సీఐ వేధించాడని..!
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
మంచాల: గ్రామంలో తలెత్తిన చిన్న గొడవను పరిష్కరించుకుంటామన్నా వినకుండా స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ దూషించాడన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండలం లోని బండలేమూర్‌లో ఇరుగుపోరుగున ఉండే గొడ్డటి మల్లయ్య, ముచ్చర్ల శివయ్యల మధ్య ఇంటి స్థలం విషయంలో ఇటీవల ఓ చిన్నగొడవ జరిగింది. దీంతో శివయ్య, కుటుంబ సభ్యులపై ఈ నెల 19న మం చాల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను స్టేషన్‌కు తరలించారు.
గొడవను గ్రామంలో రాజీ చేసుకుంటామని శివయ్య కుటుంబీకులు సీఐను కోరారు. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు శివయ్య కుటుం బీకులను ఠాణాలోనే ఉంచి రాత్రి వదిలేయడంతో ఇంటికి వెళ్లారు. సీఐ తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన శివయ్య.. కుటుంబీకులు నిద్రించిన తర్వాత ఇంటి ఎదుట ఉన్న ఓ కట్టెకు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ దురుసుగా ప్రవర్తించడం తో శివయ్య మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడని మృతుడి భార్య, గ్రామస్తులు ఆరోపించారు. చిన్నగొడవ విషయంలో ఎలాంటి విచారణ జరపకుండా సీఐ వేధించారని మండిపడ్డారు. సీఐపై కేసు నమోదు చేయాలని మృతుడి కుటుంబీకులు, స్థానికులు ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణగౌడ్‌కు ఫిర్యా దు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.