అమెరికాకు ‘మాథ్యూ’ ముప్పు | Haiti death toll raises in Haiti, says officials | Sakshi
Sakshi News home page

అమెరికాకు ‘మాథ్యూ’ ముప్పు

Published Sat, Oct 8 2016 2:26 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాకు ‘మాథ్యూ’ ముప్పు - Sakshi

అమెరికాకు ‘మాథ్యూ’ ముప్పు

ఏ క్షణమైనా విరుచుకుపడనున్న హరికేన్
* ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ, ఉత్తర కరోలినాపై తీవ్ర ప్రభావం
* అంధకారంలో 10 లక్షల ఇళ్లు, భారీ ఆస్తి నష్టం, ఒకరి మృతి

ఫ్లోరిడా: కరేబియన్ దీవుల్ని అతలాకుతలం చేసిన హరికేన్ మాథ్యూ అమెరికాపై పెను ప్రభావం చూపుతోంది. తుపాను ఇంకా తీరాన్ని తాకకపోయినా.. భారీ వర్షాలు, గాలుల ధాటికి శుక్రవారం ఫ్లోరిడా రాష్ట్రం వణికిపోయింది.160 కిలోమీటర్ల వేగంగా వీచిన గాలులకు 10 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ నిలిచిపోయింది. భారీ వృక్షాలు పడడంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. సెయింట్ లూసీలో ఒకరు మృత్యువాత పడ్డారు.

గంటకు 192 కి.మి. వేగంతో ఏ క్షణమైనా తీరం తాకవచ్చన్న హెచ్చరికలతో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఫ్లోరిడాలోని మయామి, పోర్ట్ లౌడెర్‌డేల్, పామ్ బీచ్ వంటి భారీ జనావాస ప్రాంతాలు తుపాను ముప్పు తప్పించుకున్నా... వేరో బీచ్, డేటోనా బీచ్, కేప్ కెనవెరల్, జాక్సన్‌విల్లెలపై మాథ్యూ విరుచుపడవచ్చని అంచనా వేస్తున్నారు.
 
నాలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం
ఫ్లోరిడా తీరంతో పాటు జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా రాష్ట్రాలపై ప్రభావం అధికంగా ఉంటుందని, బలహీనపడినా ఇంకా ప్రమాదకరంగానే ఉందని అధికారులు తెలిపారు. అంట్లాంటిక్ తీర నగరాల్లో భారీ అలలు ఎగసిపడడంతో పాటు కుండపోత వర్షం, పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్‌లో గాలుల తీవ్రత 171 కి.మీ.లుగా నమోదైంది. ఫ్లోరిడా తీర ప్రాంతాల నుంచి 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరించిన చాలామంది తుపానులో చిక్కుకున్నారని, సాయం చేయాలంటూ ఫోన్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

జాక్సన్‌విల్లెలో 5 లక్షల మందిని ఖాళీచేయాలంటూ కోరినా శిబిరాలకు వెళ్లేందుకు చాలామంది ఒప్పుకోలేదు.  ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మాథ్యూను రాకాసిగా పేర్కొన్న ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్...‘తుపానును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. ఈ తుపాను మిమ్మల్ని చంపొచ్చు’ అంటూ హెచ్చరించారు.
 
2007 తర్వాత ఇదే పెద్ద హరికేన్
దశాబ్ద కాలంలో అత్యంత శక్తివంతమైన తుపానుగా మాథ్యూను వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 2007లో హరికేన్ ఫెలిక్స్ తర్వాత కేటగిరి 5 స్థాయి తుపాను ఇదే... ప్రస్తుతం బలహీనపడడంతో స్థాయిని కేటగిరి 3కు తగ్గించారు. కడపటి వార్తలు అందేసరికి హరికేన్ కేంద్రం జాక్సన్‌విల్లేకు దక్షిణ-ఈశాన్య దిశగా  ఉంది  తీరానికి సమాంతరంగా కదులుతోన్న ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున ఉత్తరం వైపుగా మళ్లుతుందని అంచనా.  వ చ్చే 24 గంటల్లో తీరం వెంట రాకాసి అలలు, 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చని అధికారులు చెప్పారు.
 
400 మంది మృతి
హైతీలో మృత్యు విలయం
పోర్ట్-ఔ-ప్రిన్స్: రాకాసి తుపాను మాథ్యూ దెబ్బకు హైతీ నామారూపాల్లేకుండా పోయింది. కరేబియన్ దీవుల్లో పేద దేశమైన హైతీ 2010 నాటి భూకంప నష్టం నుంచి కోలుకుండానే హరికేన్ ధాటికి మరోసారి మట్టి దిబ్బలా మారింది.ఆ దేశ దక్షిణ ప్రాంతంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు ప్రాథమిక అంచనా మాత్రమేనని ఇంకా పెరగవచ్చని అధికారులు ప్రకటించారు.

ఎక్కడ చూసినా నేల కూలిన ఇళ్లు, మృతదేహాలే.. వేలాది ఇళ్లు నేలమట్టమవగా లక్షలాది మంది బతుకుజీవుడా అంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క దక్షిణ ప్రాంతంలోనే దాదాపు 29 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. బహమాస్, జమైకా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, సెయింట్ విన్సెంట్, గ్రెనడాల్లోను మాథ్యూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ దేశాల్లో దాదాపు 150 మంది మరణించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement