గుడ్‌బై అమెరికన్స్‌.. | Obama delivers emotional farewell in final presidential speech | Sakshi
Sakshi News home page

గుడ్‌బై అమెరికన్స్‌..

Published Thu, Jan 12 2017 2:27 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

గుడ్‌బై అమెరికన్స్‌..

గుడ్‌బై అమెరికన్స్‌..

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా వీడ్కోలు ప్రసంగం
ఉద్వేగం..  ఉద్విగ్నత మధ్య కంటతడి పెట్టిన శ్వేతసౌధాధిపతి
జాత్యహంకారం, వివక్షపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజాస్వామ్యాన్ని మనందరం పరిరక్షించుకోవాలి
విలువలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి
మనం సాధించాం.. మనం సాధించగలం..
అమెరికన్లకు ఒబామా పిలుపు
భార్య మిషెల్, కుమార్తెలపై ప్రశంసల జల్లు
ఈ నెల 20న 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్‌


నా రాజకీయ కలల కోసం.. మిషెల్‌ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. 25 ఏళ్లుగా ఆమె నా భార్య మాత్రమే కాదు, నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా. మిషెల్‌ భవిష్యత్‌ తరాలకు రోల్‌ మోడల్‌. – చమర్చిన కళ్లతో ఒబామా

జాత్యహంకారం, అసమానతలు, వివక్ష ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి వాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు అమెరికన్లంతా సిద్ధంగా ఉండాలి. మనం రాజ్యాంగానికి ద్రోహం చేయనంత వరకూ.. విలువలకు కట్టుబడి ఉన్నంత వరకూ ప్రపంచంలో ఎవరూ అమెరికాను ఓడించలేరు.    

షికాగో: ఎనిమిదేళ్ల అనుబంధం పెనవేసుకున్న పదవిని వీడుతున్నాననే ఉద్వేగం ఒకవైపు.. కొండంత బరువును దించేసుకుంటున్నాననే ఉద్విగ్నత మరోవైపు.. వెరసి చెమర్చిన కన్నులతో.. భారమైన హృదయంతో వీడ్కోలు పలికారు.. శ్వేతసౌధాధిపతి బరాక్‌ ఒబామా. ‘‘ఎస్‌.. మనం సాధించాం.. ఎస్‌.. మనం సాధించగలం’’అని నినదిస్తూ.. కుటుంబ సభ్యులు, వేలాది మంది మద్దతుదారుల నడుమ తన చిట్టచివరి ప్రసంగాన్ని ఉబికి వస్తున్న కన్నీళ్ల మధ్య ‘‘గుడ్‌బై అమెరికన్స్‌’’ అంటూ ఒబామా ముగించారు. ‘‘పెరుగుతున్న జాత్యహంకారం, అసమానతలు, వివక్ష ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి వాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు అమెరికన్లంతా సిద్ధంగా ఉండాలి’’అని అమెరికా అధ్యక్షుడిగా ఒబామా అమెరికన్లకు కడసారి పిలుపునిచ్చారు.
(చదవండి: వీడ్కోలు ప్రసంగంలో ఉద్వేగానికి లోనైన ఒబామా)

తన సొంత నగరం షికాగోలో ఒబామా అమెరికా అధ్యక్షునిగా తన వీడ్కోలు ప్రసంగాన్ని ఇచ్చారు. సుమారు 55 నిమిషాల పాటు 20 వేల మంది మద్దతుదారులను ఉద్దేశించి సాగిన ప్రసంగం తీవ్ర ఉద్వేగం.. ఉద్విగ్నత మధ్య సాగింది. 2008లో ఒబామా తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడాన్ని గుర్తు చేసేలా.. ఈ ప్రసంగం సాగడం గమనార్హం. 2008లో అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షునిగా ఎన్నికైన ఒబామా ఎనిమిదేళ్ల తర్వాత పదవి నుంచి వైదొలుగుతున్నారు. ఈ నెల 20న 45వ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌కు బాధ్యతలను బదిలీ చేయనున్నారు. అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతుందని ఈ సందర్భంగా ఒబామా హామీ ఇచ్చారు.

మీపై మీరు నమ్మకం ఉంచండి..
అమెరికన్లంతా ఆశావాదంతో ముందుకు సాగాలని, తమలో అంతర్గతంగా దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించాలని ఒబామా ఈ సందర్భంగా సూచించారు. ‘‘మార్పు కోసం మీరు నా శక్తిసామర్థ్యాలపై నమ్మకం పెట్టుకోవడం కాదు.. మీ శక్తిసామర్థ్యాలను గుర్తించాలి. మన రాజ్యాంగంలో రాసిన అంశాలపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మనం దేనినైనా సాధించగలం’’అని పిలుపునిచ్చారు. ‘‘మనం రాజ్యాంగానికి ద్రోహం చేయనంత వరకూ.. విలువలకు కట్టుబడి ఉన్నంతవరకు ప్రపంచంలో ఎవరూ అమెరికాను ఓడించలేరు’’అని చెప్పారు.

అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలి..
ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న అవరోధాలపై అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని ఒబామా హెచ్చరించారు. ‘‘మన భయాందోళనల్లోకి వెళితే ప్రజాస్వామ్యం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందువల్ల వెలుపల నుంచి ఎదురయ్యే సవాళ్ల నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు రక్షణగా నిలిచిన విలువలను కాపాడుకునేందుకు మనం ప్రయత్నించాలి’’అని సూచించారు. తాను అధికారం చేపట్టినప్పటికంటే ఇప్పుడు.. మరింత ఆశావహ దృక్పథంతో పదవి నుంచి తప్పుకుంటున్నానని అన్నారు.
(చదవండి: లాస్ట్ స్పీచ్.. ఒబామా హెచ్చరికలు!)

వివక్ష, జాత్యహంకారం ప్రమాదకరం..
ట్రంప్‌ పేరును ప్రస్తావించకుండా ఒబామా తన ప్రసంగంలో అనేక అంశాలను లేవనెత్తారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ లేవనెత్తిన ముస్లింలపై తాత్కాలిక నిషేధం తదితర అంశాలను ప్రస్తావించారు. ముస్లిం అమెరికన్లపై వివక్ష చూపడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, వారు కూడా తమ లాగే దేశభక్తి కలిగిన పౌరులే అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై చట్టప్రకారం పోరాటం చేసేందుకు తాను ప్రయత్నించానని, అందువల్ల హింసకు అడ్డుకట్ట పడిందని, చట్టాల్లో సంస్కరణలు తీసుకొచ్చి పౌరుల హక్కులకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించామని చెప్పారు. వివక్షపై అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు, ఇళ్లు, విద్య, న్యాయంలో వివక్షను అరికట్టేందుకు చట్టాలను పటిష్టం చేయాలని సూచించారు. జాత్యహంకారం ఇప్పటికీ సమాజాన్ని విభజించే కారకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
ఐసిస్‌ ఉగ్రవాద సంస్థను తుదముట్టిస్తామని, అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఒబామా హెచ్చరించారు. బిన్‌ లాడెన్‌తో పాటు వేలాది మంది ఉగ్రవాదులను హతమార్చామని, ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా నేతృత్వం వహించిందని, ఈ కూటమి ఉగ్రవాద సంస్థల నాయకులను మట్టుబెట్టిందని, వారి సగం స్థావరాలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మనం ప్రభావం ఉన్నంత వరకూ ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యా మన దరిదాపులకు కూడా రాబోవని చెప్పారు. ‘‘మీ అందరికీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించడం నాకు జీవితకాల గౌరవం’’అంటూ ఒబామా తన ప్రసంగాన్ని ముగించారు.

 మిషెల్‌.. నా బెస్ట్‌ ఫ్రెండ్‌..
వీడ్కోలు ప్రసంగం సందర్భంగా ఒబామా తన సతీమణి మిషెల్‌ ఒబామాపై ప్రసంశలు కురిపించారు. తన రాజకీయ కలల కోసం.. మిషెల్‌ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిందని పేర్కొంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఒబామా కళ్లు చెమర్చాయి. 25 ఏళ్లుగా ఆమె తన భార్య మాత్రమే కాదని, తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెపుతూ.. అధ్యక్షునిగా తన వెన్నంటి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిషెల్‌ భవిష్యత్‌ తరాలకు రోల్‌ మోడల్‌ అని కొనియాడారు. ఈ సందర్భంగా వేదిక దిగువన మొదటి వరుసలో కూర్చున్న మిషెల్, కుమార్తె మాలియా తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. సమావేశానికి హాజరైన వారంతా మిషెల్‌కు గౌరవ సూచకంగా లేచి నిలబడి అభినందనలు తెలిపారు. అలాగే తన కుమార్తెలు షాషా, మాలియాలకు ఒబామా థ్యాంక్స్‌ చెప్పారు. ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అతను తనకు సోదరునితో సమానమని కొనియాడారు. కాగా, స్కూల్‌లో పరీక్ష ఉండటం వల్ల ఒబామా చిన్న కుమార్తె ఈ సమావేశానికి హాజరుకాలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement