పాల్వంచ (ఖమ్మం) : ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు మీ అత్తగారు బీరువా తాళాలు ఇవ్వమంటున్నారని చెప్పగా.. ఎందుకివ్వాలని ప్రశ్నించిన మహిళను కత్తితో బెదిరించి.. బీరువా తాళాలు తీసుకుని ఇంట్లో ఉన్న రూ. 2.50 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఏ కాలనీ క్వార్టర్ నెంబర్ 31లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గోపాలకృష్ణ కేటీపీఎస్‌లో ఉద్యోగి. ఆయన సోమవారం ఉద్యోగానికి వెళ్లిన సమయంలో భార్య మౌనిక ఇంట్లో ఒంటరిగా ఉంది.
మధ్యాహ్నం సమయంలో పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు మీ అత్తగారు బీరువా తాళాలు ఇవ్వమంటున్నారని అడిగారు. దీనికి ఆమె తనకు అత్తగారు లేదని అంటుండగానే ఇద్దరిలో ఒక యువకుడు ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచి తాళాలు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో భయపడిన గృహిణి తాళాలు ఇవ్వడంతో.. ఇంట్లో ఉన్న రూ. 2.50 లక్షలు దోచుకుని పరారయ్యారు. కాగా.. అప్పు తీర్చడానికి తెచ్చిన డబ్బులు ఇంట్లో ఉన్నాయని తెలిసిన వాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కత్తితో బెదిరించి దోపిడీ..
Published Mon, Dec 28 2015 3:18 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement