బీజింగ్ : దేశీయంగా అభివృద్ధిచేసిన తొలి అత్యాధునిక జే–20 యుద్ధవిమానాలను చైనా తన వైమానిక దళంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని చైనా గురువారం ప్రకటించింది. అయితే, ఎన్నింటిని తయారుచేసి సైనిక అవసరాల కోసం వినియోగిస్తున్నారనే వివరాలను బహిర్గతం చేయలేదు. నాలుగో తరం మధ్యశ్రేణి, సుదూర లక్ష్య చేధక యుద్ధవిమానాలైన జే–20 ఫైటర్‌జెట్ల జాడను రాడార్లు సైతం పసిగట్టలేవు. 2011లో తొలిసారిగా చైనా వీటిని పరీక్షించింది. గత ఏడాది నవంబర్‌లో ఝుహాయ్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో తొలిసారిగా వీటిని ప్రదర్శించింది. జంట ఇంజిన్లతో తయారైన ఈ జెట్ విమానంలో ఒక్కరే కూర్చునే సదుపాయముంది. చెంగ్డు ఏరోస్పేస్ కార్పోరేషన్ వీటిని ఉత్పత్తిచేస్తోంది. నవీకరించిన జే20లను కొనేందుకు పొరుగుదేశం పాకిస్తాన్ అమితాసక్తి కనబరుస్తోంది. మెరుపువేగంతో దూసుకెళ్లడంతో అమెరికాకు చెందిన ఐదోతరం ఎఫ్–22 రాప్టర్ యుద్ధవిమానం ముందంజలో ఉంది.