
తెలుగులో మాట్లాడినందుకు వాతలు
సుమోటోగా విచారణ చేపట్టిన బాలల హక్కుల కమిషన్
హైదరాబాద్: పాఠశాలలో తెలుగు మాట్లాడిన పాపానికి ఓ ఉపాధ్యాయురాలు 42 మంది చిన్నారులను దండించింది. ఈ ఘటన ఎర్రగడ్డ డాన్‌బాస్కో స్కూల్‌లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం 5వ తరగతి విద్యార్థులు తరగతి గదిలో తెలుగు మాట్లాడంతో ఉపాధ్యాయురాలు తనూజ తీవ్రంగా దండించింది. స్కేల్‌తో కొట్టడడంతో పిల్లల చేతులపై వాతలు తేలాయి. పిల్లలను ఇంటికి తీసుకువెళ్లడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని ఉపాధ్యాయురాలిపై అగ్రహం వ్యక్తం చేయడమేకాక ఆందోళనకు దిగారు.
పాఠశాల ప్రిన్సిపాల్ జేమ్స్‌ను వివరణ కోరగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలుగువారు తెలుగుమాట్లాడం జన్మహక్కని, ఉపాధ్యాయురాలి తీరును ఖండిస్తున్నామని బాలల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా కేసు విచారణను చేపట్టింది. జూలై 21వ తేదీలోగా సంఘటనపై పూర్తి నివేదిక అందించాలని అధికారులతో పాటు పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.