‘‘నేను కూడా ఏమీ చేయకుండా కూర్చుని ఉంటే లలితమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా?’’ సుబ్బులును అడిగాడు శివయ్య. శివయ్య ఇంటి పక్కనే ఉండే సుబ్బులు.. అతనెప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడా అని ఎదురుచూస్తోంది. చాలారోజుల్నుంచి మనసులో దాచుకున్న విషయమే.. చెప్పేసింది. ‘‘మాకంటే పెద్దింటి పిల్ల కదా.. ఇంకా బాధపడుద్ది. ఆవిడ నీకేం సెప్పలేకపోతోంది కానీ, నువ్ సెయ్యాల్సిన పనులూఎన్నో ఉన్నాయ్!! చినబాబును స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం సూస్కొని ఇల్లు గడిచే ఉపాయం చెయ్యాలా? ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులేగా!!’’.సుబ్బులు మాటలు శివయ్యను ఆలోచనల్లో పడేశాయి. అప్పటికప్పుడు బాబును స్కూల్లో చేర్పించాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఉద్యోగం కూడా సంపాదించాలి. స్కూల్లో అడిగి చూశాడు. కానీ చాలా డబ్బులు కావాలి. ఎంత ప్రయత్నించినా తన దగ్గర అంత డబ్బుండే అవకాశమే లేదనుకున్నాడు శివయ్య. శివయ్య అమాయకుడు. లోకం తెలియదు. వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదు. పెళ్లంటే కూడా తెలియదు. ఉద్యోగమన్నా, డబ్బు సంపాదించడమన్నా, నలుగురిలో కలిసిపోవడమన్నా.. ఏది చెయ్యాలన్నా ఓ మనిషికి ఏదోకటి తెలిసుండాలి. శివయ్యకు అవేవీ తెలియదు. కానీ పెళ్లి చేసుకున్నాడు. అదీ భర్త చనిపోయిన లలితమ్మను చేసుకున్నాడు. లలితమ్మకు అప్పటికే ఓ కొడుకు కూడా!ఇప్పుడు శివయ్య ఆ ఇద్దరినీ చూసుకోవాలి. బాబును చదివించాలి. డబ్బులు లేవు. వీధుల వెంట తిరుగుతూ, ఒంటిపై కొరడాలతో గట్టిగా కొట్టుకుంటూ జనాల దగ్గర డబ్బులు అడుక్కుంటున్నాడు శివయ్య. లలితమ్మకు గురువైన ఓ పెద్దమనిషి శివయ్య రోడ్ల మీద పడి వేస్తున్న వేషాలు చూశాడు. ‘‘ఏవిటిది! ఏవిటయ్యా ఇది! ఏవిటీ అఘాయిత్యం?’’ అడిగాడాయన. ‘‘మీరెవరో నాకు తెలియదే!’’ అన్నాడు శివయ్య. ‘‘ఫర్వాలేదులే! నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మ అంతా చెప్పింది.’’ అన్నాడా పెద్దమనిషి. ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అన్నట్టుచూశాడు శివయ్య. ఆ వెంటనే బాబు వైపు చూస్తూ.. ‘‘పద పక్క వీధికి వెళ్దాం..’’ అన్నాడు. ‘‘ఎందుకు?’’ అడిగాడు పెద్దమనిషి.‘‘ఈ ఊర్లో ఉన్నవాళ్లు డబ్బులివ్వడం అయిపోయిందీ. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా..’’శివయ్య మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘ఆ మిగతా డబ్బులు నేనిస్తా పద!’’ అని అక్కణ్నుంచి తీసుకెళ్లాడు ఆ పెద్దమనిషి. ‘‘అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా ఒళ్లు హూనం చేసుకుంటారటయ్యా?’’ అన్నాడు పెద్దమనిషి. ‘‘మరింకేం చేస్తాను. నాకు ఉద్యోగం లేదుగా!’’ అన్నాడు శివయ్య. ‘‘లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది.’’ ‘‘అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా?’’‘‘చూద్దాంలే పద!’’ నవ్వుతూ చెప్పాడు పెద్దమనిషి.
శివయ్య అనుకున్న పనిని మర్చిపోవద్దని గట్టిగా అనుకున్నాడు. ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగిస్తూ వస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. బాబును స్కూల్లో చేర్పించాడు. తన ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాడు. ఉద్యోగం ఇస్తానన్న పెద్ద మనిషి గుర్తొచ్చాడు. వెంటనే ఓ ఉదయాన్నే, పాల ప్యాకెట్ కొనడానికొచ్చిన ఆ పెద్దమనిషి ముందు వాలిపోయాడు. ‘‘ఏమిటి శివయ్యా!?’’ అడిగాడా పెద్దమనిషి.‘‘మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు..’’‘‘ఓ అదా! నేనెవర్నీ కలిసి మాట్లాడలేదే? కలిశాక నేనే కబురు పంపిస్తాలే..’’సరేనన్నట్టు తలూపాడు శివయ్య. అటు తర్వాత పెద్దమనిషి గుడికి వెళ్తే అక్కడా ప్రత్యక్షమయ్యాడు శివయ్య. ‘‘నా ఉద్యోగం..’’ అనడిగాడు శివయ్య. ‘‘ఉద్యోగమని చెప్పావ్‌గా.. చూస్తానని నేనూ చెప్పానుగా..’’ విసుక్కుంటూనే శివయ్యకు సమాధానమిచ్చాడు ఆ పెద్దమనిషి. మళ్లీ ఆ పెద్దమనిషి వీధిలో ఏదో పనుండి సైకిల్‌పై వెళుతూంటే ప్రత్యక్షమయ్యాడు శివయ్య.. ‘‘నా ఉద్యోగం..’’ అంటూ. అర్ధరాత్రివేళ ఇంటి ముందు కూడా ప్రత్యక్షమయ్యాడు.. ‘‘నా ఉద్యోగం..’’ అన్నాడు. పెద్దమనిషికి కోపమొచ్చి విసుక్కున్నాడు. అయినా శివయ్య ఆ ఇంటి ముందే కూర్చున్నాడు ఆ రాత్రి వేళ. ఆ పెద్దమనిషికి శివయ్య వింతగా కనిపించాడు. శివయ్యకు దగ్గరగా వెళ్లి, అతని భుజమ్మీద చెయ్యేసి, ‘‘అయితే ఉద్యోగం కావాలంటావ్?’’ అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పుడు శివయ్య ఆ పెద్దమనిషితో ఓ మాట అన్నాడు. ఆ తర్వాత వెంటనే శివయ్యకు ఉద్యోగం వచ్చేలా చేశాడు ఆ పెద్దమనిషి. శివయ్య పెద్దమనిషికి చెప్పిన ఆ మాట – ‘‘బాబును బాగా చదివించి పెద్దవాణ్ని చెయ్యాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా? అందుకే లలిత మెడలో నేను తాళి కట్టాను’’.
నా ఉద్యోగం...
Published Sun, Jan 28 2018 12:22 AM | Last Updated on Sun, Jan 28 2018 12:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment