గ్యాంగ్ రేప్ బాధితురాలిపై జోక్.. క్షమాపణ
మనీలా: చనిపోయిన వారి గురించి ఎవరూ చెడుగా మాట్లాడరు. కానీ ఆయన తీరే వేరు. సామూహిక అత్యాచారానికి గురై హత్యగావించబడిన మహిళ గురించి ఆయన నోరు పారేసుకున్నారు. సదరు నాయకుడి నోటితీటకు సంబంధించిన పాత వీడియో తాజాగా ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో ప్రత్యర్థులు, మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయననెవరో కాదు ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రోడ్రిగొ డతెర్తా.
ఆస్టేలియాకు చెందిన జాక్వలైన్ హామిల్ అనే మహిళ దావాయొ జైలులో పనిచేసేది. 1989లో ఖైదీలు అల్లరకు దిగినప్పుడు ఆమెను ఎత్తుకుపోయి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. ఆ సమయంలో నగర్ మేయర్ గా ఉన్న రోడ్రిగొ డతెర్తా ఈ ఘటనపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'చూడడానికి అమెరికా నటిలా ఉంది. ఇంత అందంగా ఉన్న ఆస్ట్రేలియా మహిళ అత్యాచారానికి గురవడం నాకు బాధ కలిగిస్తోంది. నగర ప్రథమ పౌరుడినైన నాకే ఈ అవకాశం ముందుగా దక్కాలి' అంటూ మద్దతుదారులతో హాస్యమాడుతూ అన్నారు.
రోడ్రిగొ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనింగొ ఆక్వినొ అధికార ప్రతినిధి మండిపడ్డారు. 'రోడ్రిగొ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రేప్ ఈజ్ నాట్ ఏ జోక్' హాష్ టాగ్ తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్రిగొ మరో 'డొనాల్ట్ ట్రంప్' అంటూ కామెంట్ చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ కూడా వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై రోడ్రిగొ క్షమాపణ చెప్పారు. జోక్ చేయలేదని.. కోపంలో అలా అన్నానని, తన వ్యాఖ్యల వెనుకున్న బాధను అర్థం చేసుకోవాలని కోరారు. కాగా, మే 9న జరగనున్న ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో రోడ్రిగొ ముందంజలో ఉన్నట్టు ఈ నెల 3న నిర్వహించిన ఓపీనియన్ పోల్ లో వెల్లడైంది.