కేన్సర్ ను గుర్తించడంలో వైద్యుల్ని మించిపోయింది..! | Computer programme beats doctors at spotting brain cancer | Sakshi
Sakshi News home page

కేన్సర్ ను గుర్తించడంలో వైద్యుల్ని మించిపోయింది..!

Published Sat, Sep 17 2016 2:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

Computer programme beats doctors at spotting brain cancer

న్యూయార్క్ః బ్రెయిన్ కేన్సర్ ను గుర్తించడంలో ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్.. డాక్టర్లను మించిపోయింది. భారతీయ సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు అభివృద్ధి పరచిన కంప్యూటర్ ప్రోగ్రామ్.. న్యూరో రేడియాలజిస్టుల కంటే ముందుగా మెదడు కేన్సర్ ను నిర్థారించగలుగుతున్నట్లు అమెరికన్ న్యూరో రేడియాలజీ ఆన్ లైన్ జర్నల్ లో నివేదించిన అధ్యయనాలను బట్టి తెలుస్తోంది.

కేన్సర్ చికిత్సలో  రేడియేషన్ థెరపీ, కీమో థెరపీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ థెరపీల ద్వారా కేన్సర్ కణాలను గుర్తించి అరికట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కణతుల చికిత్సలో ముఖ్యంగా కేన్సర్ కు కారణమయ్యే కణాలను గుర్తించడమే ప్రధాన సమస్య అని.. అయితే తాము అభివృద్ధి పరచిన కొత్త కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా అనవసరమైన, ఖరీదైన బయాప్పీల జోలికి పోకుండా రేడియాలజిస్టులు కేన్సర్ ను నిర్థారించే అవకాశం ఉందని ఓహియో క్లీవ్లాండ్ లోని కేస్ వెస్టరన్ రిసోర్వ్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్లవి తివారీ తెలిపారు.

ప్రస్తుతం బ్రెయిన్ బయాప్సీ పరీక్షలు మాత్రమే కేన్సర్ ను గుర్తించేందుకు సరైన పరీక్షలుగా ఉన్నాయి. ఈ పరీక్షలు ఒక్కోసారి  అత్యంత హానికరంగానూ, ప్రమాదకరంగానూ మారుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ కొత్త కంప్యూటర్ పద్ధతిలో మెషీన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ఉపయోగించి సేకరించిన చిత్రాల ద్వారా  లక్షణాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  మొత్తం 43 మంది రోగుల ఎంఆర్ఐ స్కాన్ ల ఆధారంగా మెదడులో కేన్సర్, రేడియేషన్ నెక్రోసిస్ మధ్య భేదాలను రేడియోమిక్ లక్షణాలను గుర్తించారు. అనంతరం ఇద్దరు వైద్యులు, కంప్యూటర్ ప్రోగ్రామ్ ను టెక్సాస్ విశ్వవిద్యాలయం వాయువ్య మెడికల్ సెంటర్ లోని 15 మంది రోగుల ఎంఆర్ ఐ స్కాన్ లతో ప్రత్యక్షంగా పోల్చి విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఒక వైద్యుడు ఏడుగురు రోగులను నిర్థారించగా, రెండో వైద్యుడు ఎనిమిదిమందిని నిర్థారించారు. ఇదే సమయంలో కంప్యూటర్ మాత్రం 12 మంది రోగుల లక్షణాలను నిర్థారించినట్లు అధ్యయనాలు వివరించాయి.

Advertisement
Advertisement