ఎడారిలో తాగునీరిచ్చే పరికరం
నీటిచుక్క కనుచూపు మేరలో కనిపించని ఎడారుల్లో కూడా గాలిలోని తేమ నుంచి నీటిని ఒడిసి పట్టి స్వచ్ఛమైన మంచినీటిగా మనకందించే ఓ పరికరాన్ని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ బృందం కనిపెట్టింది. పైగా ఈ పరికరం సౌరశక్తితో పనిచేస్తుంది.
డబ్బా ఆకారంలో ఉంటే గది లోపల గాలిలోని తేమను పీల్చుకునేందుకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఓఎఫ్) అనే పలక ఉంటుంది. నీటిని పీల్చేందుకు ఈ పలకకు స్పాంజ్ లాంటి గుణం ఉంటుంది. పైగదిలో నీటిని చల్లబర్చేందుకు ఓ కండెన్సర్, మేడమీద సౌరశక్తిని గ్రహించుకునేందుకు సోలార్ ప్లేట్స్ ఉంటాయి. గాలిలోని తేమను మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ పీల్చుకుంటే సౌర విద్యుత్ ద్వారా అది వేడెక్కుతుంది. అప్పుడు ఆవిరి రూపంలో నీరు కండెన్సర్ ఉన్న గదిలోకి వెళుతుంది. కండెన్సర్ వల్ల ఆవిరి చల్లబడి మంచినీరుగా మారుతుంది.
గాలిలో నుంచి తేమను గ్రహించి మంచినీరిచ్చే ఇలాంటి పరికరాలు ఇంతకుముందే మార్కెట్‌లో ఉన్నాయి. అయితే అవి గాలిలో 50 శాతం తేమ ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇప్పుడు కనుగొన్న పరికరానికి గాల్లో 20 శాతం తేమ ఉంటే సరిపోతుంది. అంటే ఎడారిలో కూడా పనిచేస్తుందన్నమాట. ఇందులో ఉండే ఫ్రేమ్‌వర్క్ కిలోబరువుంటే 2.8 లీటర్ల మంచినీరు లభిస్తుంది. అంటే అది ఎంత ఎక్కువ బరువుంటే అన్ని నీళ్లు ఎక్కువగా వస్తాయి. నలుగురు సభ్యులుంటే కుటుంబానికి సరపడా మంచినీళ్లు కావాలంటే మొత్తం ఈ పరికరం ఓ సూట్‌కేసంత తయారుచేయాల్సి ఉంటుంది. దానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంశాన్ని ఇప్పుడే అంచనా వేయలేదని, ఇలాంటి పరికరాలను తయారు చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తే సహకరించాలన్నదే తమ అభిమతమని పరిశోధకులు తెలిపారు.