
పిడిగుద్దులే ప్రాణం తీశాయి
సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థి సిద్ధిఖి మరణంపై పోస్టుమార్టం రిపోర్టు
హైదరాబాద్ : నగరంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఇరువురు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో మృతిచెందిన ఆబేర్ సిద్ధిఖి మరణానికి బలమైన పిడిగుద్దులు తగలడంతో పాటు , చెవిభాగంలోని నరాలు చిట్లడమే కారణమని వైద్యులు తమ పోస్టు మార్టం నివేదికలో వెల్లడించారు. ఈ మరణానికి కారకుడైన ఎ.సిరిల్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించారు. ఈ విద్యార్థుల మధ్య మంగళవారం ఘర్షణ జరిగి అందులో మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ఆబేర్ సిద్ధిఖి (14) తీవ్రంగా గాయపడి బుధవారం మృతిచెందిన సంగతి విదితమే. ఘర్షణ సమయంలో సిరిల్..సిద్ధిఖీ మెడపై బలంగా పిడిగుద్దులు కొట్టడంతో కుడిచెవి కిందిభాగంలో బలంగా తగిలి నరాలు చిట్లిపోయి మృతి చెందినట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు, ఇతర వైద్యనిపుణులు ధ్రువీకరించారు. అతని మరణానికి కారకుడైన సిరిల్‌ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చారు. కోర్టు అతన్ని జువైనల్ హోమ్‌కు తరలించమని ఆదేశించింది.
తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడే
పిల్లలు ‘ఇమాజినేషన్ సిండ్రోమ్’ కారణంగా విన్నదానికంటే కన్పించిన దాన్ని ఎక్కువగా అనుకరిస్తుంటారని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. టీనేజ్‌లో వచ్చే హార్మోన్స్ కూడా ఇందుకు దోహదం చేస్తాయన్నారు. రియాల్టిషోలు, వీడియో గేమ్స్‌లో చూసిన అంశాలను వారు అనుకరించి, ఆచరించాలనే తపనతో ఉంటారన్నారు.ఇవే విద్యార్థుల మధ్య వివాదాలకు కారణాలు కావచ్చన్నారు. ఇందుకు తల్లిదండ్రులు తమ పిల్లలపై తరచూ ప్రేమ పూర్వక పర్యవేక్షణ వహిస్తూ వారిలోని మార్పులు గమనించి సరిదిద్దాలన్నారు.