అజ్ఞాతవాసం: సురభి ఝవేరీ... మారిందేమి నీ దారి?!
‘మేనత్త కూతురివే మెరుపంటి మరదలివే’ అంటూ ‘పల్నాటి పౌరుషం’లో సంజయ్ భార్గవ్ పాడుతుంటే... మాకూ ఇలాంటి మరదలుంటే బాగుణ్ను అను కున్నారు యువకులు. ‘సిరివెన్నెల్లో విరిసింది ఓ మల్లికా... వీచే చిరు గాలిలో వేచే వనకన్యలా’ అంటూ ‘కొండపల్లి రత్తయ్య’ కూతురిని చూసి హరీష్ పాడుతోంటే... మాకు దొరకదేం ఇలాంటి వన్నెల చిలుక అంటూ అసూయపడ్డారు పురుష పుంగవులు. కొంటె చూపులు, తుంటరి నవ్వులతో గిలిగింతలు పెట్టిన ఆమె ఇప్పుడు కనిపించదే మి? కాదనుకుని వెళ్లిందా? కావాలని తప్పుకుందా?
సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అని ఎవరిని అనాలి? ఎక్కువ సినిమాలు చేసినవారినా? ఎక్కువ ప్రేక్షకాదరణ పొందినవారినా? వీటిలో ఏది కరెక్ట్ అయినా సురభిని సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఆమె చాలా సినిమాలే చేసింది. పల్నాటి పౌరుషం, ఎమ్.ధర్మరాజు ఎంఏ, మనీ మనీ, అల్లరోడు, కొండపల్లి రత్తయ్య, కేటు-డూప్లికేటు, డియర్ బ్రదర్, చెన్‌కోల్ (మలయాళం)... ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఫిల్మోగ్రఫీ పెద్దగానే కనిపిస్తుంది. ఇక ప్రేక్షకాదరణ సంగతి చెప్పాల్సిన పని లేదు. ‘పల్నాటి పౌరుషం’లో చూసి ఈ పిల్లెవరో బాగుందే అనుకున్నవాళ్లు... ‘మనీ మనీ’లో సురభిని చూశాక ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఈ జాబిలి తునక అనుకున్నారు. అంతగా అందరి మనసులనూ దోచిందామె. కానీ ఏమయ్యిందో ఏమో... ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయింది సురభి. ఆమె ఎందుకు వెళ్లింది? ఎక్కడికి చేరింది?
మూలాలు అక్కడున్నాయి... సురభి గురించి మన తెలుగువారికి తెలిసింది చాలా తక్కువే. ఆమె పూర్తి పేరు సురభి ఝవేరీ. గుజరాత్‌కు చెందిన అమ్మాయి. నటన అంటే ఆమెకు సినిమాయే కాదు... నాటకం కూడా. నాటక రంగంలో ఆమెకు మంచి పేరు ఉంది. ఇమేజ్ ఉంది. తర్వాత సినిమాల్లోకి వచ్చింది. మొదట కొన్ని సినిమాలు చేసినా... రామ్‌గపాల్ వర్మ చేతిలో పడ్డాక ఫేటు మారింది. ఆయన నిర్మించి, శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘మనీ మనీ’ చిత్రంలో సురభిని చూసి మనసు పారేసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు.
విలన్ గ్యాంగ్ చేతుల్లో చిక్కి అష్టకష్టాలు పడే అమాయకురాలిగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ‘అల్లరోడు’ చిత్రం కూడా సురభికి మంచిపేరే తెచ్చిపెట్టింది. అమ్మాయిల పిచ్చోడయిన రాజేంద్ర ప్రసాద్‌ని అదుపు చేయాలని ప్రయత్నించే భార్యగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో పాతిక సినిమాల వరకూ చేసింది. కానీ సడెన్‌గా అదృశ్యమయ్యింది. ఆమె నటించడం లేదన్న విషయాన్ని అందరూ గుర్తించేలోపూ తెలుగు ప్రేక్షకుల ఆలోచనల నుంచి పూర్తిగా తప్పుకుంది.
సురభి నటన మానేయడానికి కారణాలు ఎవరికీ పెద్దగా తెలియవు. అవకాశాలు తగ్గడంతోనే వెళ్లిపోయిందని కొందరన్నారు. పెళ్లి చేసుకున్నదని ఇంకొందరన్నారు. అయితే అసలు కారణం ఏంటనేది మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. అడుగుదామంటే సురభి మళ్లీ మనవైపు తొంగి చూసిందీ లేదు. కానీ చాలా యేళ్ల తరువాత ఆమె ఒక సీరియల్‌లో తళుక్కుమనడంతో సురభి గురించి కాస్తయినా తెలుసుకునే చాన్స్ దొరికింది.
కలర్స్ చానెల్లో ప్రసారమైన ‘ముక్తిబంధన్’ సీరియల్లో ఒకరోజు సడెన్‌గా ప్రత్యక్షమయ్యింది సురభి. నిజానికి మొదట్లో ఆమెని ఎవరూ గుర్తు పట్టలేదు. బాగా లావైపోయింది. రూపం గుర్తు పట్టలేనట్టుగా తయారైంది. ఆమె సురభియేనా కాదా అన్నంతగా మారిపోయింది. అయితే మనిషి మారిందేమో కానీ టాలెంట్‌లో మాత్రం మార్పు లేదు. చారులతా విరానీగా ఆ సీరియల్‌లో ఆమె నటన అందరినీ అలరించింది. అప్పుడే ఆమె గురించి కొన్ని వివరాలు తెలిశాయి. ప్రముఖ నాటక, టెలివిజన్ నటుడు, సహాయ దర్శకుడు అయిన ధర్మేష్‌వ్యాస్‌ని పెళ్లాడి... సురభి ఝవేరీ వ్యాస్‌గా మారింది సురభి. తెలుగు తెరకు దూరమయ్యింది కానీ గుజరాతీ, మరాఠీ నాటకాల్లో నటిస్తోంది. కొన్నేళ్ల గ్యాప్ తరువాత ‘ముక్తిబంధన్’ ద్వారా హిందీ సీరియల్స్‌లోకి ప్రవేశించింది. ఓ పక్క సీరియల్, మరోపక్క నాటకాలతో తిరిగి బిజీగా అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
కానీ తెలుగు సినిమాల వైపుగానీ, సీరియళ్ల వైపుగానీ మళ్లీ వచ్చే ప్రయత్నాలు చేయడం లేదు సురభి. ఇక్కడికి రావడం ఆమెకు ఇష్టం లేదా? రాకూడదని అనుకుంటోందా? లేక ఎవరైనా పిలిస్తే వద్దామని ఎదురు చూస్తోందా? సీనియర్ నటీమణులకు పిలిచి పెద్దపీట వేసే మన దర్శక నిర్మాతలు సురభిని కూడా పిలుస్తారేమో చూద్దాం!