తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై పిటిషనర్‌కు స్పష్టం చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంను పోలీసులు పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపారన్న పౌర హక్కుల సంఘం ఆరోపణలను ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక సమర్థించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం పూర్తిస్థాయి విచారణ జరుపుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలది బూటకపు ఎన్‌కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబ ర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.
శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిలకు స్థానిక వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపి, నివేదికను హైకోర్టు కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిమ్స్ వైద్యుల నివేదిక సోమవారం ధర్మాసనానికి అందింది. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, పిటిషనర్ ఆరోపణలను సమర్ధించే విధంగా నివేదిక లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసుల గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించింది.
ఆరోపణలను ఎయిమ్స్ నివేదిక సమర్థించడం లేదు
Published Tue, Jun 21 2016 8:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement