మాట్లాడుతున్న అభినవ్ మహేందర్
హైదరాబాద్(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ఇష్టంలేని భూవన తండ్రి కె. మహేంద్రనాధ్ రెడ్డి తమను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు సాయి కిరణ్ తనను బెదిరించి ఈ నెల 24న భువన కల్వాను తన తల్లిదండ్రుల వద్దకు పంపేలా చే సినట్లు తెలిపారు. అప్పటి నుంచి తన భార్య కనిపించడం లేదన్నాడు. భువనను కలిసేందుకు ప్రయత్నించగా ఈ నెల 26న సాయికిరణ్ అతని స్నేహితులు వెంకట్, మరో వ్యక్తి తనను కొట్టడమేగాక తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఫొటోలు, లెటర్లు లాక్కున్నట్లు తెలిపాడు, వల్లబ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
అభినవ్‌పై కేసు...
తన కుమార్తెను అభినవ్ అనే యువకుడు దొంగచాటుగా వివాహం చేసుకోవడంతోపాటు, తన ఇంటికి వచ్చి కత్తితో బెదిరించి గాయపరిచాడని మారేడుపల్లికి చెందిన వ్యాపారవేత్త తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లాకు చెందిన కే.మహేంద్రనాథ్‌రెడ్డి అనే వ్యాపారవేత్త మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు మహేందర్‌రెడ్డి రెండో కుమార్తెను ప్రేమ పేరుతో నమ్మించి దొంగచాటుగా వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత అతని వేధింపులు తాళలేక ఆమె పుట్టింటికి చేరింది. ఈనెల 26వ తేదీ రాత్రి అభినవ్ మద్యం మత్తులో తమ ఇంటికి వచ్చి కత్తి చూపించి హత్య చేస్తానని బెదిరించాడని, ఈ ఘర్షనలో తనకు గాయాలయ్యాయని రవీంద్రనాథ్‌రెడ్డి అదే రాత్రి తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాణభయంతో కడప జిల్లాకు వెళ్లిపోయాడు. శనివారం అతను పోలీసులను కలిసి పరిస్థితి వివరించడంతో పోలీసులు అభినవ్‌పై ఐపీసీ 324, 506 సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.