Indian Embassy in UK
-
అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఖలిస్తానీ మూకలు మళ్లీ పేట్రేగాయి. ఈసారి అమెరికాలో వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని లక్ష్యం చేసుకున్నాయి. దానిపై దాడికి ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన యత్నాన్ని సీక్రెట్ సర్వీస్ పోలీసులు విఫలం చేశారు. ఎంబసీ ఎదుట వారు హింసను ప్రేరేపించేలా ప్రసంగించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేని దౌత్యాధికారి తరన్‌జిత్ సంధును బహిరంగంగానే బెదిరించారు! ఎంబసీ కిటికీలు, అద్దాలు పగులగొట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టుకున్నారు. నిరసనలను కవర్ చేస్తున్న పీటీఐ ప్రతినిధినీ దూషించారు. ఆయన్ను నెట్టేస్తూ, ఖలిస్తానీ జెండా కర్రలతో కొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. త్రివర్ణ పతాకమున్న పోల్‌ను విరగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్, లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద కూడా ఖలిస్తానీ మూకలు గొడవలకు దిగడం తెలిసిందే. కెనడాలోని తమ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. -
లండన్‌లో 20 మంది సిక్కులు అరెస్ట్
లండన్ : లండన్‌లో భారతీయ రాయబార కార్యాలయం ఎదుట సిక్కులు చేపట్టిన శాంతియుత ఆందోళన ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారి... ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ పోలీస్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో 20 మంది సిక్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... పంజాబ్‌లో తమవారి పట్ల స్థానిక పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ... లండన్‌లోని 'సిక్కు లివ్స్ మేటర్' సంస్థకు చెందిన వందలాది మంది సిక్కులు గురువారం భారతీయ రాయబార కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని... ఆందోళన విరమించాలని పోలీసులు వారికి సూచించారు. ఆ క్రమంలో సిక్కులకు... పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. దాంతో పోలీసులపై సిక్కులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అగ్రహించిన పోలీసులు 20 మంది సిక్కులను అరెస్ట్ చేశారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించారంటూ పంజాబ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా పంజాబ్‌లోని పలు పట్టణాల్లో ఆందోళనకారులు తమ నిరసస తెలుపుతున్నారు. ఆ క్రమంలో రోడ్లను దిగ్బంధనం చేస్తున్నారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు వైఖరిపై లండన్‌లోని సిక్కులు ఆందోళనకు దిగారు.