పాటతత్వం
పాటంటే పెదాలపై ఆడేది మాత్రమే కాదు.
చెప్పాలంటే... అదొక దారి దీపం.
పాటలో ప్రతి పదం జీవనపథానికి దారి చూపే వెలుగు రేఖ అవుతుంది. ఈ వాస్తవాన్ని నేను స్వయంగా తెలుసుకున్నాను.
ఒకరోజు సంగీత దర్శకుడు శ్రీ నాతో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిలా మంచి పదాలు, వాక్యాలతో అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేలా ఒక పాట రాయమని చెప్పారు. ఈ మాట వినగానే ‘నేనేంటి.. ఆయనలాగా పాట రాయడమేంటి?’ అని నన్ను నేనే ప్రశ్నించుకుని, నా వల్ల కాదంటూ వెళ్లిపోయాను.
అంటే...యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించాను!
అప్పుడు శ్రీ నా దగ్గరకు వచ్చి సిరివెన్నెల ‘పట్టుదల’ సినిమాలో రాసిన...
‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి...
విశ్రమించవద్దు ఏ క్షణం..
విస్మరించవద్దు నిర్ణయం...
అప్పుడే నీ జయం నిశ్చయమ్మురా’ పాట వినిపించారు.
‘ప్రయత్నమన్నది చేయాలి... చేయకుంటే నీ ఓటమిని నువ్వే ఒప్పుకున్నట్లు’ అని చెప్పారు శ్రీ.
ఈ పాట మళ్లీ మళ్లీ విన్నా.
ఎక్కడికో దూరంగా వెళ్లిపోయిన ధైర్యం నాకు చాలా దగ్గరగా వచ్చింది. నాకు కొత్త శక్తిని ఇచ్చింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
‘త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా’ అని నాలో నేను పాడుకున్నాను. నన్ను నేనే పదాలతో ఉత్తేజపరుచుకున్నాను.
ఈ పాట ఇచ్చిన స్ఫూర్తితో, ధైర్యంతో ‘కోయిలమ్మ’ ఆల్బమ్‌లో మొత్త పాటలన్నీ నేనే రాశాను.
‘‘చాలా బాగా రాశావు’’ అని శ్రీ మెచ్చుకున్నారు.
‘నేను చేయలేనేమో’ అనుకున్నప్పుడల్లా నిరాశ ముందుకు వచ్చి ‘నీలో ఉన్నదంతా ఆశక్తతే’ అని ఢంకా బజాయించి చెబుతుంది. నిజమే...అనుకుంటే అది శిలాశాసనమై పోతుంది. మనలోని బలాలన్నీ ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి బలహీనతలే కళ్ల ముందు కదలాడుతాయి.
‘అసలు నేను ఎంతటి వాడిని? నా దగ్గర ఏముంది?’ అనే అంతర్మథనం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక్కసారి...
‘వేగముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా...
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
దీక్ష కన్నా సారథెవరురా...
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా’
‘నా దగ్గర ఏముంది? నాకు అండగా ఎవరు ఉన్నారు?’ అనుకునే వాళ్లకు ఈ చరణాలే సమాధానం చెబుతాయి. సాధించాలనే తపన, పట్టుదల ఉంటే శరీరమే శతకోటి సైనికుల బలమవుతుంది! శ్వాస శస్త్రమైనట్లు! ఆశకు దగ్గరైతేనే కదా నిరాశ అనేది పారిపోయేది. నిరాశ చెందడం విశేషం కాదు...నిరాశనే నిరాశ చెందేలా చేయడమే విశేషం. దీనికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కర్లేదు.
అంత కంటే గొప్ప శక్తి... నెత్తురులో సత్తువ. ఆశ అనే అస్త్రం.
ప్రతి దాన్ని పోల్చి చూసుకోవడం, ఫలితాల గురించి అతిగా ఆలోచించడం అనేది పైకి ‘విశ్లేషణ’లా కనిపించినా...ఒక విధంగా చెప్పాలంటే...ఇది నిరాశను నింపుతుంది. పిడికిలి బిగించి ముందుకు కదలడం కంటే, తేలిగ్గా చేతులెత్తేయడం క్షేమం అనిపిస్తుంది.
ఆకాశం అంత పెద్దదని గువ్వ పిల్ల ఎగరకుండా ఉంటుందా? అంత పెద్ద ఆకాశమైనా దాని రెక్క ముందు తక్కువే కదా! ఎంత పెద్ద సముద్రమైనా ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదే కదా!!
అందుకే... ‘పిడుగు వంటి పిడికిలెత్తి.... ఉరుము వలె హుంకరిస్తే
దిక్కులన్నీ పిక్కటిల్లురా...ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి...అవధులన్నీ అధిగమించరా’
‘ప్రతి మనిషిలో దృక్పథాలుంటాయి. అయితే, వాటిలో తేడాలుంటాయంతే.. మనుషులందరిలో ఉండే ముఖ్యమైన దృక్పథాల్లో ఆశావహ దృక్పథం చాలా ముఖ్యమైంది. ఇది లేనివారంటూ ఉండరు. ఇది ఉండాలి కూడా. జీవితం అనేది ప్రతిక్షణం పోరాటమే’ అంటారు సిరివెన్నెల సీతారామశాస్త్రి్త్ర. ఆయన చెప్పిన భావం అక్షరాల ఈ పాటలో కనిపిస్తుంది.
ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఎప్పుడైనా ‘నేను ఓడిపోతున్నాను’ అనిపించినప్పుడల్లా నాకు ఈ పాట గుర్తుకొస్తుంది. దాంతో మళ్లీ కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ... నాకు ఆ పాటే ప్రేరణ.
సంభాషణ: డేరంగుల జగన్‌మోహన్
- వసంత్, సంగీత దర్శకుడు
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి!
Published Sat, Sep 24 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement
Advertisement