విమానమెక్కిన సింహాలు
ఎక్కడైనా పాములు, కప్పల లాంటి వాటిని స్మగ్లింగ్ చేయడం చూశాం. కొన్నిచోట్ల నక్షత్ర తాబేళ్లను కూడా స్మగుల్ చేస్తారు. కానీ.. సింహాలు విమానంలో వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? ఒకటి కాదు.. రెందు కాదు.. ఏకంగా 33 సింహాలు ఒకేసారి విమానం ఎక్కాయి. కొలంబియా, పెరూ దేశాలలోని సర్కస్ కంపెనీలలో హింసకు గురవుతున్న వీటన్నింటినీ అధికారులు రక్షించి, దక్షిణాఫ్రికాకు తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో సింహాలను విమానంలో తీసుకెళ్లడం ఇదే మొదలని జంతుహక్కుల సంఘాల వాళ్లు అంటున్నారు. జ్యూస్, షకీరా అనే పేర్లు గల సింహాలను పెరూ, కొలంబియా సర్కస్ కంపెనీల నుంచి కాపాడారు.
కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురవుతున్న ఈ సింహాలు ఎట్టకేలకు మళ్లీ తమ మాతృభూమి అయిన ఆఫ్రికా అడవులకు వెళ్తున్నాయని, ఇది ఎంతో ఆనందకరమైన విషయమని యానియల్స్ డిఫెండర్స్ ఇంటర్నేషనల్ (ఏడీఐ) అధ్యక్షుడు జాన్ క్రీమర్ చెప్పారు. సర్కస్ కంపెనీల నుంచి తీసుకొచ్చిన సింహాలన్నింటికీ ఆరోగ్యసమస్యలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాటికి తగినంత ఆహారం కూడా పెట్టేవారు కాదని, అందువల్ల వాటికి పోషకాహార లోపాలు ఉన్నాయని అన్నారు. పెరూ నుంచి 24 సింహాలను కాపాడారు. వాటిని లిమా విమానాశ్రయంలోని తాత్కాలిక సంరక్షణ కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ఓ కార్గో విమానంలో ఆఫ్రికా తీసుకెళ్తున్నారు. మరో తొమ్మిది సింహాలను కొలంబియా నుంచి తెస్తున్నారు. వీటిలో ఒక సింహానికి ప్రముఖ కొలంబియా పాప్ గాయని షకీరా అని పేరు పెట్టారు.