circus lions
-
సింహంతో సర్కస్ షో.. చిన్నారిపై పంజా
మాస్కో: సర్కస్‌లో విన్యాసాలు చేయాల్సిన సింహం ఓ చిన్నారిపై దాడి చేసింది. షో చూస్తున్న నాలుగేళ్ల చిన్నారిపై పంజా విసిరి అమాంతం తినేందుకు ప్రయత్నించింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. రష్యాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్యాలోని క్రాస్నోడార్ నగరంలోని ఓ గ్రామంలో సింహంతో సర్కస్ షో నిర్వహించారు. ప్రేక్షకులు షోను భలే ఎంజాయ్ చేస్తున్నారు. సింహం ఉన్న బోనులోకి వెళ్లిన ట్రెయినర్ దానితో ఫీట్లు చేయిస్తున్నాడు. షోకి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఆ సింహం చేస్తున్న విన్యాసాలు చూస్తూ చప్పట్లు కొడుతోంది. ఇంతలోనే ట్రేయినర్ దానితో మరో విన్యాసం చేయిద్దామని పక్కకి తీసుకొచ్చాడు. సింహం అలా నేలపై ఒరిగింది. ట్రేయినర్ ప్రేక్షకుల వైపు చూస్తూ ఎదో చెప్పబోతున్నాడు. అంతే వెంటనే పరుగెత్తి బోను దగ్గరలో ఉన్న ఓ చిన్నారిపై పంజా విసిరింది. బోనులోపలకి లాక్కొచ్చి అమాంతం తినేందుకు ప్రయత్నించగా సిబ్బంది రక్షించారు. సింహం పంజా విసరడంతో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించామని షో నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రేక్షకులకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా షో నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని విచారణ కమిటి తేల్చి చెప్పింది. సర్కస్ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. రష్యాలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వసాధారణం. 2016లో నిర్వహించిన ఓ లైవ్ షోలో ఓ మహిళపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో మహిళా అక్కడికక్కడే మృతి చెందారు. 2012లో మాస్కోలో ఓ చిరుత ఏడేళ్ల బాలుడిపై దాడి చేసింది. అదే ఏడాదిలో జూపార్క్‌లో ఉన్న ఓ పులి మూడేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. -
విమానమెక్కిన సింహాలు
ఎక్కడైనా పాములు, కప్పల లాంటి వాటిని స్మగ్లింగ్ చేయడం చూశాం. కొన్నిచోట్ల నక్షత్ర తాబేళ్లను కూడా స్మగుల్ చేస్తారు. కానీ.. సింహాలు విమానంలో వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? ఒకటి కాదు.. రెందు కాదు.. ఏకంగా 33 సింహాలు ఒకేసారి విమానం ఎక్కాయి. కొలంబియా, పెరూ దేశాలలోని సర్కస్ కంపెనీలలో హింసకు గురవుతున్న వీటన్నింటినీ అధికారులు రక్షించి, దక్షిణాఫ్రికాకు తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో సింహాలను విమానంలో తీసుకెళ్లడం ఇదే మొదలని జంతుహక్కుల సంఘాల వాళ్లు అంటున్నారు. జ్యూస్, షకీరా అనే పేర్లు గల సింహాలను పెరూ, కొలంబియా సర్కస్ కంపెనీల నుంచి కాపాడారు. కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురవుతున్న ఈ సింహాలు ఎట్టకేలకు మళ్లీ తమ మాతృభూమి అయిన ఆఫ్రికా అడవులకు వెళ్తున్నాయని, ఇది ఎంతో ఆనందకరమైన విషయమని యానియల్స్ డిఫెండర్స్ ఇంటర్నేషనల్ (ఏడీఐ) అధ్యక్షుడు జాన్ క్రీమర్ చెప్పారు. సర్కస్ కంపెనీల నుంచి తీసుకొచ్చిన సింహాలన్నింటికీ ఆరోగ్యసమస్యలు ఉన్నాయని ఆమె తెలిపారు. వాటికి తగినంత ఆహారం కూడా పెట్టేవారు కాదని, అందువల్ల వాటికి పోషకాహార లోపాలు ఉన్నాయని అన్నారు. పెరూ నుంచి 24 సింహాలను కాపాడారు. వాటిని లిమా విమానాశ్రయంలోని తాత్కాలిక సంరక్షణ కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ఓ కార్గో విమానంలో ఆఫ్రికా తీసుకెళ్తున్నారు. మరో తొమ్మిది సింహాలను కొలంబియా నుంచి తెస్తున్నారు. వీటిలో ఒక సింహానికి ప్రముఖ కొలంబియా పాప్ గాయని షకీరా అని పేరు పెట్టారు.