
హిట్లర్ అసలు గొంతు ఇలా ఉంటుంది!
లండన్: రెండో ప్రపంచయుద్ధానికి కారకుడైన జర్మన్ నియంత్ అడాల్ఫ్ హిట్లర్ మాములుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? మంచి వక్తగా పేరొందిన హిట్లర్ అధికారికంగా చేసిన ప్రసంగాల ఆడియో, వీడియో టేపులు మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన సాధారణ గొంతుతో మాట్లాడిన సంభాషణలకు సంబంధించిన ఓ సంచలన ఆడియోటేపు వెలుగులోకి వచ్చింది. 1942లో నాజీ నాయకుడు హిట్లర్ సైనిక అధికారి కార్ల్ మన్నెర్హీయంతో జరిపిన వ్యక్తిగత సంభాషణలను ఫిన్నిష్ సౌండ్ ఇంజినీర్ థోర్ డామెన్ రహస్యంగా ఈ ఆడియో టేపులో రికార్డు చేశాడు.
రష్యా వద్ద 35వేల యుద్ధ ట్యాంకులు ఉన్నట్టు తెలిసి హిట్లర్ ఆశ్చర్యపోవడం ఈ ఆడియోటేపులో వినిపిస్తుంది. సాధారణంగా హిట్లర్ తన వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేయడానికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో ఆయన సాధారణ గొంతుతో సౌమ్యంగా మాట్లాడితే ఎలా ఉంటుందనేది ప్రపంచానికి తెలియదు. అయితే ఈ ఆడియో టేపులో హిట్లర్ సాధారణ గొంతును వినవచ్చు. 'ఒక దేశం 35వేల ట్యాంకులతో ముందుకు కదలనున్నట్టు ఎవరైనా చెబితే.. మీకైమైనా వెర్రా అని నేను ప్రశ్నిస్తాను' అని హిట్లర్ అనడం ఈ ఆడియో క్లిప్పులో వినవచ్చు. ఇప్పటికే తాను 35వేల ట్యాంకులను ధ్వసం చేసినట్టు ఆయన పేర్కొనడం వినిపిస్తుంది.
నిజానికి అధికారిక పుట్టినరోజు ప్రసంగాలు, మాన్నెర్హీయం ప్రతిస్పందనను రికార్డు చేసే ఉద్దేశంతో థోర్ డామెన్ ఆడియో రికార్డింగ్ చేపట్టారు. ఇందులో భాగంగా హిట్లర్, మాన్నెర్హీయం సంభాషణను కూడా 11 నిమిషాలపాటు రికార్డు చేశారు. వారి సంభాషణ అధికారిక విషయాల నుంచి వ్యక్తిగత విషయాలకు మళ్లగానే ఈ రికార్డింగ్ నిలిపేయాల్సి ఉంది. కానీ ఆయన ఒక నిమిషం పాటు వారి వ్యక్తిగత సంభాషణను కూడా రికార్డు చేశారు. ఆ తర్వాత ఆడియో క్లిప్పును ఆయన రహస్యంగా దాచి ఉంచారు. 1950లో ఈ ఆడియో క్లిప్పు మొదట వెలుగులోకి వచ్చినప్పుడు అందులోని సౌమ్యమైన హిట్లర్ గొంతు విని.. అది నకిలీ ఆడియోటేపు అని ప్రజలు భావించారట.