శివయ్య తిరిగొస్తాడా?! | siva is reteian in tempel | Sakshi
Sakshi News home page

శివయ్య తిరిగొస్తాడా?!

Published Thu, Mar 13 2014 10:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

శివయ్య  తిరిగొస్తాడా?!

శివయ్య తిరిగొస్తాడా?!

ఊళ్లో దేవుడున్నన్నాళ్లూ ఒక్కరూ పట్టించుకోలేదు. అసలా గుడివైపునకే వెళ్లలేదు. దేవుడు మాయమయ్యాడని తెలియగానే ఆయనను చూడాలని తపిస్తున్నారు! పూజలు చెయ్యాలని ఆరాటపడుతున్నారు. శివయ్య మళ్లీ తమ ఊళ్లోకి వచ్చేయాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వెయ్యేళ్లనాటి శివుడి విగ్రహాన్ని కోల్పోయిన ఆ ఊళ్లో ఇప్పుడు అందరూ అనాథలే! అంటే శివనాథుడు లేనివారే!!
 
పళనిసామి కాశి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించి వస్తాడు. దైవపీఠం మీద దేవుడు ఉండడు. అయినా ప్రార్థించి వస్తాడు. అది ప్రార్థనలా ఉండదు. మొరపెట్టుకున్నట్లుగా ఉంటుంది! అతడి ప్రార్థన మొదట దిగంతాలలోని శివుడికి చేరుతుంది. తర్వాత హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి ఆస్ట్రేలియా ఖండం చేరుకుంటుంది. అక్కడి నుంచి రాజధాని కాన్‌బెర్రాలో ఉన్న ‘నేషనల్ ఆర్ట్ గ్యాలరీ’ ద్వారాలను తోసుకుని మరీ లోపలికి వెళుతుంది. శ్రీపురంధ గ్రామ శివాలయంలో మాయమైన నటరాజ కాంస్య విగ్రహం ఆ గ్యాలరీలోనే ఉందని గ్రామస్థుల నమ్మకం మరి.
 
ఒక్క పళనిసామి మాత్రమే కాదు, గ్రామంలోని వారంతా శివయ్య రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శివయ్య తిరిగొస్తే పాప పరిహారం చేసుకుందామని ఊరు ఊరంతా తొందరపడుతోంది. ఇంతకీ వారు చేసిన పాపం? శివయ్యకు ఒక్కనాడైనా పూజ చేయకపోవడం. శిథిలావస్థలో ఉన్న గుడిని తరతరాలుగా నిర్లక్ష్యం చేయడం. విగ్రహం మాయమయ్యాక మాత్రమే వారు శివుడి గురించి, శివాలయం గురించీ పట్టించుకోవడం మొదలుపెట్టారు.  
 
రెండేళ్ల క్రితం వరకు శ్రీపురంధలో ఎవరూ పళనిసామి కుటుంబంతో మాట్లాడేవారు కాదు. పళనిసామి కుటుంబ సభ్యులే ఆ శివాలయంలోని నటరాజును, మరో ఏడు విగ్రహాలను మాయం చేసి ఉంటారని వారందరికీ అనుమానం! గ్రామం ఆ కుటుంబం మీద నింద వేయడానికి కారణం ఉంది. ఆలయం ప్రహరీ పళనిసామి ఇంటి గోడను అనుకునే ఉంటుంది. పళనిసామి, అముదల పెళ్లి కూడా 1994లో ఆ ప్రాంగణానికి సమీపంలోనే జరిగింది. అది ఆ కుటుంబానికి బాగా అలవాటైన ప్రదేశం. అందువల్ల వారికి తెలియకుండా బయటివాళ్లు వచ్చి 900 ఏళ్ల క్రితం నాటి శివుడి విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని గ్రామస్థుల నమ్మకం.  
 
చెన్నయ్‌కి నైరుతి దిశగా ఐదు గంటలు ప్రయాణిస్తే అరియాళూరు జిల్లాలోని శివారు గ్రామమైన శ్రీపురంధ వస్తుంది. శివాలయమూ వస్తుంది. ఇప్పుడంటే పళనిసామి రోజూ గుడికి వెళ్లి, అక్కడ లేని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు కానీ 2008లో చోరీ జరిగి, ఆ విషయం 2011లో బయటపడే వరకు ఎవరూ గుడి తలుపులే తెరవలేదు. ‘‘గుడిలోపల పెద్ద తేళ్ల గుట్ట ఉండేదట. అవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో భక్తులు, ఆలయ అర్చకులు తేలు కాటుకు గురయ్యి ప్రాణం మీదకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందుకే ఆలయాన్ని శాశ్వతంగా మూసేశారని మా పెద్దలు అనుకోవడం విన్నాను’’ అని గ్రామ పెద్ద రామాయణ్ ఉలగనాథన్ చెబుతుంటారు.

మొత్తానికి 2012లో విగ్రహం దొంగలు పట్టుబడడంతో వారి ద్వారా అశోకన్ అనే తమిళనాడు వ్యాపారి, అతడి ద్వారా అంతర్జాతీయ పురావస్తు అక్రమరవాణాలో పేరుమోసిన స్మగ్లర్ సుభాస్ చంద్ర కపూర్ పోలీసులకు పట్టుపడ్డారు. ప్రస్తుతం కపూర్ రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవలే స్థానిక మేజిస్ట్రేటు అతడి రిమాండును మార్చి 21 వరకు పొడిగించారు.

 ‘‘ఇప్పుడంటే గ్రామస్తులు శాంతించారు కానీ, గత రెండేళ్లగా మాకెంత నరకం చూపించారో, ఎంతగా అవమానించారో మాటల్లో చెప్పలేను. ఆ శివయ్యే మమ్మల్ని కాపాడాడు. దోషుల్ని బయటపెట్టి, మా నిర్దోషిత్వాన్ని గ్రామస్థులకు రుజువు చేశాడు’’ అని చెబుతూ కన్నీళ్ల పర్యంతం అవుతుంటారు పళనిసామి భార్య అముద. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఇంత విషం తాగి చనిపోదామనుకున్న రోజులు కూడా ఈ దంపతుల జీవితంలో ఉన్నాయి.
 
శ్రీపురంధలో ఇప్పుడు గ్రామస్థులంతా పళనిసామి కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అలా పలకరించడంలో పరిహారం ఏదో చేసుకుంటున్న భావన వారిలో వ్యక్తమవుతుంటుంది. ఊళ్లోకి మళ్లీ శివయ్య వచ్చేరోజు కోసం శ్రీపురంధ ఎదురుచూస్తూ ఉంది. ముఖ్యంగా పళనిసామి, ఆయన భార్య.
 
శివయ్య తిరిగి వస్తాడా? చెప్పలేం. నేషనల్ ఆర్ట్ గ్యాలరీలోని నటరాజ విగ్రహం, శ్రీపురంధ విగ్రహం ఒకటి కాదని గ్యాలరీ డెరైక్టర్ రాన్ రాఫోర్డ్ పేచీ పెడుతున్నారు. ‘‘లక్షల డాలర్లు పోసి ఓపెన్ మార్కెట్‌లో మేము ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాం’’ అని ఆయన అంటున్నారు.  ఏమైనా, నిజానిజాలు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా తమ ఊరికి శివయ్య వస్తాడని శ్రీపురంధ గ్రామస్థులు భావిస్తున్నారు.
 
దైవపీఠంపై శివయ్య లేకపోతే ఊరిలో మనుషులున్నా లేకున్నా ఒకటేనని ఇప్పుడా గ్రామం నమ్ముతోంది. అందుకే శివయ్య కోసం వారి కళ్లు కాయలు కాస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement