టోలీ చౌకీలో బాంబు ఫ్యాక్టరీ | bomb factory in tolichowk | Sakshi
Sakshi News home page

టోలీ చౌకీలో బాంబు ఫ్యాక్టరీ

Published Wed, Mar 2 2016 3:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

టోలీ చౌకీలో బాంబు ఫ్యాక్టరీ

టోలీ చౌకీలో బాంబు ఫ్యాక్టరీ

 తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన నఫీస్‌ఖాన్
 బాంబ్స్ తయారీకి ‘స్థానిక పదార్థాలు’ వినియోగం
 డిటోనేటర్ లభించక ఆగిన ‘ఆపరేషన్’
 కోర్టుకు నివేదించిన ఎన్‌ఐఏ అధికారులు

 
 నగరానికి ఉగ్రవాద సంస్థ జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ రూపంలో ముంచుకొచ్చిన భారీ ముప్పు తృటిలో తప్పిందా..? ఔననే అంటున్నారు దర్యాప్తు అధికారులు. ఈ మాడ్యుల్‌కు ఫైనాన్స్ చీఫ్‌గా వ్యవహరించిన నగర వాసి నఫీజ్ ఖాన్ తన ఇంట్లోనే నాలుగు బాంబుల్ని తయారు చేశాడు. వీటిని పేల్చడానికి అవసరమైన డిటోనేటర్ ‘అందకపోవడంతో’ అలానే దాచి ఉంచాడు. జనవరిలో నఫీజ్‌ను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అతడి ఇంటి నుంచి నాలుగు బకెట్ బాంబుల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ వివరాలు దర్యాప్తు అధికారులు ఢిల్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.       -సాక్షి, సిటీబ్యూరో
 
 అబు జరార్ పేరుతో చెలామణి...
 
 రంగారెడ్డి జిల్లా గండీడ్ సమీపంలోని నాన్చెర్ల ప్రాంతానికి చెందిన నఫీజ్ ఖాన్ టోలిచౌకిలోని ఎండీ లైన్స్‌లో ఉన్న అమీన్ కాలనీలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం సిరియా కేంద్రంగా ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్‌తో ఏర్పడిన ఆన్‌లైన్ పరిచయం నేపథ్యంలోనే ‘జునూద్’లో చేరాడు. ఈ సంస్థకు ముంబైలో పట్టుబడిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్ చీఫ్‌గా, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన రిజ్వాన్ అలీ డిప్యూటీ చీఫ్‌గా, కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నజ్మల్ హుడా మిలటరీ కమాండర్‌గా వ్యవహరించగా... అబు జరార్ పేరుతో నఫీజ్ ఖాన్ ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా పని చేశాడు. ‘జునూద్’లోకి రిక్రూట్‌మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్ష ణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముదబ్బీర్‌కు రూ.8 లక్షల హవాలా రూపంలో అందాయని, వీటి నుంచి రూ.2 లక్షల్ని హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఈ మాడ్యుల్ హైదరాబాద్‌తో పాటు లక్నో, సహరంగ్‌పూర్, టమ్కూర్‌లో పలుమార్లు సమావేశమైంది. క్యాడర్‌కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థా ల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాాలు ఏర్పాటు చేసింది. వీటన్నింటిలోనూ నఫీజ్ ఖాన్ చురుకుగా పాల్గొన్నాడు.
 
 ‘ఇంపోర్ట్’ టు ‘లోకల్’...
 
 పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కరులు దేశంలో జరిపిన బాంబు పేలుళ్లకు ఎక్కువగా ఆర్డీఎన్స్ పేలుడు పదార్థాన్ని వినియోగించేవారు. ఇది నేరుగా పాకిస్థాన్ నుంచే సరఫరా అయ్యేది. ఇది ముప్పని భావించిన ఆ దేశం దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దగ్గరకు వచ్చేసరికి పేలుడు పదార్థాలను స్థానికంగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఈ మాడ్యుల్ ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించారు. సిటీలో జరిగిన 2007, 2013 జంట పేలుళ్లలో ఐఎం ఉగ్రవాదులు దీన్నే వాడారు. ‘జునూద్’ సంస్థ పేలుడు పదార్థాల సమీకరణలో మరో అడుగు ముందుకేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తే నిఘాకు చిక్కే ప్రమాదం ఉందనే అనుమానంతో సాధారణ ‘వస్తువు’లపై దృష్టిపెట్టింది.
 
 ప్లాస్టిక్ బక్కెట్లు... యూరియా... పాస్ఫరస్....
 
 ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా సాధారణ పదార్థాలనే పేలుడు పదార్థాలుగా వినియోగించే అంశంపై నఫీజ్ ఖాన్, ముదబ్బీర్‌లు సుదీర్ఘ అధ్యయనమే చేశారు. యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్పరస్‌లను వినియోగించి బక్కెట్లను షెల్స్‌గా వాడి, నట్లు, బోల్డుల్ని స్ల్పింటర్స్‌గా మారుస్తూ బాంబుల తయారీ ఎంచుకున్నారు. అగ్గిపుల్లలకు తలగా ఉండేదీ పాస్ఫరస్ కావడంతో పాటు దీపావళి టపాసుల తయారీకి వినియోగించే ఇవి మార్కెట్‌లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నారు. నగరాన్ని టార్గెట్‌గా చేసుకున్న నఫీజ్ ఖాన్ నాలుగు ప్లాస్టిక్ బకెట్లతో పాటు పేలుడు పదార్థం, ఇతర సామగ్రిని తన ఇంట్లోనే సిద్ధం చేసుకున్నాడు. అయితే బాంబును పేల్చడానికి అవసరమైన డిటోనేటర్ లభించకపోవడంతో ‘తయారీ’కి తాత్కాలిక విరామం ఇచ్చాడు. ఈలోపు దేశ వ్యాప్తంగా జరిగిన అరెస్టుల్లో నగరానికి చెందిన మరో ముగ్గురితో పాటు నఫీజ్ అరెస్టు కావడంతో కుట్రకు బ్రేక్ పడింది. అమీన్ కాలనీలో ఉన్న ఇతడి ఇంటి నుంచి ఎన్‌ఐఏ అధికారులు నాలుగు ‘బక్కెట్ల’ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement