
‘ఫాదర్స్ డే’ వెనుక ఓ మదర్!!
ప్రపంచవ్యాప్తంగా ‘ఫాదర్స్ డే’ను జరుపున్నాం. మహిళ త్యాగాలకు గుర్తింపుగా మదర్స్ డే ఉన్నట్లే పురుషులకూ ఓ రోజు ఉండాలనే అభిప్రాయంతోనే ‘ఫాదర్స్ డే’ను జరుపుకొంటారని చాలామంది అనుకుంటారు. నిజానికి ఫాదర్స్ డే వెనుక కూడా ఓ మహిళ.. ఇంకా చెప్పాలంటే ఓ మదర్ ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వివరాల్లోకెళ్తే...
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి చెందిన సొనోరా డాడ్ అనే మహిళ మొట్టమొదటిసారిగా ‘ఫాదర్స్ డే’ అనే భావనను ప్రతిపాదించింది. ఆమె తండ్రి విలియం స్మార్ట్‌ను సన్మానించడానికి ఓ ప్రత్యేకమైన రోజును కేటాయించాలని తలిచి, ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ భార్య 1982లో ఆరో కాన్పు సమయంలో చనిపోతే ఆ పసికందుతోపాటు అంతకుముందే జన్మించిన ఆరుగురు పిల్లలకు తల్లి, తండ్రి తానై పెంచి పెద్దచేశాడు స్మార్ట్. స్మార్ట్ సంతానంలో పెద్ద కుమార్తె సొనోరాకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాతే... పిల్లల్ని పెంచేందుకు తన తండ్రి పడిన కష్టాన్ని, చేసిన త్యాగాలను గుర్తించింది.
వెంటనే తండ్రికి ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించుకొని 1910, జూన్ 19వ తేదీన తన తండ్రిని ఘనంగా సన్మానించింది. ఇకపై ఏటా తండ్రిని సన్మానిస్తానని ప్రకటించింది. అలా జరిపిన ఈ వేడుక అమెరికాలో సంప్రదాయంగా మారిపోయింది. ఆ తర్వాత 1924లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ ‘ఫాదర్స్ డే’ను అమెరికా వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించాడు. చివరకు 1966లో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్.. ఏటా జూన్ మాసంలో మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా ప్రకటిస్తూ అధికార పత్రంపై సంతకం చేశాడు. అలా ప్రారంభమైన ఈ సంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.