లండన్లో 20 మంది సిక్కులు అరెస్ట్
లండన్ : లండన్లో భారతీయ రాయబార కార్యాలయం ఎదుట సిక్కులు చేపట్టిన శాంతియుత ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారి... ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ పోలీస్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో 20 మంది సిక్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... పంజాబ్లో తమవారి పట్ల స్థానిక పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... లండన్లోని 'సిక్కు లివ్స్ మేటర్' సంస్థకు చెందిన వందలాది మంది సిక్కులు గురువారం భారతీయ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
దీంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని... ఆందోళన విరమించాలని పోలీసులు వారికి సూచించారు. ఆ క్రమంలో సిక్కులకు... పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. దాంతో పోలీసులపై సిక్కులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అగ్రహించిన పోలీసులు 20 మంది సిక్కులను అరెస్ట్ చేశారు.
సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించారంటూ పంజాబ్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా పంజాబ్లోని పలు పట్టణాల్లో ఆందోళనకారులు తమ నిరసస తెలుపుతున్నారు. ఆ క్రమంలో రోడ్లను దిగ్బంధనం చేస్తున్నారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వైఖరిపై లండన్లోని సిక్కులు ఆందోళనకు దిగారు.