
లైవ్ ఇంటర్వ్యూలో చిచ్చరపిడుగు హల్‌చల్!
పిల్లలతో వ్యవహారం అంత ఆషామాషి కాదు. ఈ విషయం బీబీసీ న్యూస్ చానెల్‌కు బాగా అర్థమై ఉంటుంది. మంగళవారం ఉదయం బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ లైవ్ బులిటెన్‌లో ఓ చిన్నారి చిచ్చరపిడుగు హల్‌చల్ చేశాడు. దీంతో లైవ్ కార్యక్రమంతా రసాభాసను తలపించింది. బ్రిటన్ ష్ర్యూబరీకి చెందిన నాలుగేళ్ల హ్యారీ మెషియాచెన్ మంగళవారం తల్లి క్లారాతో కలిసి బీబీసీ లైవ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.
హ్యారీకి అరుదైన కాలేయ వ్యాధి ఉంది. మొదటి పుట్టినరోజుకు ముందే అతనికి కాలేయ మార్పిడి జరిపారు. మరోసారి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరుపాల్సి ఉంది. ఈ విషయమై మాట్లాడేందుకు బీబీసీ ప్రజెంటర్లు లూయిస్ మించిన్, బిల్ టర్నబుల్ హ్యారీని, అతని తల్లిని స్టూడియోకు పిలిచారు. వారితో గంభీరంగా లైవ్ ఇంటర్వ్యూను నిర్వహించేందుకు వారు నానా తంటాలు పడ్డారు. కానీ తుంటరి హ్యారీ వింటే కాదు. కార్యక్రమం పొడుగుతా అతను అల్లరి చేస్తూనే ఉన్నాడు. తాను కూర్చున్న సోఫాపై పిడిగుద్దులు కురిపించాడు. బిగ్గరగా నవ్వుతూ చిన్నారి హ్యారీ హల్‌చల్ చేశాడు. ఎదురుగా కనిపిస్తున్న మానిటర్‌లో ఒక్కసారిగా తనను చూసుకోవడంతో హ్యారీ ఆనందం కట్టలు తెగింది. కార్యక్రమం మొత్తం అతను బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు.
తల్లి అతన్ని బుద్ధిగా కూర్చొబెట్టేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. తొలిసారిగా తనను తాను టీవీలో చూసుకోవడంతో హ్యారీ ఆనందంతో ఇలా ప్రవర్తించాడని తల్లి వివరించింది. ఆకుపచ్చ టీ షర్ట్‌లో చూడటానికి ముద్దుగా ఉన్న హ్యారీ చేసిన అల్లరి న్యూస్ ప్రజెంటర్లకు చికాకు తెప్పించినా.. కార్యక్రమాన్ని వీక్షించినవారికి మాత్రం హ్యారీ తెగ ముద్దొచ్చేశాడట.