
భారత సంతతి బాలికకు గూగుల్ ఉపకారవేతనం
జొహానెస్‌బర్గ్: భారత సంతతికి చెందిన కియారా నిర్ఘిన్ అనే 16 ఏళ్ల దక్షిణాఫ్రికా విద్యార్థిని గూగుల్ సైన్స్ సదస్సులో రూ. 33 లక్షల ఉపకార వేతనాన్ని గెలుపొందింది. కరువును తరిమికొట్టి, పంటలకు తగినంత నీరందించేందుకు ఉపయోగపడే శోషక పదార్థాన్ని రూపొందించినందుకు ఈ బహుమతి లభించింది. నారింజ పండు తోలును వాడి కియారా ఈ పదార్థాన్ని రూపొందించింది. వర్షం పడినపుడు మట్టి.. నీటిని పట్టి ఉంచడంలో ఇది సాయపడుతుంది.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను శాస్త్ర సాంకేతికతల సాయంతో ఎలా పరిష్కరించవచ్చనే విషయంపై ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లల మధ్య గూగుల్ ఈ పోటీని నిర్వహిస్తుంది.