ఇవ్వాళ ఒక అబద్ధం చెప్పడానికి అలవాటు పడినవాడు...రేపు వంద అబద్ధాలు చెప్పడానికైనా వెనకాడడు. వ్యసనాల బారిన పడ్డవాడు మొదట సుఖంగా ఉన్నట్లు అనిపించినా ఆ తరువాత అతడి జీవితం ఎలా కష్టాలమయమవుతుందో చెప్పే చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరు చెప్పుకోండి చూద్దాం...
ఆ కుర్రాడు రిటైర్డ్ జడ్జీగారి చిన్న కొడుకు.దేవుని ఎదుట ప్రమాణం చేసినా చేయకపోయినా....అన్నీ అబద్ధాలే చెబుతాడు.నమ్మినవాళ్లకు నమ్మినన్ని అబద్ధాలు!ఈ కుర్రాడు ఒక్క రోజూ కూడా కాలేజీకి డుమ్మా కొట్టడు. కారణం చదువు మీద శ్రద్ధ కాదు. అమ్మాయిల మీద శ్రద్ధ!అందుకే ఈ కుర్రాడు మరియు అతని అనుచరగణం ఎప్పుడు బయటికి వెళతారో అని చూస్తుంటాడు లెక్చరర్.అదిగో ఆ క్లాస్ వైపు చూడండి...‘‘అందరికీ ప్రెజెంట్ అని వేశాను’’ అన్నారు లెక్చరర్‌గారు అప్పుడే వచ్చిన ఆ కుర్రగ్యాంగ్‌ను చూస్తూ.‘‘థ్యాక్సండీ’’ అని లెక్చరర్‌గారికి కృతజ్ఞతలు చెప్పి స్నేహితుల వైపు తిరిగి..‘‘అటెండెన్స్ అయిపోయింది. ఇక మనం వెళదాం’’ అని పిలుపునిచ్చారు అబ్బయిగారు.‘‘అటెండెన్స్ అయిపోగానే అదృశ్యమైపోతే మాస్టారుగారు రోదిస్తారురా’’ వెక్కిరింపు గొంతుతో అన్నాడు ఆ గుంపులో ఒకడు.‘‘ఆయనేం ఫీల్ అవ్వరురా. హాయిగా పండగలా ఫీలై పాఠాలు చెబుతారు’’ అసలు నిజాన్ని ఆవిష్కరించాడు మరొకడు.‘‘నిజంగానా, అయితే రాండ్రా వెళ్లిపోదాం’’ అని అమాయకపు ముఖం పెట్టాడు జడ్జిగారి అబ్బాయి.ఒకడు వెళుతూ వెళుతూ లెక్చరర్‌గారిని ఇలా ఆశీర్వదించాడు...‘‘పాఠాలు బాగా చెప్పి మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడే ప్రమోషన్ వచ్చి ప్రిన్సిపల్ అవుతారు’’‘‘వెళ్లొస్తాం సార్’’ అన్నాడు ఒకడు లెక్చరర్‌కి నమస్కరిస్తూ.‘‘మీదే ఆలస్యం’’ అన్నారు లెక్చరర్.గుంపు క్లాస్ విడిచి బయటికి వెళ్లింది.
‘హమ్మయ్య’ అనుకున్నారు లెక్చర్‌గారు మరియు విద్యార్థులు.వాళ్లు కాలేజీ నుంచి సరాసరి క్లబ్బుకు వెళ్లారు.ఏ అర్ధరాత్రో ఇంటికి తిరిగొచ్చారు అబ్బాయిగారు.‘‘అదేనమ్మా నడిరోడ్డు మీద లారీ కొట్టీ బామ్మ రోడ్డు మీద రక్తంలో మెడ తెగిన కోడిలా గిలగిలా కొట్టుకుంటుంటే’’‘‘శివా శివా... ఇక చెప్పకురా బాబు. ఆ ఘోరాన్ని వినలేను. ఇంతకీ ఆమె ప్రాణాలతో ఉందా?’’ అడిగింది పార్వతి.‘‘నేనే లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అర్ధరాత్రి అయినా అమ్మ తిట్టినా సరే అని బామ్మగారిని హాస్పిటల్లో చేర్పించాను. రక్తం తక్కువైతే నా రక్తం ఇచ్చా. దేవతలాంటి ఈ తల్లి రక్తం పంచుకు పుట్టాను. ఇందులో కాస్త అమ్మకు ఇవ్వాలనుకున్నాను. తప్పంటావా అమ్మ?’’ నాటకీయంగా మెలికలు తిరిగారు అబ్బాయిగారు.ఆ పిచ్చితల్లి నిజంగానే నమ్మింది!‘‘తప్పేముంది బాబూ! ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం లక్ష పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఒకటే. కానీ నువ్వు ఇలా ఆలస్యంగా వచ్చావని మీ నాన్నకు తెలిస్తే కారణం ఏమైనా సరే ఆయన మండిపడతారు’’ ఒకవైపు కొడుకును మెచ్చుకుంటూనే రాబోయే ప్రమాదాన్ని గురించి చెప్పింది పార్వతి.ఆ ప్రమాదం దగ్గరికి రానే వచ్చింది.‘‘మండిపడతారు కాదు పడుతూనే ఉన్నాను’’ అన్నారు తల్లికొడుకుల దగ్గరికి వచ్చిన జడ్జిగారు చుట్టకాలుస్తూ.‘‘కాలం విలువ తెలియకుండా వీడు తిరగడం, ఏంట్రా అని అడిగే లోపల ఏదో హరికథ, బుర్రకథ వినిపించడం నువ్వు నమ్మడం’’ అంటూ భార్యపై కన్నెర్రచేశారు జడ్జిగారు.‘‘బుర్రకథ ఏమిటండీ! ఎవరో బామ్మ చనిపోబోతుంటే..’’ అని ఆ పార్వతమ్మ అమాయకంగా అంటుంటే...పుత్రుడుగారు అందుకున్నారు... ‘‘అదేనమ్మా...బామ్మగారి బుర్ర బద్దలైపోయింది కదా. అందుకే బుర్రకథ అంటున్నారు నాన్నాగారు’’‘‘నోర్ముయ్. నువ్వు చెప్పే అబద్ధాలు మీ అమ్మలాగే నేను నమ్ముతాననుకుంటున్నావా?’’ అంతెత్తున లేచారు జడ్జిగారు.
‘‘దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను.అబద్ధం చెప్పను. నిజంగా ఒక బామ్మగారికి యాక్సిడెంట్ జరిగింది’’ నాన్నను నమ్మించబోయాడు కొడుకు.‘‘ఛస్తే నమ్మను’’ అన్నారు ఆయన ముఖం అదోలా పెట్టి.‘‘రిటైర్డ్ జడ్జిగారు కదమ్మా. కోర్టులో ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పే సాక్షులను చూసీ చూసీ నాదీ అబద్ధమే అనుకుంటున్నారు’’ అని లేని బాధను తెచ్చుకున్నారు అబ్బాయిగారు.
అమ్మ చేతిని తన చేతిలో తీసుకొని...‘‘అమ్మా...అన్నం పెడుదువుగాని రా’’ అన్నాడు.‘‘వాడికి పెట్టాల్సింది అన్నం కాదు గడ్డి. చదువు, సంధ్య వదిలి, పరువు మర్యాద మరిచి పశువులా తిరిగేవాడికి గడ్డి పెట్టాలి గడ్డి’’ అని ఉరిమారు జడ్జిగారు.‘‘అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బిడ్డను తిండి తిన్నావా? లేదా? అని అడగడం మానేసి ఇంతసేపు చీవాట్లు పెట్టడం చాలక గడ్డిపెట్టాలట. పాపం పసివాణ్ణి చేసి అస్తమానం మాటలు అనడమే మీ పని’’ అంటూ పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఊరుకోమ్మా...ప్రపంచంలో ప్రతి మహాత్ముడు మొదట్లో పదిమంది చేత ఇలా మాటలు పడ్డవారే. వీటిని పట్టించుకోకు’’ అంటూ తనకు తానే మహాత్ముడి హోదా ఇచ్చేసుకున్నారు అబ్బాయిగారు.‘‘ఛీ...నువ్వెందుకు పట్టించుకుంటావురా. అసలు నీకు సిగ్గు, అభిమానం ఉండి ఛస్తేగా’’ అని కొడుకును తిట్టి ఆ తిట్లలో సగం భార్యకు ఇలా పంచారు జడ్జిగారు.‘‘పసివాడు పసివాడు అని గారాబం చేసి పనికిమాలినవాడిని తయారుచేశావు’’పెద్దకొడుకు, రెండో కొడుకును గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు...‘‘ఆ పెద్దవాళ్లిద్దరూ నా పెంపకంలో పెరిగారు కాబట్టి పరువు దక్కించే పద్ధతిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వీడు?’’‘‘అవుతాడు నాన్నాగారు అవుతాడు. వీడు గొప్పవాడవుతాడు. తొందరపడవద్దు’’ అన్నారు అబ్బాయిగారు.‘‘నువ్వా! నాకు కొరివి పెట్టేలోగా నా పేరు ప్రతిష్ఠలకు నిప్పెడతావు. నేను బూడిదయ్యేలోగా ఈ ఇంటిపేరు మట్టిపాలు చేస్తావు’’ అని గట్టిగా అరిచారు జడ్జిగారు.‘‘అబ్బా! వేళాపాళా లేకుండా ఏమిటండీ ఆ అపశకునపు మాటలు’’ అని భర్తను సముదాయించడానికి ప్రయత్నించింది పార్వతమ్మ.
Comments
Please login to add a commentAdd a comment