
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ‘ఛలో గొట్టిపాడు’కు పిలుపునిచ్చిన సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలు ఉదయానికే ప్రత్తిపాడు చేరుకున్నారు. అప్పటికే బలగాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు వీరిని అడుగడుగునా అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు బలవంతంగా వ్యానులోకి ఈడ్చేశారు. విషయం తెలుసుకున్న పెదగొట్టిపాడులో దళిత మహిళలు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం విగ్రహాన్ని నీటితో శుద్ధి పరిచారు. తొలుత గ్రామం చుట్టూ పోలీసులు తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీ చేశాకే వాహనాలను గ్రామంలోకి అనుమతించారు.
గుంటూరు, ప్రత్తిపాడు: పెదగొట్టిపాడులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ నెల ఒకటిన గ్రామంలోని ఇరువర్గాలకు మధ్య ఘర్షణ జరగడం, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో చర్చలు జరిపి శాంతి కమిటీలు ఏర్పాటు చేయడంతో ఇరవై రోజులుగా గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఛలో గొట్టిపాడుతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమను పరామర్శించేందుకు వస్తున్న సీపీఐ, సీపీఎం, దళిత, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెదగొట్టిపాడు దళితవాడలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట మహిళలు బైఠాయించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి శుద్ధి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, అవతలి వర్గం నుంచి తమకు రక్షణ కల్పించాలి, ఘర్షణలో అసలైన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన డీఎస్పీ మూర్తి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎలాంటి అపోహలకు తావులేదని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. డీఎస్పీలు రమేష్‌కుమార్, ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తిల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అడుగడుగునా విస్తృత తనిఖీలు..
చలో గొట్టిపాడు నేపథ్యంలో పోలీసులు ప్రత్తిపాడు, గొట్టిపాడులకు వచ్చే అన్ని మార్గాలనూ జల్లెడ పట్టారు. మొత్తం తొమ్మిది చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన వచ్చే, పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డుల ఆధారంగా వారిని గ్రామాల్లోకి అనుమతించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారిని సైతం వదల్లేదు. గొట్టిపాడు వెళ్లేందుకు అవకాశం ఉన్న పొలాల గట్లపైనా పోలీసులు గస్తీ నిర్వహించారు. జిల్లా అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు ప్రత్తిపాడు, గొట్టిపాడు, ఉన్నవ, బోయపాలెం, జాతీయ రహదారిపై బందోబస్తును పర్యవేక్షించారు. అడిషనల్ ఎస్పీలు వైటీ నాయుడు, సుబ్బరాయుడులు పరిస్థితిని సమీక్షించారు.
ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు..
చలో గొట్టిపాడును నిర్వీర్యం చేసేందుకు అడుగడుగునా ముందస్తు అరెస్టులు చేశారు. ప్రత్తిపాడులో సీపీఐ మండల అధ్యక్షుడు రామిశెట్టి ఆదేశ్వరరావు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఆదినారాయణ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవలి సుబ్బారావు, సీపీఎం మాజీ ప్రత్తిపాడు కార్యదర్శి రాజుపాలెం కోటేశ్వరరావును ప్రత్తిపాడులో, వ్యవసాయకార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి కారుచోల రోశయ్యను తూర్పుపాలెంలో, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మన్ కొరివి వినయ్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు వైకె, శాంతకుమార్‌లను తిక్కిరెడ్డిపాలెంలో.. ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తిక్కిరెడ్డిపాలెం బ స్టాండు వద్ద, స్పందన సూ ్టడియో ఎదుట, పాతమల్లాయపాలెం కూడలిల్లో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ ల నాయకులు రోడ్లపై బైఠాయించి తమ నిరసనలను తెలిపేందుకు ప్రయత్నించా రు. వీరి కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు.
నేతల అరెస్టులు
పట్నంబజారుః చలో గొట్టిపాడుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వామపక్షాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. సీపీఎం, సీపీఐ, దళిత, ప్రజా సంఘాల నేతలను అరెస్టులు చేసి గుంటూరు నగరంతో పాటు రూరల్ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను ప్రత్తిపాడులో అరెస్టు చేసి ముందుగా పట్టాభిపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి తిరిగి నగరంపాలెం పోలీసుస్టేషన్ పంపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి పాశం రామారావులతో పాటు మరికొంత మంది నేతలను నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, బలహీనవర్గాల జే ఏసీ నేత వైవీ సురేష్‌తో పాటు విజయవాడ నుంచి వచ్చిన దళిత సంఘాల నేతలను పాతగుంటూరు పోలీసుస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని నగరంపాలెం, పట్టాభిపురం, అరండల్‌పేట, పాతగుంటూరు, లాలాపేట పోలీసుస్టేషన్‌లో పాటు వామపక్షాల అనుబంధ విభాగాల నేతలు పలువురిని సీసీఎస్‌కు తరలించారు. ఆయా ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల నేతలను సాయంత్రం వరకు స్టేషన్‌లలోనే ఉంచారు. 100 మంది వరకు ఆయా స్టేషన్‌లోనే ఉంచి, సొంతత పూచీకత్తులపై విడిచి పెట్టారు.
అగ్రకులాల కొమ్ము కాస్తున్న ప్రభుత్వం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కొరిటెపాడు(గుంటూరు):రాష్ట్ర ప్రభుత్వం అగ్రకులాలకు కొమ్ముకాస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గొట్టిపాడులో దళితులపై దాడి చేసినా ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండటం దారుణమన్నారు. కేసులను నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందని ద్వజమెత్తారు. ఒకవైపు దళితులపై దాడులు చేయిస్తూనే మరో వైపు ఈ నెల 26 నుంచి దళిత తేజం పేరిట కార్యక్రమాలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేయడం బాధాకరమన్నారు. గొట్టిపాడులో దళితులను పరామర్శించడానికి వెళుతున్న తమను ఎందుకు పోలీసులు అడ్డుకున్నారో తెలియడం లేదన్నారు. దళితులను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులకు అన్యాయం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment