోగా, వాకింగ్, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల ఆర్‌ఎంఎస్ లక్షణాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి లేదా తీవ్రత చాలావరకు తగ్గుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో అవసరం.
మా బంధువు ఒకరికి గర్భసంచిలో గడ్డలు ఉన్నట్లు చెప్పారు. గర్భసంచిలో గడ్డలు అంటే... అది కచ్చితంగా క్యాన్సరే అంటున్నారు కొందరు. మరికొందరేమో...ఫైబ్రాయిడ్ గడ్డలేమో అంటున్నారు. గర్భసంచిలోని గడ్డలకు క్యాన్సర్‌కు ఏమైనా సంబంధం ఉందా?
– జె.ఎల్, వరంగల్
గర్భసంచిలో గడ్డలు అంటే 95 శాతం ఫైబ్రాయిడ్ గడ్డలే ఉంటాయి. ఈ గడ్డలు 99 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. 1 శాతం మందిలో ఈ గడ్డలు ఉన్నట్లుండి చాలా పెద్దగా పెరుగుతూ ఫైబ్రోసార్కోమా అనే క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. 4 శాతంలో అడినోమయోమా గడ్డలు ఉంటాయి. ఇవి కూడా క్యాన్సర్ గడ్డలు కాదు. ఫైబ్రాయిడ్స్ సైజును బట్టి, గర్భాశయంలో ఉండే పొజిషన్‌ను బట్టి, బ్లీడింగ్‌లో ఇబ్బంది, కడుపులో నొప్పి లేకుండా ఉంటే, 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఒకసారి మళ్లీ స్కానింగ్ చేయించుకుని, వాటి సైజు ఎంత పెరుగుతుంది అనేది గమనించుకోవలసి ఉంటుంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం వల్ల హైపర్‌టెన్సివ్ డిజార్డర్‌లు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చదివాను. ఇది ఎంత వరకు నిజం? ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగితే తగ్గే ప్రయత్నం చేయవచ్చా? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
– సరిత, విజయవాడ
గర్భిణీ సమయంలో బీపీ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు పెరగడం, గర్భం దాల్చక ముందు నుంచే అధిక బరువు ఉండి, మరలా గర్భం దాల్చిన తర్వాత పెరగడం వల్ల గర్భం దాల్చిన తర్వాత బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. కాకపోతే, బరువు ఎక్కువగా పెరగకుండా జాగ్రత్తలు పాటించడం మంచిది.మామూలు బరువు ఉన్నవారికి నెలకు రెండు కేజీల వరకు పెరగవచ్చు. కానీ బరువు ఎక్కువగా ఉన్నవారు నెలకు అర కేజీ నుండి కేజీ వరకు పెరగవచ్చు. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుని కూరలు ఎక్కువ తీసుకోవడం, స్వీట్లు, షుగర్, అరటిపండ్లు, సపోటాలు వంటి షుగర్ ఎక్కువ ఉండే పండ్లు వీలైనంతవరకు తీసుకోకపోవటం, నూనె, నెయ్యి తక్కువ తీసుకోవటం, డాక్టర్ సలహా మేరకు నడక, వ్యాయామం చెయ్యటం వంటి నిబంధనలు పాటించడం వల్ల అధిక బరువు పెరగకుండా ఉండి ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే అవకాశాలు తగ్గుతాయి.