sivayya
-
నా ఉద్యోగం...
‘‘నేను కూడా ఏమీ చేయకుండా కూర్చుని ఉంటే లలితమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా?’’ సుబ్బులును అడిగాడు శివయ్య. శివయ్య ఇంటి పక్కనే ఉండే సుబ్బులు.. అతనెప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడా అని ఎదురుచూస్తోంది. చాలారోజుల్నుంచి మనసులో దాచుకున్న విషయమే.. చెప్పేసింది. ‘‘మాకంటే పెద్దింటి పిల్ల కదా.. ఇంకా బాధపడుద్ది. ఆవిడ నీకేం సెప్పలేకపోతోంది కానీ, నువ్ సెయ్యాల్సిన పనులూఎన్నో ఉన్నాయ్!! చినబాబును స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం సూస్కొని ఇల్లు గడిచే ఉపాయం చెయ్యాలా? ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులేగా!!’’.సుబ్బులు మాటలు శివయ్యను ఆలోచనల్లో పడేశాయి. అప్పటికప్పుడు బాబును స్కూల్లో చేర్పించాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఉద్యోగం కూడా సంపాదించాలి. స్కూల్లో అడిగి చూశాడు. కానీ చాలా డబ్బులు కావాలి. ఎంత ప్రయత్నించినా తన దగ్గర అంత డబ్బుండే అవకాశమే లేదనుకున్నాడు శివయ్య. శివయ్య అమాయకుడు. లోకం తెలియదు. వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదు. పెళ్లంటే కూడా తెలియదు. ఉద్యోగమన్నా, డబ్బు సంపాదించడమన్నా, నలుగురిలో కలిసిపోవడమన్నా.. ఏది చెయ్యాలన్నా ఓ మనిషికి ఏదోకటి తెలిసుండాలి. శివయ్యకు అవేవీ తెలియదు. కానీ పెళ్లి చేసుకున్నాడు. అదీ భర్త చనిపోయిన లలితమ్మను చేసుకున్నాడు. లలితమ్మకు అప్పటికే ఓ కొడుకు కూడా!ఇప్పుడు శివయ్య ఆ ఇద్దరినీ చూసుకోవాలి. బాబును చదివించాలి. డబ్బులు లేవు. వీధుల వెంట తిరుగుతూ, ఒంటిపై కొరడాలతో గట్టిగా కొట్టుకుంటూ జనాల దగ్గర డబ్బులు అడుక్కుంటున్నాడు శివయ్య. లలితమ్మకు గురువైన ఓ పెద్దమనిషి శివయ్య రోడ్ల మీద పడి వేస్తున్న వేషాలు చూశాడు. ‘‘ఏవిటిది! ఏవిటయ్యా ఇది! ఏవిటీ అఘాయిత్యం?’’ అడిగాడాయన. ‘‘మీరెవరో నాకు తెలియదే!’’ అన్నాడు శివయ్య. ‘‘ఫర్వాలేదులే! నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మ అంతా చెప్పింది.’’ అన్నాడా పెద్దమనిషి. ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అన్నట్టుచూశాడు శివయ్య. ఆ వెంటనే బాబు వైపు చూస్తూ.. ‘‘పద పక్క వీధికి వెళ్దాం..’’ అన్నాడు. ‘‘ఎందుకు?’’ అడిగాడు పెద్దమనిషి.‘‘ఈ ఊర్లో ఉన్నవాళ్లు డబ్బులివ్వడం అయిపోయిందీ. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా..’’శివయ్య మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘ఆ మిగతా డబ్బులు నేనిస్తా పద!’’ అని అక్కణ్నుంచి తీసుకెళ్లాడు ఆ పెద్దమనిషి. ‘‘అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా ఒళ్లు హూనం చేసుకుంటారటయ్యా?’’ అన్నాడు పెద్దమనిషి. ‘‘మరింకేం చేస్తాను. నాకు ఉద్యోగం లేదుగా!’’ అన్నాడు శివయ్య. ‘‘లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది.’’ ‘‘అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా?’’‘‘చూద్దాంలే పద!’’ నవ్వుతూ చెప్పాడు పెద్దమనిషి. శివయ్య అనుకున్న పనిని మర్చిపోవద్దని గట్టిగా అనుకున్నాడు. ఆలోచనలన్నీ కూడా అటువైపే సాగిస్తూ వస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. బాబును స్కూల్లో చేర్పించాడు. తన ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాడు. ఉద్యోగం ఇస్తానన్న పెద్ద మనిషి గుర్తొచ్చాడు. వెంటనే ఓ ఉదయాన్నే, పాల ప్యాకెట్ కొనడానికొచ్చిన ఆ పెద్దమనిషి ముందు వాలిపోయాడు. ‘‘ఏమిటి శివయ్యా!?’’ అడిగాడా పెద్దమనిషి.‘‘మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు..’’‘‘ఓ అదా! నేనెవర్నీ కలిసి మాట్లాడలేదే? కలిశాక నేనే కబురు పంపిస్తాలే..’’సరేనన్నట్టు తలూపాడు శివయ్య. అటు తర్వాత పెద్దమనిషి గుడికి వెళ్తే అక్కడా ప్రత్యక్షమయ్యాడు శివయ్య. ‘‘నా ఉద్యోగం..’’ అనడిగాడు శివయ్య. ‘‘ఉద్యోగమని చెప్పావ్‌గా.. చూస్తానని నేనూ చెప్పానుగా..’’ విసుక్కుంటూనే శివయ్యకు సమాధానమిచ్చాడు ఆ పెద్దమనిషి. మళ్లీ ఆ పెద్దమనిషి వీధిలో ఏదో పనుండి సైకిల్‌పై వెళుతూంటే ప్రత్యక్షమయ్యాడు శివయ్య.. ‘‘నా ఉద్యోగం..’’ అంటూ. అర్ధరాత్రివేళ ఇంటి ముందు కూడా ప్రత్యక్షమయ్యాడు.. ‘‘నా ఉద్యోగం..’’ అన్నాడు. పెద్దమనిషికి కోపమొచ్చి విసుక్కున్నాడు. అయినా శివయ్య ఆ ఇంటి ముందే కూర్చున్నాడు ఆ రాత్రి వేళ. ఆ పెద్దమనిషికి శివయ్య వింతగా కనిపించాడు. శివయ్యకు దగ్గరగా వెళ్లి, అతని భుజమ్మీద చెయ్యేసి, ‘‘అయితే ఉద్యోగం కావాలంటావ్?’’ అన్నాడు ఆ పెద్దమనిషి. అప్పుడు శివయ్య ఆ పెద్దమనిషితో ఓ మాట అన్నాడు. ఆ తర్వాత వెంటనే శివయ్యకు ఉద్యోగం వచ్చేలా చేశాడు ఆ పెద్దమనిషి. శివయ్య పెద్దమనిషికి చెప్పిన ఆ మాట – ‘‘బాబును బాగా చదివించి పెద్దవాణ్ని చెయ్యాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా? అందుకే లలిత మెడలో నేను తాళి కట్టాను’’. -
సీఐ వేధించాడని..!
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం మంచాల: గ్రామంలో తలెత్తిన చిన్న గొడవను పరిష్కరించుకుంటామన్నా వినకుండా స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ దూషించాడన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండలం లోని బండలేమూర్‌లో ఇరుగుపోరుగున ఉండే గొడ్డటి మల్లయ్య, ముచ్చర్ల శివయ్యల మధ్య ఇంటి స్థలం విషయంలో ఇటీవల ఓ చిన్నగొడవ జరిగింది. దీంతో శివయ్య, కుటుంబ సభ్యులపై ఈ నెల 19న మం చాల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను స్టేషన్‌కు తరలించారు. గొడవను గ్రామంలో రాజీ చేసుకుంటామని శివయ్య కుటుంబీకులు సీఐను కోరారు. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు శివయ్య కుటుం బీకులను ఠాణాలోనే ఉంచి రాత్రి వదిలేయడంతో ఇంటికి వెళ్లారు. సీఐ తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన శివయ్య.. కుటుంబీకులు నిద్రించిన తర్వాత ఇంటి ఎదుట ఉన్న ఓ కట్టెకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ దురుసుగా ప్రవర్తించడం తో శివయ్య మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడని మృతుడి భార్య, గ్రామస్తులు ఆరోపించారు. చిన్నగొడవ విషయంలో ఎలాంటి విచారణ జరపకుండా సీఐ వేధించారని మండిపడ్డారు. సీఐపై కేసు నమోదు చేయాలని మృతుడి కుటుంబీకులు, స్థానికులు ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్‌కు ఫిర్యా దు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. -
శివయ్య తిరిగొస్తాడా?!
ఊళ్లో దేవుడున్నన్నాళ్లూ ఒక్కరూ పట్టించుకోలేదు. అసలా గుడివైపునకే వెళ్లలేదు. దేవుడు మాయమయ్యాడని తెలియగానే ఆయనను చూడాలని తపిస్తున్నారు! పూజలు చెయ్యాలని ఆరాటపడుతున్నారు. శివయ్య మళ్లీ తమ ఊళ్లోకి వచ్చేయాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వెయ్యేళ్లనాటి శివుడి విగ్రహాన్ని కోల్పోయిన ఆ ఊళ్లో ఇప్పుడు అందరూ అనాథలే! అంటే శివనాథుడు లేనివారే!! పళనిసామి కాశి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించి వస్తాడు. దైవపీఠం మీద దేవుడు ఉండడు. అయినా ప్రార్థించి వస్తాడు. అది ప్రార్థనలా ఉండదు. మొరపెట్టుకున్నట్లుగా ఉంటుంది! అతడి ప్రార్థన మొదట దిగంతాలలోని శివుడికి చేరుతుంది. తర్వాత హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి ఆస్ట్రేలియా ఖండం చేరుకుంటుంది. అక్కడి నుంచి రాజధాని కాన్బెర్రాలో ఉన్న ‘నేషనల్ ఆర్ట్ గ్యాలరీ’ ద్వారాలను తోసుకుని మరీ లోపలికి వెళుతుంది. శ్రీపురంధ గ్రామ శివాలయంలో మాయమైన నటరాజ కాంస్య విగ్రహం ఆ గ్యాలరీలోనే ఉందని గ్రామస్థుల నమ్మకం మరి. ఒక్క పళనిసామి మాత్రమే కాదు, గ్రామంలోని వారంతా శివయ్య రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శివయ్య తిరిగొస్తే పాప పరిహారం చేసుకుందామని ఊరు ఊరంతా తొందరపడుతోంది. ఇంతకీ వారు చేసిన పాపం? శివయ్యకు ఒక్కనాడైనా పూజ చేయకపోవడం. శిథిలావస్థలో ఉన్న గుడిని తరతరాలుగా నిర్లక్ష్యం చేయడం. విగ్రహం మాయమయ్యాక మాత్రమే వారు శివుడి గురించి, శివాలయం గురించీ పట్టించుకోవడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం వరకు శ్రీపురంధలో ఎవరూ పళనిసామి కుటుంబంతో మాట్లాడేవారు కాదు. పళనిసామి కుటుంబ సభ్యులే ఆ శివాలయంలోని నటరాజును, మరో ఏడు విగ్రహాలను మాయం చేసి ఉంటారని వారందరికీ అనుమానం! గ్రామం ఆ కుటుంబం మీద నింద వేయడానికి కారణం ఉంది. ఆలయం ప్రహరీ పళనిసామి ఇంటి గోడను అనుకునే ఉంటుంది. పళనిసామి, అముదల పెళ్లి కూడా 1994లో ఆ ప్రాంగణానికి సమీపంలోనే జరిగింది. అది ఆ కుటుంబానికి బాగా అలవాటైన ప్రదేశం. అందువల్ల వారికి తెలియకుండా బయటివాళ్లు వచ్చి 900 ఏళ్ల క్రితం నాటి శివుడి విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని గ్రామస్థుల నమ్మకం. చెన్నయ్‌కి నైరుతి దిశగా ఐదు గంటలు ప్రయాణిస్తే అరియాళూరు జిల్లాలోని శివారు గ్రామమైన శ్రీపురంధ వస్తుంది. శివాలయమూ వస్తుంది. ఇప్పుడంటే పళనిసామి రోజూ గుడికి వెళ్లి, అక్కడ లేని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు కానీ 2008లో చోరీ జరిగి, ఆ విషయం 2011లో బయటపడే వరకు ఎవరూ గుడి తలుపులే తెరవలేదు. ‘‘గుడిలోపల పెద్ద తేళ్ల గుట్ట ఉండేదట. అవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో భక్తులు, ఆలయ అర్చకులు తేలు కాటుకు గురయ్యి ప్రాణం మీదకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందుకే ఆలయాన్ని శాశ్వతంగా మూసేశారని మా పెద్దలు అనుకోవడం విన్నాను’’ అని గ్రామ పెద్ద రామాయణ్ ఉలగనాథన్ చెబుతుంటారు. మొత్తానికి 2012లో విగ్రహం దొంగలు పట్టుబడడంతో వారి ద్వారా అశోకన్ అనే తమిళనాడు వ్యాపారి, అతడి ద్వారా అంతర్జాతీయ పురావస్తు అక్రమరవాణాలో పేరుమోసిన స్మగ్లర్ సుభాస్ చంద్ర కపూర్ పోలీసులకు పట్టుపడ్డారు. ప్రస్తుతం కపూర్ రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవలే స్థానిక మేజిస్ట్రేటు అతడి రిమాండును మార్చి 21 వరకు పొడిగించారు. ‘‘ఇప్పుడంటే గ్రామస్తులు శాంతించారు కానీ, గత రెండేళ్లగా మాకెంత నరకం చూపించారో, ఎంతగా అవమానించారో మాటల్లో చెప్పలేను. ఆ శివయ్యే మమ్మల్ని కాపాడాడు. దోషుల్ని బయటపెట్టి, మా నిర్దోషిత్వాన్ని గ్రామస్థులకు రుజువు చేశాడు’’ అని చెబుతూ కన్నీళ్ల పర్యంతం అవుతుంటారు పళనిసామి భార్య అముద. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఇంత విషం తాగి చనిపోదామనుకున్న రోజులు కూడా ఈ దంపతుల జీవితంలో ఉన్నాయి. శ్రీపురంధలో ఇప్పుడు గ్రామస్థులంతా పళనిసామి కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అలా పలకరించడంలో పరిహారం ఏదో చేసుకుంటున్న భావన వారిలో వ్యక్తమవుతుంటుంది. ఊళ్లోకి మళ్లీ శివయ్య వచ్చేరోజు కోసం శ్రీపురంధ ఎదురుచూస్తూ ఉంది. ముఖ్యంగా పళనిసామి, ఆయన భార్య. శివయ్య తిరిగి వస్తాడా? చెప్పలేం. నేషనల్ ఆర్ట్ గ్యాలరీలోని నటరాజ విగ్రహం, శ్రీపురంధ విగ్రహం ఒకటి కాదని గ్యాలరీ డెరైక్టర్ రాన్ రాఫోర్డ్ పేచీ పెడుతున్నారు. ‘‘లక్షల డాలర్లు పోసి ఓపెన్ మార్కెట్లో మేము ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాం’’ అని ఆయన అంటున్నారు. ఏమైనా, నిజానిజాలు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా తమ ఊరికి శివయ్య వస్తాడని శ్రీపురంధ గ్రామస్థులు భావిస్తున్నారు. దైవపీఠంపై శివయ్య లేకపోతే ఊరిలో మనుషులున్నా లేకున్నా ఒకటేనని ఇప్పుడా గ్రామం నమ్ముతోంది. అందుకే శివయ్య కోసం వారి కళ్లు కాయలు కాస్తున్నాయి.