ప్రహరీ కూల్చివేత.. అడ్డుకున్న ఎమ్మెల్యే!
ప్రహరీ కూల్చివేత.. అడ్డుకున్న ఎమ్మెల్యే!
Published Tue, Jul 4 2017 2:11 AM | Last Updated on Wed, Apr 3 2019 8:28 PM
- రోడ్డుకు అడ్డంగా ఉండటంతో పడగొట్టిన జీహెచ్‌ఎంసీ
- అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే కౌసర్... ఉద్రిక్తత
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘటన
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం.3లో రోడ్డుకు అడ్డుగా నిర్మించిన ప్రహరీ కూల్చివేత... ఎమ్మెల్యే జోక్యంతో ఉద్రిక్తంగా మారింది. సోమవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్-10(బి) టౌన్‌ప్లానింగ్ ఏసీపీ జగన్మోహన్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది గోడను పడగొడుతుండగా... కార్వాన్ ఎమ్మె ల్యే కౌసర్, మాజీ మేయర్ మాజిద్‌హుసేన్ అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. ఇది పబ్లిక్ రోడ్డు కాదని, అలాంటప్పుడు ప్రహరీని ఎలా కూలుస్తారంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. అక్కడున్న కొందరు ఆయనకు మద్దతు పలికారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు వాదోపవాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి, పనులు నిలిచిపోయాయి. చివరకు జీహెచ్‌ఎంసీ అధికారులు... భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి గోడను నేలమట్టం చేశారు.
పబ్లిక్ రోడ్డు.. అందుకే కూల్చేశాం: ఏసీపీ జగన్మోహన్‌రావు
ఇది పబ్లిక్ రోడ్డని, ముందుగా నోటీసులు ఇచ్చిన తరువాతనే ప్రహరీ కూల్చామని ఏసీపీ జగన్మోహన్‌రావు తెలిపారు. గతంలో గ్రూప్ హౌసింగ్ కింద ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ కట్టబోమనే షరతుతో అనుమతి తీసుకు న్నారని, అనంతరం ఎవరికి వారే వ్యక్తిగత నివాసాలకు ప్రహరీ నిర్మించుకున్నారని చెప్పారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. వెనుక ఉన్న స్థలం యజమాని ఇంటి అనుమతి ప్లాన్‌లో ఇది అప్రోచ్‌రోడ్‌గా ఉన్నందున, ఈ ప్రహరీని కూల్చివేసి అప్రోచ్ రోడ్డు వసతి కల్పించామని తెలిపారు.
మా ఇంటికి దారి చూపించాలి కదా..
2010లో బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ృ3లో ఆరు వేల గజాల స్థలాన్ని నా భార్య ఝాన్సీ పేరిట కొన్నాం. అప్పటి సేల్ డీడ్‌లోనూ ఇది పబ్లిక్ రోడ్డనే ఉంది. 2012లో ఇంటి నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నాం. వారు కూడా దీన్ని పబ్లిక్ రోడ్డుగానే నిర్ధారించారు. కాలనీవాసులను గోడ తియ్యమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో జీహెచ్‌ఎంసీని సంప్రదించాం. ఇటీవల అక్కడ విల్లాలు కూడా కట్టడంతో మాకు దారి లేకుండా పోయి ఇంటి నిర్మాణం ఆగిపోయింది.
- పొట్లూరి వరప్రసాద్ (సినీ నిర్మాత, పీవీపీ వెంచర్స్ అధినేత), లోపలున్న స్థల యజమాని
స్థలం కొన్నప్పుడే ఆ గోడ ఉంది...
1984ృ85లో ఐదుగురం కలిసి 7,200 గజాల స్థలాన్ని కొన్నాం. అప్పుడే ఈ గోడ ఉంది. గ్రూప్ హౌసింగ్ కింద 1987లో జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశాం. 30 ఫీట్ల ఇంటర్నల్ ప్రైవేట్ రోడ్డు అని చూపించి అనుమతులు తీసుకున్నాం. పర్మిషన్ కాపీలో కూడా ఈ గోడ ఉంది. గ్రూప్ హౌసింగ్ కింద అనుమతులు తీసుకున్నాక.. 1994ృ95లో జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసులో రివైజ్డ్ ప్లాన్ దరఖాస్తు చేసిన మాట నిజమే. కానీ రివైజ్డ్ ప్లాన్‌లో కాలనీ రోడ్డు ఉందని ప్రస్తావించాం తప్ప, దాన్ని పబ్లిక్ రోడ్డుగా చూపించలేదు.
- బెజవాడ కృష్ణారెడ్డి, సునీల్ చంద్రారెడ్డి, కాలనీలోని స్థల యజమానులు
Advertisement
Advertisement