సెక్షన్ 26పై స్పష్టత ఇవ్వండి
లోక్‌సభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల పెంపుపై పొందుపరిచిన సెక్షన్ 26పై స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో ఆయన జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం ప్రతి రాష్ట్రం లోని శాసనసభ స్థానాలను 2026 తరువాత జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చే వరకు పెంచడం కుదరదు. కానీ ఏపీలో అధికార పార్టీ 2019 ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 వరకు పెరుగుతాయని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంటోంది. అందువల్ల అసలు సెక్షన్ 26 ఏం చెబుతోంది? 2019 ఎన్నికల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సీట్ల పెంపు చేపడుతుందా? తదితర అంశాలపై స్పష్టత ఇవ్వండి’ అని కోరారు.