సిల్క్ రూట్‌లో సాహసి | Adventurous tour taken up in Silk route | Sakshi
Sakshi News home page

సిల్క్ రూట్‌లో సాహసి

Published Tue, Aug 27 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

సిల్క్ రూట్‌లో సాహసి

సిల్క్ రూట్‌లో సాహసి

సాక్షి, సిటీబ్యూరో: మూడు దేశాలు... పదిహేనువేల కిలోమీటర్లు... యాభై ఐదు రోజుల సుదీర్ఘమైన ప్రయాణం. ఆ దేశాల భాషతో పెద్దగా పరిచయం లేదు. తెలిసిన బంధువులు, స్నేహితులు లేరు. జ్ఞానీ లోక సంచారి అన్నట్లు... అరవై రెండేళ్ల వయస్సులో ఒంటరిగా సాహసోపేతమైన యాత్ర పూర్తి చేశారు పరవస్తు లోకేశ్వర్. ‘సలామ్ హైదరాబాద్’ నవల, చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర ద్వారా సుపరిచితులైన పరవస్తు లోకేశ్వర్ తన 62 ఏళ్ల వయస్సులో ఉజ్బెకిస్తాన్, కిరిగిస్తాన్, చైనా దేశాల ను కలిపి 15 వేల కిలోమీటర్ల సిల్క్‌రోడ్డుపై సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్యటన అనుభవాలపై ఆయన రాసిన ‘సిల్క్ రూట్‌లో సాహసయాత్ర’ పుస్తకం మంగళవారం ఆవిష్కరించనున్నారు. గత సంవత్సరం  సెప్టెంబర్  ఒకటో తారీఖు నుంచి 55 రోజుల పాటు సాగిన పర్యటన విశేషాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సంగతులు ఆయన మాటల్లోనే...

రాహుల్ స్ఫూర్తి...


ఎంతోమంది యాత్రికులు ప్రపంచదేశాల్లో పర్యటించారు. వారి అనుభవాలను గ్రంధస్తం చేశారు. ఆ అనుభవాలే  నాగరికతా పరిణామాన్ని, వికాసాన్ని అధ్యయనం చేసేందుకు, అర్థం చేసుకొనేందుకు దోహదం చేశాయి. చిన్నప్పటి నుంచి రాహుల్ సాంకత్యాయన్ అంటే ఎంతో ఇష్టం. ఆయనలాగా పర్యటించాలని కోరిక. తిరగడం వల్లనే జ్ఞానం లభిస్తుందని నా విశ్వాసం. గతంలో 3 వేల కిలోమీటర్ల చత్తీస్‌గఢ్ యాత్రను 15 రోజుల్లో పూర్తి చేశా. బస్తర్‌లో పర్యటించా. అలాగే ప్రపంచానికి వైభవోపేతమైన నాగరికతను పరిచయం చేసిన మధ్య ఆసియా దేశాల్లో పర్యటించాలనే కోరిక కలిగింది.

క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో చైనా నుంచి రోమ్‌కు సిల్క్‌తో పాటు, పింగాణి, పేపర్, మందుగుండు వంటి వస్తువులను ఎగుమతి చేసిన రోడ్డు మార్గానికి సిల్క్‌రూట్ అనే పేరు స్థిరపడింది. ఆ రూట్‌లో ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, చైనాల్లో పర్యటించా. గతేడాది సెప్టెంబర్ 1న ఢిల్లీ నుంచి బయలుదేరి  2న తాష్కెంట్ చేరుకున్నా. అక్కడి నుంచి  రోడ్డు, రైలు మార్గంలో 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం భుకారా, సమర్ఖండ్ మీదుగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వెళ్లా. అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని 25 రోజులు బస చేశా. మధ్య ఆసియాలోని స్విట్జర్లాండ్‌గా పేరు గడించిన కిర్గిస్తాన్ ఎంతో అందమైన దేశం.
 
 లాంగ్‌మార్చ్ జ్ఞాపకాలు...


 కిర్గిస్తాన్ నుంచి చైనాకు రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. కానీ సరిహద్దులో చైనా సైన్యం నన్ను అడ్డుకుంది. నన్ను గూఢచారిగా అనుమానించి అనుమతి నిరాకరించారు. దాంతో విమానంలో బీజింగ్ చేరుకున్నా. భారత్‌లాగే 4 వేల ఏళ్లకు పైగా గొప్ప చరిత్ర ఉన్న చైనాపై అధ్యయనం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎనాన్‌లోని మావో జెడాంగ్, ఆయన సహచరుల స్థావరాలు, వారు వినియోగించిన  వస్తువులు, టేబుళ్లు, కుర్చీలు,పుస్తకాలు, వంటపాత్రలు, విప్లవకారుల నిరాడంబరమైన జీవిత విధానాన్ని ప్రతింబింబించే అనేక అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. లాంగ్‌మార్చ్ విశేషాలను చెప్పే రెవల్యూషనరీ మ్యూజియంను సందర్శించా. ప్రాచీన బౌద్ధమత క్షేత్రాలు, మైనార్టీ తెగలు నివసించే కుచె, ఉరిమించి, షియాన్, కోటాన్, యార్ఖండ్, లీషాన్ వంటి ప్రాంతాలు పర్యటించాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement