దేశంలో ఆధునిక విమానాశ్రయాలు
నవీ ముంబై, భోగాపురంలో ఏర్పాటు: అశోక్ గజపతిరాజు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నాలుగు ఆధునిక విమానాశ్రయలను నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు చెప్పారు. ఈ విమానాశ్రయాల్లో రెండు ర న్‌వేలు ఉంటాయని, ఒక్కో రన్ వే పొడవు నాలుగు కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. ఈ రెండు రన్‌వేల మధ్య ఒకటిన్నర కిలోమీటరు ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, నవీ ముంబైలో మరో విమానాశ్రయం ఈ పద్ధతిలో నిర్మిస్తామన్నారు. మరో రెండు విమానాశ్రయాలను ఇలా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జాయింట్ వెంచర్ విధానంలో వీటిని నిర్మిస్తామని, ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.13వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. శంషాబాద్‌లో ప్రస్తుతమున్న రన్‌వేకు సమాంతరంగా మరో రన్‌వే నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై రైట్స్ సంస్థ సర్వే చేస్తోందని, నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో 30కి పైగా చిన్న విమానాశ్రయాలున్నాయని... వీటి నుంచి విమానాలు నడిపేందుకు విమానయాన సంస్థలు నష్టాల పేరుతో వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో ఆ నష్టాన్ని కేంద్రం 80 శాతం, రాష్ట్రాలు 20 శాతం భరించేలా పథకాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.