ఆడెన్/న్యూఢిల్లీ: ఆడెన్ నగరంలోని యెమెన్ అధ్యక్ష భవనాన్ని గురువారం ఆక్రమించిన షియా తిరుగుబాటుదారులను సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు శుక్రవారం తరిమికొట్టాయి. సంకీర్ణ సేనలు గురువారం రాత్రి భారీస్థాయిలో విమానాల నుంచి బాంబు దాడులు చేయడంతో రెబెల్స్ భవనాన్ని విడిచి వెళ్లారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. యెమెన్‌లోని హద్రామాత్ రాష్ట్ర రాజధాని ముకల్లాలో పలు ప్రాంతాలను అల్‌కాయిదా మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారని స్థానికులు చెప్పారు. యెమెన్ ఘర్షణల్లో 517 మంది చనిపోగా, 1,700 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
సనా నుంచి భారతీయ తరలింపు షురూ: యెమెన్ రాజధాని సనాలో చిక్కుకున్న తమ దేశీయులను విమానాల్లో తరలించే ప్రక్రియను భారత్ శుక్రవారం ప్రారంభించింది. పలు దౌత్యయత్నాల తర్వాత ఎట్టకేలకు సనాలో 120 సీట్లున్న ఎయిరిండియా విమానాన్ని దింపగలింది. ఇది రెండు సర్వీసుల్లో 351 మంది భారతీయులను జిబౌతి దేశానికి తీసుకొచ్చింది. యెమెన్‌లోని అల్ హుదదేదా నుంచి 306 మంది భారతీయులు జిబౌతి చేరుకున్నారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానాల్లో వీరిని భారత్‌కు తీసుకొస్తారు.