
దేవుని భూములూ వదలవా బాబూ..
‘సదావర్తి’ భూముల వేలం రద్దు చేయాలని సి.రామచంద్రయ్య డిమాండ్
సాక్షి, హైదరాబాద్ : ‘రాజధాని పేరిట రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. కనీసం దేవుని భూములను కూడా వదలరా.. సదావర్తి భూముల వేలం వెంటనే రద్దు చేయాల’ని శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇందిర భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వ పెద్దలు కేవలం రూ. 23 కోట్లకు దక్కించుకున్నారన్నారు.
ఇందులో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ది ప్రధాన హస్తమన్నారు. సదావర్తి సత్రం భూముల పరిసర ప్రాంతాల్లో 200 గజాల స్థలంలో కట్టిన ఒక్కో విల్లా రూ.2 కోట్లు ఉందంటే 83.11 ఎకరాల భూముల విలువ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రామచంద్రయ్య అన్నారు. భూములను వేలం వేయాలంటే ముందుగా దేవాదాయశాఖ కమిషనర్ ఆ స్థలాన్ని పరిశీలించి ధర నిర్ణయించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగలేదన్నారు. వేలం పాట వ్యవహారాన్ని రద్దు చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత జరుగుతున్నా ఆ శాఖ మంత్రి మాణిక్యాలరావు నోరు తెరవకపోవడం శోచనీయం అన్నారు.