
సంగీత దర్శకుడు శ్రీ కన్నుమూత
హైదరాబాద్: సంగీత దర్శకుడు శ్రీ ఈ సాయంత్రం కొండాపూర్లోని స్వగృహంలో కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తి కుమారుడైన శ్రీ అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన శ్రీ గత కొద్ది కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ పోలీస్ బ్రదర్స్, గాయం, సింధూరం, అనగనగా ఒక రోజు, ఆడుమగాడ్రా బుజ్జీ, అమ్మోరు, మనీ, నీకే మనసిచ్చా, ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, కాశీ, సాహసం తదితర 20 చిత్రాలకు సంగీతం అందించారు.
రామ్ గోపాల్ వర్మ, కృష్ణ వంశీలతో ఆయన ఎక్కువ చిత్రాలకు పని చేశారు. శ్రీ కేవలం సంగీత దర్శకుడే కాదు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. 2005లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందిన చక్రం చిత్రంలోని 'జగమంత కుటుంబం' పాటను ఆయనే పాడారు. ఆయన స్వరాలు అందించిన చివరి చిత్రం 'అప్పూ..ది క్రేజీ బోయ్' ఇది బాలల చిత్రం. ఇది విడుదల కావలసి ఉంది. శ్రీకి భార్య అరుణ, కుమారుడు రాజేష్ చక్రవర్తి ఉన్నారు.