న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఖలిస్తానీ మూకలు మళ్లీ పేట్రేగాయి. ఈసారి అమెరికాలో వాషింగ్టన్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని లక్ష్యం చేసుకున్నాయి. దానిపై దాడికి ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన యత్నాన్ని సీక్రెట్ సర్వీస్ పోలీసులు విఫలం చేశారు. ఎంబసీ ఎదుట వారు హింసను ప్రేరేపించేలా ప్రసంగించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేని దౌత్యాధికారి తరన్‌జిత్ సంధును బహిరంగంగానే బెదిరించారు! ఎంబసీ కిటికీలు, అద్దాలు పగులగొట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టుకున్నారు. నిరసనలను కవర్ చేస్తున్న పీటీఐ ప్రతినిధినీ దూషించారు.
ఆయన్ను నెట్టేస్తూ, ఖలిస్తానీ జెండా కర్రలతో కొట్టేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. త్రివర్ణ పతాకమున్న పోల్‌ను విరగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్, లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద కూడా ఖలిస్తానీ మూకలు గొడవలకు దిగడం తెలిసిందే. కెనడాలోని తమ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment